ధన్వాడలో ఉద్రిక్తత

21 Apr, 2014 04:27 IST|Sakshi
ధన్వాడలో ఉద్రిక్తత

కాటారం, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ గ్రామాలు రణరంగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామమైన కాటారం మండలం ధన్వాడలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పుట్ట మధు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఓయూ జేఏసీ నాయకులు, కళాకారుల బృందం ఆదివారం ధన్వాడకు చేరుకుంది. గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడికి దిగినట్లు టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
 
శ్రీధర్‌బాబు స్వగ్రామం ఇక్కడకు ఇతర పార్టీల నాయకులు రావొద్దు అంటూ వారిని గ్రామం నుంచి బయటకు పంపించినట్లు చెప్పారు. ఈవిషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధన్వాడకు చేరుకున్నారు. అదే స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సైతం అక్కడికి వచ్చాయి. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం పుట్ట మధు ధన్వాడకు చేరుకుని పార్టీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చల్ల వెంకటరెడ్డి, రాజీర్‌తో పాటు సుమారు 30 మందికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
 
ఓటమి భయంతోనే దాడులు: మధు
రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు ఆరోపించారు. చేరికల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై విరక్తి చెంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని, తనను ఆదరిస్తున్న వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. దాడి విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బొమ్మ మల్లారెడ్డి, చిలుముల శ్రీనివాస్, నాయిని శ్రీనివాస్, ఊదరి లక్ష్మణ్, పుట్ట ముఖేశ్, సర్పంచ్ మందల లక్ష్మారెడ్డి, సురేశ్, ఊదరి సత్యం ఉన్నారు.

మరిన్ని వార్తలు