ఇద్దరు భర్తలు... ఇద్దరు భార్యలు...ఒక్క ఎంపీ సీటు

2 Apr, 2014 10:56 IST|Sakshi
ఇద్దరు భర్తలు... ఇద్దరు భార్యలు...ఒక్క ఎంపీ సీటు

ఈ లోకసభ ఎన్నికల్లో బెంగుళూరు సౌత్ లో చాలా ఆసక్తిదాయకమైన పోటీ నెలకొంది. ఐటీ రంగ దిగ్గజం నందన్ నీలేకని, ఓటమినెరుగని బిజెపి నేత అనంతకుమార్ లు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. నీలేకని కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, అనంతకుమార్ బిజెపి నుంచి పోటీ పడుతున్నారు. ఇద్దరు నాయకుల భార్యలు కూడా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అనంత్ కుమార్ భార్య తేజస్విని, నీలేకని భార్య రోహిణి ల ప్రచార శైలి కూడా చాలా భిన్నం.


రోహిణి రాజకీయాలకు కొత్త. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లడం ఆమెకు అలవాటు లేదు. ఐటీ ఉద్యోగులతో కలిసి మాట్లాడటం కాస్త సులువుగానే ఉన్నా మిగతా ప్రజలతో ఆమె కలవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. అసలు భర్త రాజకీయాల్లోకి వస్తారన్న విషయాన్ని ఆమె ఏనాడూ ఊహించలేదు. ఆమె ఇప్పటికీ జీర్ఝించుకోలేకపోతోంది. అయితే మారిన పరిస్థితులకనుగుణంగా తనను తాను మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


తేజస్విని అనంత్ కుమార్ 1988 నుంచే ప్రజా జీవనంలో ఉన్నారు. ఆమెకు ప్రజలను కలవడం బాగా అలవాటు. నిజానికి అనంత్ కుమార్ కు మొదటి నుంచీ ఆమె వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అసలు అనంత్ సక్సెస్ కు కారణం తేజస్వినే అని చాలా మంది చెబుతున్నారు. ఆమె గతంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ విభాగంలో పనిచేశారు. భర్త క్రియా శీల రాజకీయాల్లోకి రాగానే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిని, భర్త కార్యాలయాన్ని మేనేజ్ చేస్తున్నారు.


నందన్ ఆస్తులు 770 కోట్లు. ఆయనకు ఇన్ఫోసిస్ లో 1.45 శాతం షేర్లున్నాయి. రోహిణికి కూడా 1.30 శాతం షేర్లున్నాయి. అనంత్ కుమార్ భార్యకు 4/2 కోట్ల ఆస్తి, అనంతకుమార్ కి 51.13 లక్షల విలువైన ఆస్తులున్నాయి.

మరిన్ని వార్తలు