సురాజ్యం కోసమే బతుకుదాం: మోడీ

16 May, 2014 18:36 IST|Sakshi
సురాజ్యం కోసమే బతుకుదాం: మోడీ

బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. వడోదరను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెసేతర పార్టీ ఒకటి పూర్తిస్థాయిలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిందని అన్నారు. ఇంకా ఆయనేం మాట్లాడారంటే...

పొద్దుటనుంచి ఏదో ఒకటి మాట్లాడాలని మీడియా మిత్రులు అంటున్నారు. కానీ నేను మాత్రం, మాట్లాడితే.. గెలిచాకే, అదికూడా ప్రజలతోనే అనుకున్నాను. నామీద హక్కు ప్రజలకే ఉంది. ఈవాళ మీకు ఎలా అనిపిస్తోందో చెప్పండి. శుభదినమా.. శుభదినమా.. వాహ్.. మిమ్మల్నందరినీ అభినందించడానికి, మీకు కృతజ్ఞతలు చెప్పడానికే ఈరోజు ఇక్కడకు వచ్చాను. రాబోయే 60 ఏళ్లలో దేశానికి నాలాంటి సేవకుడు దొరకడు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక చాలావరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఎప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చినా, సంకీర్ణ ప్రభుత్వాలే వచ్చాయి. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వం కూడా పలు పార్టీల సంగమమే. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తిస్థాయిలో కాంగ్రెసేతర.. ఒకే ఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. రాజకీయ పండితులు కూడా దీన్ని ఊహించలేదు. స్వతంత్రం తర్వాత పుట్టిన తరానికి మొట్టమొదటిసారి అధికార పగ్గాలు వచ్చాయి. స్వరాజ్యం కోసం మనం పోరాడలేకపోయాం గానీ సురాజ్యం కోసం మనం బతకగలం. దేశ పౌరులు ఒక్కొక్కరు ఒక్కో ముందడుగు వేసినా మనం 125 కోట్ల అడుగులు వేయగలం. బంగారు భవిష్యత్తు కోసం కృషిచేద్దాం. 125 కోట్ల భారతీయులందరూ నావాళ్లే. వాళ్లకోసం నేను పనిచేస్తా.

ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా అభ్యర్థిగా నాకు అద్భుతమైన విజయం వచ్చింది. వడోదరలో నామినేషన్ దాఖలుచేసిన తర్వాత 50 నిమిషాలు మాత్రమే కేటాయించాను. కానీ నాకు 5.70 లక్షలకు పైగా మెజారిటీ అందించారు. వడోదర ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నాను. మీరు నాకు అందించిన ప్రేమ అపూర్వం. ఒక్కొక్క ఓటరు ఒక్కో నరేంద్రమోడీలా మారి పనిచేశారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరైనా అభ్యర్థికి తన ఓటర్లతో మాట్లాడే అవకాశం లభించకపోవడం ఈసారే జరిగింది. వారణాసిలో మోడీ మౌనానికే ఓట్లేశారు. అక్కడ అభ్యర్థిగా ఉన్నా నాకు ప్రచారం చేసుకునే అవకాశం రాలేదు. అయినా కూడా మోడీ మౌనానికి వారణాసి వాసులు ఓట్లు వేసిన తీరు భారతదేశ చరిత్రలోనే అద్భుతం. ఐదేళ్ల భారతదేశ చరిత్రలో మీరు కొత్త రికార్డు సృష్టించారు. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటివరకు 5.70 లక్షల ఓట్ల మెజారిటీ ఎవరికీ రాలేదు. నేను ఉప ఎన్నికల విషయం మాట్లాడట్లేదు. వడోదరలో మాత్రమే ఇది సాధ్యమైంది.

ఎన్నికల కమిషన్కు, దేశవాసులకు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న మీడియాకు ఒకటే విజ్ఞప్తి. గుజరాత్లో వడోదర పౌరులు ప్రజాస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టారు. ఓటర్లు, పౌరసమాజం, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, న్యాయవాదులు.. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఓటరు చైతన్యం చూపించారు. ఇది చాలా పెద్ద విజయం. ఇందుకుగాను పౌరులను అభినందిస్తున్నాను. మోడీ ఎక్కడున్నా కూడా మీ హృదయాల్లోనే ఉంటాడు. గుజరాత్లో ఉన్న మొత్తం 26 సీట్లను బీజేపీకి అందించినందుకు కృతజ్ఞతలు. దాదాపు 60 శాతం ఓటింగ్ ఇక్కడ బీజేపీకి వచ్చింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డు.

మరిన్ని వార్తలు