వసూల్ రాజా!

26 Mar, 2014 01:43 IST|Sakshi
వసూల్ రాజా!

సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆయనొక పార్టీ జిల్లా అధ్యక్షుడు. సంపాదన కోసం పరితపిస్తున్నారు. సొమ్ము చేసుకోవడానికి సరైన అధికారిక పదవి దక్కలేదని ఏళ్ల తరబడి అసంతృప్తిగా ఉన్న ఆయనకు అనూహ్యంగా లభించిన జిల్లా పార్టీ పదవిని ‘క్యాష్’  చేసుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల బీ-ఫారాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే అప్రతిష్టను మూటగట్టుకున్నారు...   తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని, చైర్‌పర్సన్ పదవికి లైన్ క్లియర్ చేస్తానని ఆశావహుల నుంచి డబ్బు గుంజుతున్నారు.

దీంతో సొమ్ముతో పాటు వసూలు రాజాగా బాగా పేరు గడించారు.  అప్పుడప్పుడు పోటీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. ఎన్నికల్లో ఓటమి తప్ప విజయం దరిచేరడం లేదు. దీంతో ఎన్నాళ్లైనా ఇలాగే ఉండిపోతున్నాన్న ఆవేదన ఒక పక్క,  కూడబెట్టుకోవడానికి అవకాశం దక్కడం లేదన్న బాధ మరో పక్క ఆయన్ను పీడించాయి. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. ఎన్నికల రాక ముందు నమ్మకంగానే పనిచేశారు. అధినేతల అడుగుజాడలో నడుస్తూ, వంగి వంగి నమస్కారాలు పెట్టి గురుభక్తి చాటుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు రావడమే తరువాయి చెలరేగిపోవడం మొదలు పెట్టారు. తొలుత మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి రూ. లక్షలు తీసుకున్నారు.

దీనిపై పార్టీలో కూడా వివాదం చోటు చేసుకుంది. గొడవ పడేవరకూ  కార్యకర్తలు వచ్చారు. ఇదే విషయమై అధినేతలు సంజాయిషీ కోరినట్టు తెలిసింది. అయినా ఆయన  మారలేదు. ఎంపీటీసీ బీ-ఫారాలు ఇచ్చేందుకు కూడా సొమ్ము వసూలు చేశారు.ఇదొక వైపు జరుగుతూనే మరోవైపు జెడ్పీ పదవులకు అడ్డు రాకుం డా ఉంటానని, తనవంతు సహకారమందిస్తానని చెప్పి ఆశావహుల నుం చి పెద్ద ఎత్తున వసూలు చేశారు. అలాగే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని కూడా కొంతమంది నుంచి  రూ.20లక్షల నుంచి రూ.40లక్షల వరకు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.  

ఇప్పుడాయన ఆ పార్టీలో హాట్ టాపి క్ అయ్యారు. అధికారంలో లేనప్పుడే ఇంత దందా చేస్తుంటే చేతిలోకి అధికారం వస్తే ఇంకెంత రెచ్చిపోతారోనన్న చర్చ మొదలైంది. అంతా అధికారం కోసం పాకులాడుతుంటే పార్టీ పదవితో  డబ్బులు కోసం ఆరాటపడుతున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయన గురిం చి ఆ పార్టీలోని నాయకులను కదిపితే ఆయనకిదేమీ కొత్తకాదని,  కాకపోతే ఇప్పుడు మరింత ఎక్కువగా గడిస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి ఆయ న తీరుతో పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు