కష్టాల కాపురం

6 May, 2014 01:30 IST|Sakshi
కష్టాల కాపురం

టీడీపీని ఆదరిస్తూ వచ్చిన హిందూపురం ప్రజలు  వారి గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు
 
 హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి ఆది నుంచి పట్టం కడుతూ వచ్చారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ఎన్నికలు జరగ్గా.. అన్నిసార్లూ  ఆ పార్టీ అభ్యర్థులకే అవకాశమిచ్చారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను 1989లో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఓటర్లు తిరస్కరించినా.. హిందూపురం ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మరో రెండుసార్లూ ఆదరించారు. దీంతో ఎన్టీఆర్ హిందూపురాన్ని దత్తత తీసుకున్నారు. కాగా,  చంద్రబాబు హయాంలో ‘పురం’ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. ఎన్టీఆర్‌ను ఆదరించిన ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. తాగునీరు, రహదారులు వంటి కనీస సదుపాయాలూ కల్పించలేదు.  వైఎస్ సీఎం అయ్యాకే అభివృద్ధికి నోచుకుంది. మూడు దశాబ్దాల నుంచి టీడీపీ అభ్యర్థులనే గెలిపిస్తున్నా తమను పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టీడీపీకి బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు.
 
 తొమ్మిదేళ్లూ కష్టాలే    
 
 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హిందూపురం ప్రజలను కష్టాలపాలు చేశారు. నియోజకవర్గంలోని కొడికొండ వద్ద 1977లో ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఇందులో 1979 నుంచి 1998 వరకు రోజుకు సగటున మూడు వేల టన్నుల చెరకు క్రషింగ్ చేసేవారు. రోజూ సగటున 1,200 క్వింటాళ్ల చక్కెరను ఉత్పత్తి చేసేవారు. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 473 మందికి, పరోక్షంగా 1,500 కుటుంబాలకు ఉపాధి  లభించేది. లాభాల్లో ఉన్న ఈ పరిశ్రమను చంద్రబాబు ప్రభుత్వం నష్టాల పాలు చేసింది. మొలాసిస్ విక్రయాల్లో పెట్టిన నిబంధన ఇందుకు కారణమైంది. నష్టాల సాకు చూపి చంద్రబాబు 1998లో చక్కెర ఫ్యాక్టరీని విక్రయానికి పెట్టారు.  రూ.100 కోట్ల విలువ కలిగి... 143 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీని కర్ణాటకలోని బెల్గాంకు చెందిన చంద్రబాబు సన్నిహితుడికి సంబంధించిన రేణుకా షుగర్స్‌కు రూ.5 కోట్లకే ధారాదత్తం చేశారు.

 పరిశ్రమల ప్రాణం తీశాడు!

 హిందూపురాన్ని  పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఎన్టీఆర్ భావించారు. తూమకుంట వద్ద 350 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయించారు. ఇందులో విప్రో సంస్థ 23 పరిశ్రమలను నెలకొల్పింది. దీంతో పాటు శాంతి,  గోమతి స్టీల్ ప్లాంట్లు, అజాద్, శాంశరత్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఈ పారిశ్రామికవాడపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విద్యుత్ రాయితీలను ఎత్తేసింది. దీంతో సగానికి పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. మూడు వేల మందికిపైగా కార్మికులు రోడ్డున పడ్డారు.  

 రైతుల పొట్ట కొట్టారు...

 చంద్రబాబు తన హయాంలో హిందూపురం రైతుల పొట్ట కొట్టారు.  నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షించడంలో విఫలమయ్యారు. పెన్నా, కుముద్వతి, చిత్రావతి నదులపై కర్ణాటక ప్రభుత్వం 1996-98 మధ్య అక్రమంగా వందలాది చెక్‌డ్యాంలను నిర్మించినా పట్టించుకోలేదు. దీంతో ఆ నదులు ఎండిపోయాయి. నియోజకవర్గంలో  భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. ఎగువ నుంచి నీరు రాక పెన్నార్-కుముద్వతి ప్రాజెక్టు  నిరుపయోగంగా మారింది. తమ నోట్లో దుమ్ముకొట్టిన బాబుకు గుణపాఠం చెబుతామని రైతులు అంటున్నారు.
 
 సమస్యలు తీర్చేవారికే..

 ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారు. మా కష్టాలు తీరుస్తామని చెబుతారు. వాటిని నమ్మి ఇన్నా ళ్లూ మేం ఒక పార్టీకే ఓట్లు వేస్తూ వచ్చాం. అయినా.. మా కష్టాలు తీర్చలేదు. ఆ పార్టీ వాళ్ల కథ ఇప్పుడు చెబుతాం. మా సమస్యలను తీర్చే పార్టీకే ఓటేస్తాం.
 - వెంకటలక్ష్మి, హిందూపురం.
 
 ఎమ్మెల్యే పట్టించుకోలేదు

 మా వీధిలో మురుగుకాలువలు పూడికతో నిండిపోయాయి. దుర్వాసన మధ్య చస్తూ బతుకుతున్నాం. ఇంతవరకు ఎమ్మెల్యే         మా ముఖం  చూడలేదు. ఇప్పుడు నా వద్దకు ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు?
 - ఫకృద్దీన్,హిందూపురం.
 
 వైఎస్ హయాంలో పరుగులెత్తిన ప్రగతి

 
 హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. మునిసిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని 90 శాతం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండేది. బిందెడు నీళ్లు కావాలంటే రూ.5 పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఈ సమస్యను గుర్తించిన వైఎస్.. రూ.650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని పూర్తి చేయించారు. 180 కిలోమీటర్ల దూరంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి హిందూపురానికి పైపులైన్ వేయించి.. నీటిని సరఫరా చేయించారు. ఈ పథకాన్ని ఆయన డిసెంబర్ 30, 2008న ప్రారంభించారు.   

1. హిందూపురం వద్ద 55.92 ఎకరాలలో రూ.3 కోట్లతో ఆటో నగర్‌ను ఏర్పాటు చేయించారు.
2. చంద్రబాబు పాలనలో కళ తప్పిన హిందూపురం పారిశ్రామికవాడకు వైఎస్ సీఎం అయ్యాక నూతన శోభ వచ్చింది. దీనిని ఆయన 350 నుంచి 3,500 ఎకరాలకు విస్తరించారు. మౌలిక సదుపాయాలు కల్పించి, రాయితీలివ్వడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొచ్చారు. రూ.500 కోట్లతో బెర్జర్ పెయింట్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.  
3. హిందూపురాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని వైఎస్ భావిం చారు. ఇందులో భాగంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సంస్థలు రూ.11 వేల కోట్లతో పరిశ్రమలను ఏర్పాటుచేసేలా 2008లో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే, వైఎస్ హఠాన్మరణంతో ఆ పరిశ్రమలు ఏర్పాటుకు నోచుకోలేదు.
4.    హిందూపురం వద్ద ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్‌సీ) రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి 2008లో కేంద్రాన్ని  వైఎస్ ఒప్పించారు. ఆయన మరణంతో  కేంద్రం దానిని పక్కన పెట్టింది.
 
 

మరిన్ని వార్తలు