మే ఎఫెక్ట్ సందేహమే | Sakshi
Sakshi News home page

మే ఎఫెక్ట్ సందేహమే

Published Tue, Apr 29 2014 1:21 AM

మే ఎఫెక్ట్ సందేహమే

ముంబై: స్టాక్ మార్కెట్ తీరుతెన్నుల్లో ఎన్నో భిన్న పోకడలుంటాయి. వాటిలో తరచుగా విన్పించేది ‘మేలో అమ్మేయాలి’ అనే సిద్ధాంతం. చరిత్రను పరిశీలిస్తే.. మే నెలలో ఈక్విటీలపై నష్టాలొచ్చాయి. జపాన్ మినహా ఆసియా మార్కెట్లలో ఈ సిద్ధాంతం వాస్తవమని రుజువైంది. గత నాలుగేళ్లలో ఏప్రిల్ 30 - జూన్ 30 మధ్యకాలంలో ఈక్విటీల్లో 5-10 శాతం కరెక్షన్ జరిగిందని క్రెడిట్ సూసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈసారి కరెక్షన్ జరిగే అవకాశాలు లేకపోవచ్చు.

 జపాన్ మినహా...
 జపాన్ మినహా ఆసియా ఈక్విటీల్లో ర్యాలీని మనం ఇప్పటికే చూశాం. ప్రస్తుత స్థాయిల్లో వాల్యుయేషన్లు ఇప్పటికీ చాలా చౌకగానే ఉన్నాయి. జపాన్ మినహా ఎంఎస్‌సీఐ (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) ఆసియా సూచీ ప్రకారం కరెంట్ ప్రైస్ - టు - బుక్ 1.55గా ఉంది. గత ఐదేళ్లలో ఇదే అతి తక్కువ స్థాయి. పన్నెండు నెలల ప్రాతిపదికన చూస్తే నికర విదేశీ కొనుగోళ్లు గత ఐదేళ్లలో తక్కువ స్థాయిలో ఉన్నాయి. అంటే, స్థూల ఆర్థిక వాతావరణం మరింత మెరుగుపడితే విదేశీ ఫండ్ల కొనుగోళ్లు పెరిగి ఈక్విటీలు బుల్లిష్‌గా మారతాయి. ఆసియా మార్కెట్లు నిలకడగా ఉండి, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) నుంచి ఈ వారంలో ప్రతికూల వ్యాఖ్యానాలేవీ విన్పించకపోతే భారత్‌లో ఎన్నికల ముందు మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది.

ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్‌తో సహా దిగువ స్థాయిలో ఉన్న కొన్ని సైక్లికల్ స్టాకులపై దృష్టిసారించడం మేలు. 2008 సంక్షోభం తర్వాత నుంచీ దిగువ స్థాయిలో ఉన్న ఆ ఈక్విటీల్లో ఇటీవలే కొంతమేర కొనుగోళ్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో కేంద్రంలో అధికారం చేపట్టనున్న కొత్త ప్రభుత్వం తగిన విధాన సంస్కరణలను అమలుచేస్తే వీటిని కొనుగోలు చేయడం లాభదాయకమవుతుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్నందున వచ్చే రెండు వారాల్లో నిఫ్టీ కదలికలు అటూ ఇటూ ఉండవచ్చు, లేదా పెరగనూ వచ్చు. ఇవన్నీ గమనిస్తే గత నాలుగేళ్ల మాదిరిగా ఈసారి మే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement