లాఠీ దెబ్బలు తిన్నా, రక్తం చిందించినా.. టికెట్ రాకపాయే

11 Apr, 2014 00:06 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సామాన్యుడి కడుపు రగిలింది.. లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించి సాధించిన తెలంగాణ ఈనెగాసి నక్కల పాలైపోతోందని ఓ కార్యకర్త గుండె గాయపడింది. కార్యకర్తలు బలిపశువులై, బలిదానాలు చేసి  బతికించుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ ఇవాళ బలిసినోళ్ల జాగీరు అయిందని ఆ గుండె మండింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆత్మాభిమానం పొంగింది. అభిమాన నేత పేరును రక్తంతో రాసిన ఆ చెయ్యే తిరుగుబాటు జెండా ఎగరేసింది. నవ తెలంగాణ పున ర్నిర్మాణం అంటే ఇదేనా అని నిలదీసింది. ఇంతకాలం ఆత్మ గౌరవ పోరాటం చేసింది ఆత్మాభిమానం చంపుకోవటానికేనా? అని ప్రశ్నించింది.

 టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరయ్య యాదవ్ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన కేసీఆర్‌పై రెబల్‌గా బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే పనిచేసిన ఆయన వయసు, పైసా ఉద్యమంలో కరిగిపోయాయి. 1986 యుక్త వయసులో గొల్ల కుర్మ సంఘం నేతగా, సామాజిక ఉద్యమకారునిగా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఆయన 1997లో సమాజ్‌వాది పార్టీ తరఫున మెదక్ ఎంపీ పోటీ చేసి 35 వేల ఓట్లు తెచ్చుకున్నారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద దిక్కయ్యారు.

 ఈ 14 ఏళ్ల కాలంలో ఉద్యమానికి అండగా నిలబడ్డారు. ఉద్యమకారులకు ఊతకర్రయ్యారు. 2005-06 కాలంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్‌పై తిరుగుబాటు చేసిన సమయంలో బీరయ్య పార్టీకి అండగా నిలబడ్డారు. చెల్లాచెదురైన కార్యకర్తలను పోగేసి ఉద్యమం నడిపించారు. ఉద్యమానికి ఆర్థికంగా సహాయపడ్డారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. తెలంగాణ సాధన తప్ప మరో పదవీకాంక్ష వ్యక్తం చేయని బీరయ్య.. తెలంగాణ ఆకాంక్ష నెరవేరిన తర్వాత తన భార్యకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి జెడ్పీ చైర్మన్ చేయాలని కేసీఆర్‌ను కోరారు. చిరునవ్వుతో కేసీఆర్ ఒప్పుకున్నారు.

బీరయ్య జెడ్పీటీసీ బీఫారం ఇవ్వాలని అక్కడే ఉన్న నియోజకవర్గం నాయకులు చింతా ప్రభాకర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణను ఆదేశించినట్లు బీరయ్య చెప్తున్నారు. తీరా బీ ఫారం ఇచ్చే సమయంలోనే తనకు ఉత్తి చేతులు చూపించడంతో ఆయన మనుసు గాయపడింది. నేరుగా కేసీఆర్‌కు లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అవమానించడమే అని బాధపడ్డారు. ఆయినా ఆయన నుంచి స్పందన రాలేదు. కేసీఆర్ నామినేషన్ వేయడానికి సంగారెడ్డి పట్టణానికి వస్తే బీరయ్య ఎదురుపోయి నమస్కరించారు. అయినా కేసీఆర్ నుంచి పలకరింపు లేదు. బీరయ్య ఆత్మాభిమానం దెబ్బతింది. రగుల్‌జెండా చేతపట్టింది.

ఆ తర్వాత ఏమైందో బీరయ్య యాదవ్ మాటల్లోనే..
 ‘కేసీఆర్ అగ్రకులం భావజాలం ఉన్న  నాయకుడు. కేసీఆర్ ఎజెండా బయటపెట్టాలని 2001లోనే నేను డిమాండ్ చేశా. అప్పుడు వారం రోజుల్లోనే ఎజెండా ప్రకటించారు. చిన్న రాష్ట్రాల వల్ల చిన్న సమూహాలకు రాజ్యాధికారం వస్తుంది. పరిపాలన సౌలభ్యం జరుగుతుంది, అధికార వికేంద్రీకరణ జరుగుతుంది’ అని అంబేద్కర్ మాటలను కేసీఆర్ చెప్పారు. ఆ మాటలతోనే నేను టీఆర్‌ఎస్ ఉద్యమంలోకి వచ్చాను. ఇప్పటివరకు సుమారు కోటి రూపాయలు, విలువైన నా వయసును ఖర్చు చేశాను. లాఠీ దెబ్బలు తిన్నా... జైలుకు పోయినా.. రాజకీయ పాఠాలు చెప్పా.. సమ్మెలు చేసినా.. ఇల్లు అమ్ముకున్న.

 తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో నా రక్తం, నా చెమట, నా కష్టం ఉంది. మొన్న కూడా దానం నాగేందర్ మనుషులు వచ్చి కొడితే నరాలు చితికిపోయి చేతులు వణుకుతున్నాయి. పోలీసులు తొక్కితే మూడు రోజులు కడుపులోంచి రక్తం పడింది. ఉద్యమకారునికి ఇది మామూలే అని నా మనుసుకు సర్ది చెప్పుకున్న. వెనుకటికి ఉడుము మూతికి తేనె పూసి దొంగలు కోటలు ఎక్కేవారట. మా మెదడుకు  మేం పూసుకున్న జై తెలంగాణ సెంటిమెంటుతో ఉరికాం. కార్యకర్తలం బలి పశువులం అయ్యాం. ఇప్పుడు బలిసినోళ్లు వచ్చి టికెట్లు తీసుకుంటున్నారు.

 ఇదే కేసీఆర్‌ను నేను అడుగుతున్నా ఉద్యమం చేసిన వాళ్లకు ఎంత మందికి టికెట్లు ఇచ్చారో చెప్పండి. అందరికి ఎమ్మెల్యే పదవులే ఇవ్వాల్సిన పని లేదు. కనీసం ఎంపీటీసీలు, జెడ్పీటీసీ పదవులైనా నిఖార్సుగా ఉద్యమంలో నడిచిన వారికే ఇచ్చారో చెప్పండి చాలు. ఆయారం గయారంలు డబ్బులు చేతిలో పెట్టుకొని రావడం, టికెట్లు తీసుకోవడం,  చిన్న చిన్న పదవులు వాళ్ల  భజన పరులకు ఇచ్చుకోవడం తప్పితే మాలాంటి వాళ్లకు అవకాశం ఏది? నేను జెడ్పీటీసీ అడిగాను, కేసీఆరే ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు. నా ఉద్యమ జీవితం కనీసం జెడ్పీటీసికి కూడా పనికి రాదా? పోని నాకంటే గొప్ప ఉద్యమకారుడు ఇప్పుడు మీ పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో ఉన్నారా?  నాలాగే అన్యాయానికి గురైన బీరయ్య యాదవ్‌లు తెలంగాణ రాష్ర్టంలో చాలా మంది ఉన్నారు.

 అంతెందుకండీ నా కళ్లముందే దాదాపు 100 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని కేసీఆర్ నచ్చజెప్పారు. నిజానికి ఎమ్మెల్సీ పదవులు ఎన్ని ఉంటాయి. ఇలాంటి మాటలతో మోసం చేయొద్దనే నా నిరసన తెలియజేయడానికే కేసీఆర్‌పై రెబల్‌గా పోటీ చేశాను. తుది వరకు పోరాడుతా? గెలపు ఓటములు నాకు ముఖ్యం కాదు. జరుగుతున్న అన్యాయాన్ని నలుగురి చెప్పడమే నా లక్ష్యం.’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు బీరయ్య.

మరిన్ని వార్తలు