నాడు అంజయ్య.. నేడు హనుమన్న

26 Apr, 2014 10:34 IST|Sakshi
నాడు అంజయ్య.. నేడు హనుమన్న

కాంగ్రెస్ పార్టీ, అందులోనూ గాంధీ కుటుంబం ప్రతిసారీ తెలుగు నాయకులను, పార్టీకి వీర విధేయులుగా ఉన్నవాళ్లను తీవ్రంగా అవమానిస్తూనే ఉంది. పదహారణాల కూలీని అని గర్వంగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి అంజయ్యను బేగంపేట విమానాశ్రయంలో అప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి పదవీ లేని రాజీవ్ గాంధీ తోసి పారేసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న వి.హనుమంతరావు (వీహెచ్)కి కూడా సరిగ్గా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా రాహుల్ గాంధీ పాల్గొంటున్న సభా వేదికపైకి ఆయనను పంపడానికి పోలీసులు నిరాకరించారు. ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్‌ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్ను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకొని, ఓ పక్కన మౌనంగా నిలబడిపోయారు. రాహుల్ గాంధీయే తలచుకుంటే వీహెచ్ లాంటి నాయకులకు వేదికపైకి అనుమతి లభించడం పెద్ద కష్టం కాదు. కానీ, రాహుల్ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని వీహెచ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి గాంధీ కుటుంబంలో దాదాపు ప్రతి ఒక్కరికీ వీహెచ్ బాగా పరిచయం అని చెబుతారు. అంత సన్నిహిత సంబంధాలున్న నాయకుడిని కూడా ఇప్పుడు కూరలో కర్వేపాకులా తీసి పక్కన పారేశారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు