మందు.. బాబును మరిచినారా..?

29 Apr, 2014 01:30 IST|Sakshi
మందు.. బాబును మరిచినారా..?

ఎలక్షన్ సెల్: మద్యలక్ష్మి స్వాగతానికి వాడిన ‘మంగళ’వాద్యాలను..  రాజగురువుతో కలిసి పాడిన ‘సీసా’పద్యాలను..  అన్నకే కాదు..
 ఆశయానికీ పొడిచిన వెన్నుపోటును..  మరిచినారా..?  కన్నీటి కాసారాలైన సంసారాలను..  కూలిపోయిన కుటుంబాలను..
 ఛిద్రమైన జీవితాలను..  శిథిలమైన బతుకులను..  మరిచినారా..?  చేతకాకే ఎత్తేశామన్న చేవలేని మాటలను..  బాధతో తీసుకున్న నిర్ణయమంటూ మభ్యపెట్టే ప్రకటనలను..   అక్రమార్కులకు కళ్లెం వేయడం కోసమన్న కపటనాటకాన్ని..  మంది కోసమే మందు అన్న మార్గదర్శి మాటలను..  రాష్ట్రాన్ని ‘మద్య’ప్రదేశ్‌గా మార్చిన మందు‘బాబుల’ను..  మరిచినారా..?
 
 లిక్కర్‌తో చేసిన చీప్ ట్రిక్కులను..  బార్లా తెరుచుకున్న బార్‌లను..  గేట్లు తెంపుకొన్న సారాకొట్లను..  వళ్లు గుల్ల చేసిన కల్తీకల్లు అంగళ్లను..  ఇల్లు కొల్లగొట్టిన గొలుసు దుకాణాలను..  అడ్డగోలు అమ్మకాలకు పెట్టిన టార్గెట్లను..  మరిచినారా..?
 బాటిళ్లు వదిలి ఇంటింటికి చేరిన సారా భూతాలను..  పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టిన ‘పచ్చ’ప్యాకెట్లను..  తడి, పొడి వ్యాపారాల తెలుగుతమ్ముళ్లను..  నడమంత్రపు సిరితో నెత్తినెక్కిన ‘నిషా’చరులను..  ఖజానాను కొల్లగొట్టిన దేశం కా‘మందు’లను..
 ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకున్న మద్యం మాఫియాను..  బడుగు బతుకుల్లో పెట్టిన ‘మందు’  పాతరను..మరిచినారా..?
 
 పేదింటి కాపురాలు నిలువునా కూల్చి..  ప్రభుత్వ ఖజానా నింపుకోవాలా? రాష్ట్రాన్ని నిషా మైకంలో ముంచి.. వ్యసన మహాభూతాన్ని ఊరూరా వదిలిపెట్టి.. జేబులు కొల్లగొట్టడం మినహా మద్యానికి మరో విధానమంటూ లేకుండా చేసి.. నిరుపేదల నట్టిళ్లలో బాటిళ్లతో నిప్పు రగిలించి..  కుటుంబాలను సర్వనాశనం చేసిన ఈ పాపం ఎవరిది? ‘నారా’సురుడు రాజేసింది కాదా.. ఈ మద్య మహా దావానలం? అయినా... మహాపాపం చేసి మరెవరి మీదో ఎందుకు నెపం?
 
 నిషేధానికి తూట్లు పొడిచిన బాబు
 గ్రామంలో సారాయి అమ్మకాలు జరపకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాం. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాం. మా ఉద్యమ స్ఫూర్తితో ఎన్‌టీ రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్టు దుకాణాలను ప్రోత్సహించారు.
 -  గణేశం రవణమ్మ,
 తూర్పు దూబగుంట (నెల్లూరు జిల్లా)

 
 ఏరులై పారిన సారా
 చంద్రబాబు పాలనలో గ్రామాలు ఎడారులుగా మారాయి.  సారా ఏరులై పారడంతో అనేకమంది రోగాల బారిన పడ్డారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక సారా తయారీ తగ్గింది. సకాలంలో వర్షాలు కురవడంతో వారంతా వ్యవసాయ పనులు చేసుకున్నారు.
 - పూరేటి వెంకటరత్నం,
 చినకంచర్ల (గుంటూరు జిల్లా)

 
 తాగుబోతులను తయారు చేసిందే..బాబు
 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మద్యనిషేధానికి తూట్లు పొడిచాడు. చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడమే గాక.. పల్లెల్లో వైన్స్‌లకు అనుమతులు ఇచ్చి.. ప్రజలను తాగుబోతులుగా తయారు చేశాడు.
 - వేనేపల్లి పాండురంగారావు, మట్టిమనుషుల
 వేదిక కన్వీనర్, మిర్యాలగూడ (నల్లగొండ జిల్లా)

 
 మద్యాన్ని ఏరులై పారించాడు
 ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం  అనేది లేకుండె...అప్పట్లో దొంగచాటున అమ్మేవారిని కూడా రామారావు ప్రభుత్వం అరికట్టింది. రామారావు మరణించిన తరువాత చంద్రబాబు పాలనలో మద్యాన్ని ఏరులై పారించాడు. ఆయన హయాంలో రాష్ర్ట పాలన  భ్రష్టుపట్టింది.            
 - మల్లయ్య ,  ద్వారకా నగర్, నిజామాబాద్
 
 కుటుంబాలు రోడ్డున పడ్డాయి
 ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన మద్యపాన నిషేధానికి బాబు తూట్లు పొడిచారు. దీంతో వేలాది కుటుంబాలు వీధినపడ్డాయి. గ్రావూల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయించాడు.  అధికారంలోకి వస్తే మద్యంపై ఆంక్షలు విధిస్తామని బాబు చెబుతున్న మాటలు నమ్మటానికి వీల్లేదు.
 - మందడి సులోచన, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్, సీఐటీయూ జిల్లా సెక్రటరీ, (నల్లగొండ జిల్లా)
 
 బాబు ఊరికో బెల్టుషాపు తెరిపించారు

 ఎన్టీఆర్ హయాంలో మేం పోరాడి సాధించుకున్న మద్య నిషేధానికి చంద్రబాబు ఒక్కసారిగా తూట్లు పొడిచారు. గ్రామానికో బెల్టుషాపు తెరిపించారు. అప్పట్నుంచి పల్లెల్లో ప్రశాంతత కరువైంది. శాంతభద్రతలు అదుపు తప్పాయి.
 - చల్ల శాంతకుమారి, బాపూజీ మహిళా ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, బాడంగి (విజయనగరం జిల్లా)
 
 ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నా...
 చంద్రబాబు హయాంలో ఊరూరా బెల్టుషాపులు పెట్టారు. మగవారు తమ కూలి డబ్బుల్లో మూడొంతులు మద్యానికే తగలబెట్టేవారు. మద్యం కారణంగా మా పల్లెలోని చాలా కుటుం బాల్లో వెలుగులు ఆరిపోయాయి. నా ఇద్దరు కుమారులు కూడా మద్యం మహ మ్మారికి బలైపోవడంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది.    
 - అచ్చమ్మ, దర్శి (ప్రకాశం జిల్లా)
 
 బాబు పాపమే నాకు శాపం
 నా భర్త పేరు వసంతప్ప. ఇద్దరు ఆడబిడ్డలు. ఇద్దరం కూలి చేసి పిల్లలను పెంచుకునేవాళ్లం. మా ఆయన తాగుడుకు అలవాటు పడ్డాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు సారా అంగళ్లన్నీ మూయించేస్తే నాకు చాలా సంతోషమైంది. చంద్రబాబు వచ్చాక మళ్లీ తెరిచారు. మా ఆయన కూలీ డబ్బులన్నీ తాగుడుకే పెట్టేవాడు. చివరికి దానికే బలయ్యాడు. ఆడపిల్లలను ఎలా పెంచాలో అర్థం కాలేదు. చివరికి పాచి పనిచేసి వారికి పెళ్లిళ్లు చేశా. చంద్రబాబు చేసిన పాపమే నాకు శాపమైంది.
 - తాయమ్మ, ఆలూరు(కర్నూలు జిల్లా)
 
 చంద్రబాబు తమ్ముడిపైనే సారా కేసుంది
 చంద్రబాబు హయాంలో ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సారా వ్యాపారం చేస్తున్నాడని కేసు నమోదైంది. బాబు ఊళ్లోనే సారా వ్యాపారం జరుగుతోందని రైడ్ చేయించారు. మద్యం ముసుగులో కోట్లు దండుకున్నది బాబే. ఎన్‌టీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా నిషేధాన్ని తొలగించి రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేశాడు. బాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదు.
 -  సుబ్రమణ్యం యాదవ్, మాజీ సర్పంచ్,
  రెడ్డి వారిపల్లె(చిత్తూరు జిల్లా)

మరిన్ని వార్తలు