యువరాజు పోటీ చేయగలరా?

3 Apr, 2014 13:31 IST|Sakshi
యువరాజు పోటీ చేయగలరా?

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అసలు ఈసారి ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయగలరా? ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు అందుకు అంగీకరిస్తాయా? తనకున్న అర్థ, అంగ బలాలను ఉపయోగించకుండా.. సాధారణ భారతీయుడిలాగే వెళ్తే అసలు రాహుల్ గాంధీకి ఈసారి ఎన్నికల బరిలోకి దిగే అవకాశమే ఉండకపోవచ్చని అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఝలక్ నుంచి ఆయనింకా కోలుకోలేకపోతున్నారు.

2011 సంవత్సరంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఆ నియోజకవర్గ కేంద్రంలోనే బ్యాంకు ఖాతా తెరవాలి. తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలన్నింటినీ ఆ ఖాతా నుంచే చూపించాలి. ఆ ఖాతాలో జమచేసిన డబ్బు విత్డ్రా చేసి, దాంతోనే ప్రచారానికి ఖర్చు పెట్టుకోవాలి. దాన్నే లెక్కల్లో కూడా చూపించాలి. ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను కూడా అభ్యర్థులు చివర్లో సమర్పించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే అంశం రాహుల్ గాంధీ ముందరి కాళ్లకు బంధంలా మారింది.

బ్యాంకు ఖాతా తెరవాలంటే తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉంటున్నట్లు నిరూపించే నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. సాధారణంగా అయితే కరెంటు బిల్లు, ఆధార్ కార్డు.. ఇలా ప్రభుత్వం జారీ చేసే పత్రాలు వేటిలోనైనా అదే నగరంలో ఉంటున్నట్లుగా చిరునామా ఉంటే అది నివాస ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది. కానీ హస్తినలోనే నివాసం ఉండే రాహుల్ గాంధీ.. అమేథీలో ఉంటున్నట్లుగా పత్రాలు సృష్టిస్తే ఎలా కుదురుతుంది? అమేథీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి నివాస ధ్రువీకరణ కోసం సర్టిఫికెట్ తీసుకోడానికి రాహుల్ గాంధీ అనుచరులు ప్రయత్నించారు. కానీ ఆయన అందుకు ససేమిరా అన్నారు. దీంతో యువరాజుకు అమేథీలో బ్యాంకు ఖాతా తెరవడం కష్టంగా మారింది. నిజానికి రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు రాహుల్ గాంధీ తలచుకుంటే అమేథీలో బ్యాంకు ఖాతా తెరవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆయనో ఫోన్ చేస్తే చాలు.. బ్యాంకు అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ అమేథీలో బ్యాంకు ఖాతా పత్రాల మీద సంతకాలు చేయించుకుని వచ్చి ఇక్కడ తెరవచ్చు. కానీ, సాధారణ భారతీయుడిలా వెళ్తే మాత్రం యువరాజు అసలు పోటీ చేయడం కూడా కష్టమే అవుతుంది. ఒక్క రాహుల్ గాంధీకే కాదు.. ఈసారి చాలామంది స్థానికేతర అభ్యర్థులకు ఇదే సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు