లింగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్!

16 Apr, 2014 03:28 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తాజా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సర్వశక్తులు ఒడ్డినా సిట్టింగ్‌ను తప్పించేందుకు చంద్రబాబు సమ్మతించలేదు. మెప్పించి, ఒప్పించాలనే సూత్రం విఫలం కావడంతో లోపాయికారీగా అధినేత సైగలు చేసినట్లు సమాచారం. ఆ మేరకు నామినేషన్ దాఖలుకు లింగారెడ్డి  సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
 చినబాబు పర్యటనపై టికెట్ల గందరగోళం పడకుండా ఉండేందుకు పర్యటన ముగిసిన అనంతరం లింగారెడ్డి పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. జిల్లాలో ఒకేఒక స్థానంలో తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో గెలుపొందింది.  ప్రొద్దుటూరు  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నంద్యాల వరదరాజులరెడ్డిపై 16వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో లింగారెడ్డి  గెలుపొందారు. రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ప్రొద్దుటూరు  ఎమ్మెల్యేగా ఉన్న లింగారెడ్డిలో అంతర్మధనం తీవ్రతరమైంది. టికెట్‌కు ఎక్కడ అడ్డు పడుతాడోనని మదనపాటుకు గురయ్యారు. అనుకున్నంతా అయింది, మాజీ ఎమ్మెలే వరదరాజులరెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిలిచారు. చంద్రబాబు ఎదుట ఆయనకు అనుకూలంగా పలురకాల వాదనలు చేసినట్లు సమాచారం.
 
  తలొగ్గని లింగారెడ్డి....
 సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే చెడు సంకేతాలు వెళ్తాయని, లింగారెడ్డిని మెప్పించి, ఒప్పించుకోవాలని అధినేత చంద్రబాబు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సూసించినట్లు తెలుస్తోంది. ఆమేరకు వరదరాజులరెడ్డి కోసం రమేష్ నాయుడు పలు రకాలుగా లింగారెడ్డికి ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. ఇవేవి తనకు వద్దు..తెలుగుదేశం పార్టీ టికెట్ మాత్రమే కావాలనే దిశగా లింగారెడ్డి చర్యలు ఉండిపోయినట్లు తెలుస్తోంది. తుదకు చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో నామినేషన్ కార్యక్రమ సన్నాహాలలో  ఉన్నట్లు సమాచారం. ఈవిషయమై మాజీ ఎమ్మెల్యే వరద అనుచరులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. తమ మద్దతు లేకుండానే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలరా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బుధవారం చంద్ర బాబు తనయుడు లోకేష్ పర్యటన ఉన్న నేపధ్యంలో  లింగారెడ్డిపేరును అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. పర్యటనపై ప్రభావం చూపకుండా ఉండేందుకు గోప్యంగా ఉంచినట్లు సమాచారం.
 
 రైల్వేకోడూరుపై తర్జన భర్జన....
 రైల్వేకోడూరు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే అతని కంటే మెరుగైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వరప్రసాద్ పేరును కాంగ్రెస్ నేత ఒకరు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.  గుంటి  ప్రసాద్‌కు టికెట్ ఇచ్చినట్లయితే తాను కూడ మద్దతిస్తానని టీడీపీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఆమేరకు ప్రస్తుతం తర్జన భర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిని ప్రకటించాక వెనక్కి తగ్గితే ప్రతికూల వాతావరణం  ఏర్పడుతుందనే  అంశంపై పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఆమేరకు పార్టీ శ్రేణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత నుంచి సంపూర్ణ అభయం లభిస్తే పార్టీ అభ్యర్థిని మార్చే అవకాశం మెండుగా ఉన్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు