Rajasthan Elections 2023: ‘కాంగ్రెస్‌ మళ్లీ గెలుస్తుంది.. నా భవిష్యత్తు మాత్రం..’

22 Nov, 2023 16:39 IST|Sakshi

జైపూర్: మరో మూడు రోజుల్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే వస్తుందని ప్రస్తుత సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు.

ఎన్నికల ఫలితాల అనంతరం తన పాత్ర ఎలా ఉండోబోతోందన్న దానిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "నా పాత్రను పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటాను" అని అన్నారు.

ఆ సంప్రదాయం మారుతుంది
రాజస్థాన్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించి మరోసారి ప్రజామోదం పొందుతామని అశోక్‌ గెహ్లాట్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 2ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పునరావృతం చేసేలా ప్రజలు తమ మూడ్‌ని ఏర్పరచుకున్నారు. మేము 156 సీట్ల దిశగా పయనిస్తున్నామని నమ్ముతున్నాను. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు.

‘కేరళలో 76 ఏళ్ల  ఇలాంటి రికార్డును ఆ రాష్ట్ర ప్రజలు బద్దలు కొట్టారు. కోవిడ్‌ సమయంలో మెరుగైన సేవలు అందించిన ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించారు. ఇక్కడ రాజస్థాన్‌లో మేం కూడా కోవిడ్ సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించాం. కేరళ ప్రజల లాగే రాజస్థాన్‌ ప్రజలు కూడా తెలివైనవారు ప్రభుత్వాన్ని పునరావృతం చేస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీలను ఉపయోగిస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తాము అమలు చేసిన వివిధ సామాజిక పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఉపయోగిస్తున్న భాషపైనా ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు