కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ

14 May, 2014 01:32 IST|Sakshi

 చేబ్రోలు, న్యూస్‌లైన్ :తెనాలి జేఎంజే కళాశాలలో మంగళవారం నిర్వహించిన చేబ్రోలు మండలం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ పరిశీలించారు. మొత్తం 14 టేబుల్స్‌లో ఎన్నికల సిబ్బంది ముందుగా ఎంపీటీసీ ఓట్లను లెక్కించారు. అనంతరం జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. కౌంటింగ్ పక్రియ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చేబ్రోలు ఎస్‌ఐ షేక్ నాగుల్‌మీరా సాహెబ్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జేసీ వివేక్ యాదవ్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి గెలుపొందిన ఎంపీటీసీ సభ్యుల్లో కొంతమందికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎన్నికల పక్రియలో పొన్నూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీరామచంద్రమూర్తి, మండల రిటర్నింగ్ అధికారి కెజియాకుమారి, ఎంపీడీవో సీహెచ్.నరసరావు, ఇన్‌చార్జి తహశీల్దారు కె.భువనేశ్వరి, ఈవోపీఆర్డీ బి.శివసత్యనారాయణ, రెవెన్యూ, పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 తెనాలిలో..
 తెనాలిటౌన్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను స్థానిక ఎన్‌వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.జ్యోతిరమణి, సహాయ ఎన్నికల అధికారి ఎంఎల్.నరసింహారావులు ఎన్నికల సిబ్బందికి నియమ నిబంధనలను తెలియజేశారు. అధికారులు ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్  వివేక్ యాదవ్, అదనపు జాయింట్ కలెక్టర్ కె.నాగే శ్వరరావు, ఎన్నికల పరిశీలకులు ఎం.లక్ష్మీనరసింహాన్, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి సందర్శించి సిబ్బందికి సూచనలు తెలియజేశారు. డీఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ వెంకట్రావులు, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు