బీజేపీపై మండిపడ్డ ఉద్దవ్ ఠాక్రే

22 Mar, 2014 19:44 IST|Sakshi
బీజేపీపై మండిపడ్డ ఉద్దవ్ ఠాక్రే

ముంబై: బీజేపీపై ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న శివసేన మరోసారి ఆ పార్టీపై విమర్శనాస్త్రాలను సంధించింది.  పార్టీని కష్టపడి నిర్మించిన బీజేపీ అగ్రనాయకుడు ఎల్‌కే అద్వానీకి లోక్‌సభ ఎన్నికల టికెట్ కేటాయింపులో జాప్యం చేయడంపై మండిపడింది. పార్టీలో కష్టపడినందుకు ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని  శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే  నిలదీశారు. బీజేపీలో నరేంద్ర మోడీ శకం మొదలైనంత మాత్రాన అద్వానీ శకం ముగిసినట్లుకాదని బీజేపీని ప్రశ్నించింది. ‘బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలోనే అద్వానీ పేరుండాల్సింది. పార్టీని కష్టపడి నిర్మించి, వద్ధిలోకి తెచ్చిన వ్యక్తిని టికెట్ కోసం నిరీక్షించేలా చేశారు. ఇలా జరగాల్సింది కాదు’ అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో వ్యాఖ్యానించారు.

 

అద్వానీ నియోజకవర్గంపై నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ ఎందుకంత సమయం తీసుకుందని ప్రశ్నించారు. దీని వల్ల ఆయనను అవమానించినట్లయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎటువంటి మచ్చాలేని రాజకీయ కురువృద్ధుడు అద్వానీపై ఎందుకంత అలసత్వం చూపించారని ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు