‘నెట్’ ఇంట రాజకీయ సందడి

27 Mar, 2014 01:14 IST|Sakshi
‘నెట్’ ఇంట రాజకీయ సందడి

ఇంటర్నెట్ ప్రచారంపై పార్టీల దృష్టి
కీలక వేదికగా సోషల్ మీడియా
160 ఎంపీ స్థానాల్లో ప్రభావం

 
 వనం దుర్గాప్రసాద్:  రాజకీయాలు నట్టింట్లోకే కాదు, ‘నెట్’ ఇంట్లోకి కూడా చొచ్చుకొచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇంటర్నెట్‌లో రాజకీయ సందడి కొన్నేళ్లుగా బాగా ఊపందుకుంది. ఎంతగా అంటే సచిన్ పైలట్ వంటి యువ నేత మొదలుకుని ఎల్‌కే అద్వానీ వంటి కురు వృద్ధుడు కూడా తమ అభిప్రాయాల వెల్లడికి ప్రధానంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సైట్లనే మాధ్యమంగా ఎంచుకునేంతగా! 2009 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని సోషల్ మీడియా ఇప్పుడు వీర లెవెల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా 2013లో ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఢిల్లీలోనైతే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయంలో కీలక పాత్ర సోషల్ మీడియాదేనంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు దేశవ్యాప్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఈసారి సగటున 90 వేల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.
 
 వీరంతా 18-22 ఏళ్ల లోపు వారే. వీరిలో పట్టణ ప్రాంత యువ ఓటర్లు నిరంతరం ’నెట్‌‘ ఇంట్లో తచ్చాడేవారే. సోషల్ మీడియాను అంటిపెట్టుకుని ఉండేవారే. అందుకే సార్వత్రిక ఎన్నికల వేళ యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ సోషల్ మీడియానే ప్రచార వేదికగా మార్చుకున్నాయి. ఇందుకోసం దాదాపుగా పార్టీలన్నీ ప్రత్యేకంగా బృందాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ఎలాగోలా ’నెట్‌‘ ఇంట్లో తిష్ట వేయగలిగితే సగం సమరాన్ని గెలిచేసినట్లేనని అవి భావిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ఈసారి ఏకంగా 160 లోక్‌సభ స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయవచ్చని ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త సర్వేలో తేలింది!
 
 సోషల్ యూజర్లు... పెను ప్రభావం
 సోషల్ మీడియా యూజర్లు ఒక్కొక్కరు కనీసం ముగ్గురిపై ప్రభావం చూపగలరనే అంచనాలు ఉన్నాయి. వారిలో చాలామందికి తమ కుటుంబ సభ్యులను, సన్నిహితులను ప్రభావితం చేసే సామర్థ్యముందని డిజిటల్ మార్కెటింగ్ సంస్థ ’పింట్ స్టార్మ్‌‘ అధినేత మహేశ్ మూర్తి అంటారు. పైగా ఇంటర్నెట్ ప్రచారం చాలా ప్రభావవంతమైనది మాత్రమే కాదు, మిగతా పద్ధతులతో పోలిస్తే కారుచౌక కూడా. అందుకే ఈ ఎన్నికల్లో పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఆన్’లైన్‌‘లో పడ్డాయి. తమ అభిమాన పార్టీల కోసం యువత ఉద్యోగాలను వదులుకుని మరీ సోషల్ మీడియాలో పూర్తిస్థాయి ప్రచారానికి అంకిత మవుతుండటం విశేషం. ఢిల్లీకి చెందిన సీమా అనే జర్నలిస్టు కొద్ది నెలల క్రితం ఉద్యోగం వదిలేసి బీజేపీ తరఫున సోషల్ మీడియా ప్రచారానికి అంకితమయ్యారు. అది కూడా ఉచితంగా! అదేమిటంటే, అన్నింటినీ డబ్బుతోనే ముడిపెట్టలేమంటున్నారు. ఒక బహుళజాతి సంస్థలో మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రమేశ్ శర్మ కూడా అంతే. ‘ఫేస్‌బుక్’, ‘ట్విట్టర్’లలో కాంగ్రెస్ తరఫున ఉచితంగా ప్రచారం చేస్తున్నారాయన.
 
 ‘సోషల్’ ఖర్చూ
 అభ్యర్థుల ఖాతాకే...
 సోషల్ మీడియాలో ప్రచారానికి, వెబ్‌సైట్లలో ప్రకటనలకు వెచ్చించే మొత్తాలను కూడా అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులో చేర్చాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని పాటించారు. అయితే సోషల్ మీడియా ప్రచార ఖర్చును ఎన్నికల ఖర్చులో చేర్చడం లోక్‌సభ ఎన్నికల్లో ఇదే మొదటిసారి. అంతేగాక సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసే ముందు వాటికి తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాలని కూడా ఈసీ నిబంధనవిధించింది.
 
 నేతల హై‘టెక్కు’లు
 సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించిన పలువురు నేతలు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ’ఫేస్‌బుక్‌‘, ’ట్విట్టర్‌‘ల ద్వారా నిరంతరం తమ సిద్ధాంత రాద్ధాంతాలను ప్రచారంలో పెడుతున్నారు. అద్వానీ వంటివారైతే ’నెట్‌‘ ఇంట ’బ్లాగో‘తమే వినిపిస్తున్నారు! ’ఆప్‌‘ ప్రారంభించిన ’ఇండియా అగెనైస్ట్ కరప్షన్‌‘ వెబ్ పేజీకి కోట్ల సంఖ్యలో హిట్లు వచ్చి పడుతున్నాయి.
 
 ్ఖసోషల్ మీడియాలో కేంద్ర మంత్రి శశి థరూర్‌కు 16 లక్షల మంది ఫాలోవర్లున్నారు.
 ్ఖబీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను 13.73 లక్షల మంది అనుసరిస్తున్నారు. గూగుల్ ప్లస్, హ్యాంగౌట్స్ వాడిన తొలి భారత రాజకీయ నాయకుడు మోడీయే. ఫేస్‌బుక్‌లోనూ ఆయన త్రీడీ ప్రసారాలతో రికార్డులు సృష్టిస్తున్నారు.
 ్ఖప్రధాని మన్మోహన్‌సింగ్ 2008లో ప్రారంభించిన అధికారిక వెబ్ పేజీ 4.8 లక్షల మందిని ఆకట్టుకుంది. ఆయన గతేడాదే ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలు కూడా తెరిచారు.
 ్ఖజమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ట్విట్టర్‌లో 2.49 లక్షల మంది అనుసరిస్తున్నారు.
 ్ఖలోక్‌సత్తా తన సైద్ధాంతిక ప్రచారానికి ఎక్కువగా సోషల్ మీడియాపైనే ఆధారపడుతోంది. జయప్రకాశ్ నారాయణ తరచు ట్విట్టర్ ద్వారా వీడియో చాటింగ్ చేస్తుంటారు. ఆయన ట్విట్టర్ ఖాతాను 54,700 మంది అనుసరిస్తున్నారు.
 ్ఖవైఎస్సార్‌సీపీ అభిమానులు నిర్వహించే ‘ఫేస్‌బుక్’ పేజీకి ఫాలోవర్లు నానాటికీ పెరుగుతున్నారు.
 ఇప్పటి వరకు 3.5 లక్షల మంది ఉన్నారు.
 ్ఖటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్విట్టర్ ఖాతాను 1820 మంది అనుసరిస్తున్నారు. ఆయన ‘వస్తున్నా మీకోసం’ యాత్రకు జనం లేకున్నా, ‘ఫేస్‌బుక్’లో మాత్రం భారీగానే ఊదరగొట్టారు.
 ్ఖసీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వైఫై సౌకర్యముంది! సీపీఎం రాష్ట్ర కమిటీ నేతల్లో 14 మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. బీవీ రాఘవులు ఐపాడ్ నుంచే అన్ని వివరాలూ సేకరిస్తుంటారు. డెబ్బయ్యేళ్లు దాటిన పాటూరు రామయ్య, మల్లారెడ్డి వంటి నేతలు కూడా ఇంటర్నెట్ వాడకంలో నిపుణులే.
 ్ఖసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు చికెన్ కంటే హైటెక్ మొబైలంటేనే మక్కువని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన బ్యాగులో నిరంతరం ఐప్యాడ్, ఐఫోన్ ఉంటాయి. వాటి ద్వారానే పార్టీ సందేశాలను పంపుతుంటారు.
 ్ఖబీజేపీ నేత జి.కిషన్‌రెడ్డికి ట్విట్టర్‌లో 4 వేలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు.
 ్ఖపశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ఖాతాకూ ఫాలోవర్లు బాగానే ఉన్నారు.
 
 తెలుగులో ఎస్సెమ్మెస్ ప్రచారం
 కోన సుధాకర్‌రెడ్డి: ఇంటర్నెట్‌తో పాటు, ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన ఎస్సెమ్మెస్ ప్రచారంపై కూడా మన రాష్ట్ర పార్టీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అవి తెలుగులో ఉంటే ఓటర్లందరికీ మరింతగా చేరవ కావచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘తెలుగుమాట’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్‌వర్క్, సమాచార సాంకేతిక శాఖ సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చిన అప్లికేషన్(ఆప్)పై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇది అండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో తెలుగును సులభంగా టైప్ చేసుకునే వీలుండే ఓ కీ బోర్డు. తెలుగు విజయం ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన ఈ ఆప్ ద్వారా ఎస్సెమ్మెస్‌లతో పాటు , ఇ-మెయిల్స్‌ను, ట్విట్టర్, ఫేస్‌బుక్ సమాచారాన్ని నేరుగా తెలుగులో పంపుకోవచ్చు. దీన్ని వాడేందుకు పలు పార్టీలు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఎస్సెమ్మెస్‌లు పంపేందుకు ఈ ఆప్‌ను ఎవరైనా సులువుగా వాడుకోవచ్చని సమాచార సాంకేతిక శాఖలోని జ్ఞానాధారిత అనుసంధాన వ్యవస్థాపక సంఘం సీఈఓ ఆత్మకూరి అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు.
 
 ్ఖగత వారం రోజుల్లో సోషల్ మీడియాలో దాదాపు 6.71 లక్షల ఎన్నికల ప్రస్తావనలు వచ్చాయి.
 ్ఖఎన్నికలు, రాజకీయాలకు సంబంధించిన చర్చల్లో పశ్చిమ భారతం చురుగ్గా ఉంది. ముంబై, పూణెల నుంచి అత్యధికంగా ఆ చర్చల్లో పాల్గొంటున్నారు.
 ్ఖవరుసగా నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్‌గాంధీ, జశ్వంత్‌సింగ్, సోనియాగాంధీల గురించి ఎక్కువగా చర్చలు జరిపారు.
 ్ఖబీజేపీకి సానుకూలత ఎక్కువగా ఉంది. ఆ పార్టీకి సంబంధించి లక్షకు పైగా సానుకూల స్పందనలు రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ఉన్నాయి.. విశేషమేంటంటే వ్యతిరేకత ఎక్కువ వచ్చిన పార్టీ కూడా బీజేపీనే. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్, ఆప్‌లు ఉన్నాయి.
 ్ఖసానుకూలత ఎక్కువగా వచ్చిన నేతల్లో అరవింద్ కేజ్రీవాల్ మొదటిస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ ఉన్నారు.
 
 కామెంట్.. కౌంటర్
 ఆర్థిక మంత్రిగా చిదంబరం దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు. ఆయన ఆర్థిక మంత్రి అయ్యాక వృద్ధిరేటు తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగింది. రూపాయి విలువ పడిపోయింది. మొత్తంగా ఆర్థికరంగాన్ని సర్వనాశనం చేశారు. ఓడిపోతాననే భయంతోనే చిదంబరం తన కొడుకుని ఇక్కడ నిలబెట్టారు.
  - తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత
 
 (చిదంబరం కొడుకు కార్తీ పోటీచేస్తున్న శివగంగ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక ఎన్నికల ప్రచార సభలో)
 జయలలితది అజ్ఞానం. ఆమెవన్నీ అర్థంపర్థం లేని ఆరోపణలు. గత పదేళ్లలో దేశ ఆర్థికవ్యవస్థ ఎన్నడూలేనంత వృద్ధిని సాధించింది. ఆమెప్పుడూ హెలీకాప్టర్లలోనో, విమానాల్లోనో తిరుగుతుంటారు. తమిళ నేలపై అడుగుపెట్టని సీఎం ఆమే అనుకుంటా. అలాంటి జయలలితకు క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయి?
 - చిదంబరం
 
 (శివగంగ నియోజకవర్గంలో తనయుడు కార్తీ కోసం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో)
 60 ఏళ్లను రిటైర్మెంట్ వయసుగా నిర్ణయించారు. ఆ వయసులో ఇప్పటిలా చురుగ్గా ఉండలేం. అందుకే 60 ఏళ్లు రాగానే రిటైర్ కావడం మంచిది
 - కిరణ్ ఖేర్ వయసును ఉద్దేశించి
 
 గుల్ పనగ్ పరోక్ష వ్యాఖ్యలు
 పాతికేళ్ల వయసున్నవారిలో తెలివి తక్కువ వారు, అజ్ఞానులూ ఉంటారు. 60 ఏళ్ల వయసువారిలో చురుకైన వారు, తెలివైనవారూ ఉంటారు. నిజానికి 60 ఏళ్లప్పుడే జీవితం ప్రారంభమవుతుంది. అయినా నాకిప్పుడు
 58 ఏళ్లే.
 - గుల్‌పనగ్ ట్వీట్‌కు కిరణ్‌ఖేర్ వ్యంగ్య స్పందన
 
 
 (చండీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గుల్‌పనగ్ (35), బీజేపీ నుంచి కిరణ్ ఖేర్ బరిలో ఉన్నారు)
 కేంద్రం పశ్చిమ బెంగాల్‌కు కోట్లాది నిధులను కేటాయించింది. అవి ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం పంపిన డబ్బులు కావు. మీ కోసం పంపించినవి. మీ తరఫున పోరాడుతారని నమ్మి సీపీఎంను గద్దె దింపి ఈ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు వీళ్లు కూడా సీపీఎం లాగానే వ్యవహరిస్తున్నారు’
 - పశ్చిమబెంగాల్‌లోని జాల్పాయ్‌గుడి ఎన్నికల ప్రచార సభలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి
 
 రాహుల్‌గాంధీ
 వారు లాడ్ సాహెబ్‌లు, జమీందార్ల కొడుకులు, కూతుర్లు. వారికి పేదల గురించేం తెలియదు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియని, అనుభవం లేకుండానే ఒక్కసారిగా ఉన్నతస్థానానికి చేరిన ఒక నాయకుడు పశ్చిమబెంగాల్‌కు కోట్లాది రూపాయల నిధులిచ్చామని చెబుతున్నాడు. ఆయనకసలు నిధులంటే ఏమిటి? అవి ఎలా వస్తాయి? అనే విషయాలు తెలుసా? అలాంటివారు వసంతకోకిలల లాంటి వారు. సంవత్సరం మొత్తంమీద ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు. నేనలాంటి నేతను కాదు. సంవత్సరం మొత్తం ప్రజలమధ్య ఉంటాను’
 - నక్సల్బరీ ప్రచార సభలో రాహుల్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమత కౌంటర్
 
 ఎవరైనా వణకాల్సిందే...
 హిమాచల్‌ప్రదేశ్ మారుమూల మంచు దుప్పట్లో నిరంతరం మునగదీసుకుంటున్న ఆ గ్రామాలకు వెళ్లాలంటే రాజకీయ పార్టీల అభ్యర్థులే కాదు, ఎన్నికల సిబ్బంది సైతం వణకాల్సిందే! దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి తాకిడి మొదలవుతున్నా, హిమాచల్‌లోని కిన్నౌర్, లాహౌల్-స్పితి, చంబా, కులు, సిర్మౌర్, సిమ్లా జిల్లాల్లోని దాదాపు వెయ్యి కుగ్రామాలు ఇంకా మంచు తాకిడిలోనే ఉన్నాయి. ఎన్నికలతో దేశమంతా వేడెక్కుతున్నా, ఈ ప్రాంతాల్లో మాత్రం రాజకీయ పార్టీలు ప్రచారం చేసే పరిస్థితులే లేవు. లాహౌల్-స్పితి, కిన్నౌర్ జిల్లాలతో పాటు చంబా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మండీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మండీతో పాటు సిమ్లా, కాంగ్రా, హమీర్‌పూర్ లోక్‌సభ స్థానాల్లో మే 7న పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి 9 వేల నుంచి 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు