మోడీకి మండింది!

24 Apr, 2014 02:02 IST|Sakshi
మోడీకి మండింది!

 హైదరాబాద్ సభ వైఫల్యంపై ఆగ్రహం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ-టీడీపీల మధ్య సమన్వయం లేకపోవటంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తీవ్ర అసహనంగా ఉన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో ఆయన పార్టీ నేతలపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల బీజేపీకి లాభం కంటే నష్టమే జరిగే అవకాశం ఉందని ఆయన అంచనాకు వచ్చినట్టు సమాచారం. చివరకు ఇది బలవంతపు పెళ్లిలా మిగులుతుందనే ఆందోళనను ఆయన  వ్యక్తం చే స్తున్నట్టు తెలుస్తోంది. పొత్తు కుదుర్చుకునే సమయంలో రెండు పార్టీల మధ్య వివాదాలు చెలరేగినా.. తర్వాత అవి సద్దుకుంటాయని భావించిన మోడీకి, ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ వాస్తవాన్ని కళ్లకు కట్టింది. దీంతో సభ జరిగిన తీరుపై ఆయన తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ‘అనవసరంగా నా సమయాన్ని ఎందుకు వృథా చేశారు. సభను విజయవంతంగా నిర్వహించలేని పరిస్థితి ఉంటే ముందే చెప్పొచ్చు కదా. ఆ సమయాన్ని నేను మరో రాష్ట్రానికి కేటాయించి ఉండేవాన్ని. విలువైన సమయాన్ని మీకు కేటాయిస్తే ఇలా చేస్తారా’ అంటూ రుసరుసలాడారు. తెలంగాణలో బీజేపీ బలం బాగా పెరిగిందని, ఈసారి ఎక్కువ స్థానాలు గెలిచి కానుకగా సమర్పిస్తామని మోడీకి చెప్పుకున్న నేతలు... బహిరంగ సభను కూడా సరిగా నిర్వహించలేక  ఆయన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.  నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ సభలు జరిగిన తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, కీలకమైన రాజధాని నగరంలో జరిగిన సభ విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. మిగతా మూడు సభలను చుట్టివచ్చిన మోడీ ఇక్కడ... ఆ సభల్లో ఉన్నంత జనం కూడా కనిపించకపోయేసరికి అవాక్కయ్యారు. వేదికపైకి వచ్చాక ఆయన హావభావాలే దాన్ని స్పష్టం చేశాయి. పార్టీ స్థానిక నేతలతో అంటీముట్టనట్టు వ్యవహరించారు. సభా కార్యక్రమం పూర్తయ్యాక పార్టీ ప్రచార గీతాలతో కూడిన సీడీని ఆవిష్కరించాల్సి ఉన్నప్పటికీ ఆయన వేగంగా వేదిక దిగి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లే సమయంలో ఆయన పార్టీ తెలంగాణ  నేతలను దీనిపై వివరణ కోరారు.
 
 కమలనాథులకు చేయిచ్చిన తెలుగు తమ్ముళ్లు!
 
 ఈ సభను దృష్టిలో ఉంచుకుని ఆరు రోజుల క్రితం బీజేపీ-టీడీపీ సమన్వయ కమిటీ నేతలు ఓ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన ఇరు పార్టీల అభ్యర్థులు, జిల్లాల అధ్యక్షులు జనసమీకరణపై చర్చించారు.  కానీ తీరా సభ రోజు టీడీపీ అభ్యర్థులు చేతులెత్తేశారు. ఈ విషయాన్ని కమలనాథులు మోడీ దృష్టికి తెచ్చారు. పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు ప్రచారంలోగాని, సభల విషయంలో గాని కలసి రావడం లేదని ఫిర్యాదు చేశారు. మోడీ సభ అనగానే ప్రజలు స్వచ్ఛందంగా వస్తారన్న ఉద్దేశంతో కొందరు బీజేపీ అభ్యర్థులు కూడా జనసమీకరణ జరపలేదని తెలుస్తోంది. దీంతో పార్టీ ఇన్‌చార్జి జవదేకర్ బుధవారం నగరంలోనే ఉండి వచ్చే నాలుగైదు రోజుల్లో సుష్మాస్వరాజ్ సహా ఇతర జాతీయ నేతలతో ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై బీజేపీ నేతలతో సమాలోచనలు జరిపారు.
 
 మరోసారి వస్తే అద్భుతంగా నిర్వహిస్తాం..
 
 తెలంగాణలో నెలాఖరున మరో సభకు అవకాశం ఇస్తే అద్భుతంగా నిర్వహిస్తామని జవదేకర్, మోడీని కోరారు. ఆరోజు ఉదయం తెలంగాణలో, సాయంత్రం సీమాంధ్రలో సభలు నిర్వహిస్తే రెండు ప్రాంతాలకు కలిసి వస్తుందని సూచించారు. దీంతో తర్వాత చెప్తానని మోడీ పేర్కొన్నట్టు సమాచారం.
 
 ఆదిలాబాద్‌లో చంద్రబాబు... కిషన్‌రెడ్డి... కానీ ఎవరికివారే
 
 పొత్తు కుదుర్చుకున్నప్పటికీ రెండు పార్టీలమధ్య ఇప్పటికీ సమన్వయం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. మోడీ సభలకు జనసమీకరణలో రెండు పార్టీలమధ్య సమన్వయలేమి కనిపించగా... బుధవారం కీలక నేతల ప్రచారంలోనూ ఇదేతీరు కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలో నాలుగు చోట్ల టీడీపీ, మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉన్న బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, నిర్మల్‌లలో చంద్రబాబు పర్యటించగా, ఆదిలాబాద్‌లో కిషన్‌రెడ్డ్డి ప్రచారం చేశారు. ఒకే జిల్లాలో ఉండికూడా వారు ఎవరికివారుగా ప్రచారం చేయటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు