రైతు తృప్తిగా జీవించాలన్నదే లక్ష్యం

1 May, 2014 04:07 IST|Sakshi
రైతు తృప్తిగా జీవించాలన్నదే లక్ష్యం

- సాగునీరు సక్రమంగా అందాలి
- తాగునీటి సమస్య పరిష్కరించా
- నరసన్నపేట వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణదాస్

 
 నరసన్నపేట, న్యూస్‌లైన్: రైతులంతా తృప్తిగా జీవించాలని, పేదవాడి ముఖంలో నిరంతరం చిరునవ్వు కని పించాలన్నదే లక్ష్యమని నరసన్నపేట నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కరించానని చెప్పారు. సక్రమంగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నానన్నారు. ‘న్యూస్‌లైన్’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

 న్యూస్‌లైన్: రైతులకు ఏమి చేయాలనుకుంటున్నారు?
 కృష్ణదాస్: వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కోట్లాది రూపాయలతో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించాను. వీటిలో కొన్ని మరమ్మతులకు గురై పని చేయడం లేదు. వీటన్నింటిని బాగు చేయించి రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చూస్తాను.

 న్యూస్‌లైన్: వంశధార ఓపెన్ హెడ్ చానల్స్ విషయంలో ఏమి చేయాలని అనుకుంటున్నారు..?
 కృష్ణదాస్:
నరసన్నపేట, పోలాకి, జలుమూరులో కొంత ప్రాంతం రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు వంశధార ఓపెన్‌హెడ్ చానల్స్ నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపాను. వైఎస్ హయాంలో దీన్ని మంజూరు చేయించాను. అప్పట్లో రూ. 25 కోట్లతో పూర్తి కావాల్సిన ఈ పథకాలు ఆ తరువాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ. 90 కోట్లు బడ్జెట్‌కు చేరుకుంది. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే వీటి కోసం ఒత్తిడి చేసి నిధులు మంజూరు చేయించి ఓపెన్‌హెడ్ చానల్స్ నిర్మాణం తొందరగా జరిగేలా చూస్తా.

 న్యూస్‌లైన్: తాగునీటి సమస్యపై మీరు ఏమంటారు?
 కృష్ణదాస్: చాలా వరకు తాగునీటి సమస్య పరిష్కరించాను. ప్రధానంగా తీర ప్రాంత ప్రజలకు ఈ సమస్య ఎదురు కాకుండా వైఎస్ హయాంలో 40 గ్రామాలకు ప్రత్యేక  పథకం రూపొందించా. ఈ పథకాన్ని మరింత మెరుగు పరిచి ఎక్కడా మంచినీటి సమస్య లేకుండా చూస్తా.

 న్యూస్‌లైన్: నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి?
 కృష్ణదాస్:  ప్రతీ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరిగింది. ఉడా నిధులతో టౌన్‌లో, నాబార్డు నిధులతో గ్రామీణ ప్రాంతాలకు లింక్ చేస్తూ రోడ్ల నిర్మాణం జరిగింది. మరిన్ని రోడ్ల పూర్తికి కృషి చేస్తా.

న్యూస్‌లైన్: పేదలకు ఇళ్ల మంజూరుపై ఏమంటారు?
కృష్ణదాస్: తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలోపలే దివంగత నేత వైఎస్‌ని నరసన్నపేటకు ఆహ్వానించాను. నరసన్నపేట, సత్యవరం సభల్లో 800 ఇళ్లు మంజూరు చేశారు. 70 శాతం వరకు నిర్మాణం పూర్తయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటికీ చాలామంది ఇళ్ల కోసం తిరుగుతున్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాను.

 న్యూస్‌లైన్: నరసన్నపేటలో ఇండోర్‌స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది?
 కృష్ణదాస్: ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. ప్రభుత్వం కూడా స్పందించి స్థల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో ప్రజాస్పందన ఎలా ఉంది?

కృష్ణదాస్: ప్రజా స్పందన చాలాబాగుంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎప్పుడు వేయాలా అని జనం ఎదురు చూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు