అసోంలో ఏజీపీ ఎదురీత! | Sakshi
Sakshi News home page

అసోంలో ఏజీపీ ఎదురీత!

Published Thu, Mar 27 2014 1:06 AM

Asom Gana Parishad faces in Assam

2009 ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్ ఆశలు
 ఎలక్షన్ సెల్: అసోంలో ఈసారి కూడా 2009 ఎన్నికల పరిిస్థితులే కనిపిస్తున్నాయి. అసోం గణపరిషత్ (ఏజీపీ) పతనమే కాంగ్రెస్‌కు వరంగా మారింది. విద్యార్థి నేతగా ఉద్యమాలకు సారథ్యం వహించి, ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏజీపీ అధినేత ప్రఫుల్లకుమార్ మహంతా కొన్నేళ్లుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రాంతీయ సెంటి మెంటుతో 1985లో పార్టీని పెట్టిన రెండు నెలల్లోనే అధికారాన్ని దక్కించుకున్న ఏజీపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమై, ప్రాభవాన్ని కోల్పోయింది. ఏజీపీ ఆవిర్భావం ముందు వరకు అధికారాన్ని సాగించిన కాంగ్రెస్, అసోంలో మళ్లీ పట్టు పెంచుకుని అధికారంలోకి రాగలిగింది.
 
 గత పరాజయాలతో గుణపాఠాలు నేర్చుకోని ఏజీపీ నేటికీ ఏటికి ఎదురీదుతోంది. అందుకే, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 2009 నాటి కంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంటుందని ముఖ్య మంత్రి తరుణ్ గొగోయ్ ధీమాగా చెబుతున్నారు. 2009 నాటి కంటే, కాంగ్రెస్‌కు ఈసారి తక్కువ లోక్‌సభ స్థానాలు వస్తే, ముఖ్యమంత్రి పదవినే వదులుకుంటానని మరీ సవాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో 30 శాతం నుంచి 56 శాతం మేరకు ముస్లిం ఓటర్లు ఉండటం కాంగ్రెస్‌కు సానుకూలాంశం. అయితే,  వ్యాపార వేత్త మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించిన ఏఐయూడీఎఫ్ ముస్లింలలో క్రమంగా పట్టు పెంచుకుంటుండటం కాంగ్రెస్‌ను కలవరపెడు తోంది. సంప్రదాయకంగా కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చిన ఆదివాసీలు సైతం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలపై భయంతో బీజేపీకి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఈసారి ముస్లింలు, ఆదివాసీ తేయాకు కార్మికుల మద్దతు ఆశించిన స్థాయిలో లభించక పోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
 
నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో 15 శాతం నుంచి 18 శాతం వరకు ఉన్న ఆదివాసీలు అక్కడి ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ మోడీ ప్రభావాన్ని ఎంతగా నమ్ముకున్నా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి తగిన కేడర్ లేకపోవడంతో కాంగ్రెస్‌ను అధిగమించే అవకాశాలు లేవని విశ్లేషకుల అంచనా. ముస్లిం ఓట్లలో చీలికను నివారించడం ద్వారా బీజేపీని అడ్డుకునేందుకు ఏఐయూ డీఎఫ్‌తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకునే అవకాశాలూ లేకపోలేదు. వచ్చేనెల 7, 12, 24 తేదీల్లో అసోంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
 
 మా మద్దతు...
 బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక వర్గం నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. ప్రధానమంత్రి పదవికి నరేంద్రమోడీనే సరైన వ్యక్తి అని ఆ వర్గం నిర్ధారించింది. మోడీ ప్రధాని కావడం కోసం తమ వర్గం వారంతా బీజేపీకే ఓటేయాలని నిర్ణయించింది. ఎవరా వర్గం అనుకుంటున్నారా?  విషయమేంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్ అంతా ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటెయ్యాలి?, ఏ నాయకుడికి మద్దతివ్వాలి అనే అంశంపై మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్, ములాయంసింగ్ యాదవ్, మాయావతి తదితర నేతల గురించి చర్చించారు. చివరకు ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్రమోడీనే సమర్థుడైన నాయకుడనే నిర్ణయానికి వచ్చారు. మోడీని ప్రధానిని చేయడం కోసం బీజేపీకే ఓటేయాలని డిసైడయ్యారు.  
 
 కొంధొమాల్‌లో కోటీశ్వరులు
 ఒడిశాలో పేదరికంతో అల్లాడే కొంధొమాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలూ కోటీశ్వరులనే బరిలోకి దించాయి. బీజేడీ తరఫున పోటీ చేస్తున్న హేమేంద్రచంద్ర సింగ్ ఆస్తుల విలువ రూ.48.72 కోట్లు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న వారిలో ఆయనే అత్యంత సంపన్నుడు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు, తన భార్య ప్రయూషా రాజేశ్వరి సింగ్‌కు రూ.48.72 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్నట్లు హేమేంద్ర వెల్లడించారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి హరిహర కరణ్ ఆస్తుల విలువ రూ.9.62 కోట్లు. బీజేపీ అభ్యర్థి సుకాంత పాణిగ్రాహికి అతి తక్కువగా రూ.5.08 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి.
 
2004తో పోలిస్తే 2009లో పార్టీల ఓట్ల శాతంలో ఎంత తేడా..

Advertisement
Advertisement