కూర్పు!

23 Mar, 2014 00:00 IST|Sakshi
CONGRESS

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆశావహుల తుది జాబితా కూర్పులో నిమగ్నమైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ చేసిన సిఫార్సుల వడపోతలో నిమగ్నమైన టీపీసీసీ.. తుది జాబితాను అధిష్టానానికి నివేదించింది. సిట్టింగ్‌లతోపాటు ఆసక్తి, గెలుపు అవకాశాలు ఉన్న ఇతర ముఖ్యుల పేర్లను ఈ జాబితాలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు పేర్లు పంపించారు.

 ఇందులో ఎన్ని పేర్లు అధిష్టానానికి చేరాయన్నది బయటకు వెల్లడికాలేదు. తెలంగాణ పీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించిన తర్వాత విజయావకాశాలు, సామాజికవర్గాల సమతుల్యత పరిగణనలోకి తీసుకొని ఒకరిద్దరి పేర్లను మాత్రమే ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ జాబితాలో ఎవరికి పోటీ అవకాశం లభిస్తుందో అనే ఉత్కంఠ నేతల్లో పెరుగుతోంది. ఈ నె ల 29,30వ తేదీల్లో తుది జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించడంతో అందుకోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 14 శాసనసభా స్థానాలకు మాత్రమే టికెట్ల రేసులో ఉన్నవారి పేర్లను డీసీసీ తయారుచేసింది.

 ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కొత్త వారి పేర్లను ప్రతిపాదించలేదు. అయితే, మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విముఖత చూపుతుండడంతో ఇక్కడ ఆమె పేరును చేర్చలేదని తెలుస్తోంది. డీసీసీ పంపిన జాబితాను పీసీసీ పొన్నాల నేతృత్వంలోని ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఈ జాబితాలో స్వల్పమార్పులు మినహా అన్ని పేర్లను ఏఐసీసీకి పంపినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. దీన్ని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అభ్యర్థులను ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు