యూపీలో ‘పవర్’ పాలిటిక్స్...

28 Apr, 2014 01:20 IST|Sakshi

 పాలిటిక్స్ అంతా ‘పవర్’ కోసమే కదా అనుకుంటున్నారా..? నిజమే! ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ‘పవర్’కి పాలిటిక్స్‌కి ఉన్న లింకే వేరు. రాజకీయ హేమాహేమీల రాష్ట్రమైన యూపీలో ఏటా దాదాపు మూడోవంతు విద్యుత్తుకు ఎలాంటి బిల్లులూ ఉండవు.

విద్యుత్‌చౌర్యం ఇక్కడ చాలా మామూలు. యూపీలో విద్యుత్ నష్టాలకు సాంకేతిక, ఆర్థిక కారణాలే కావు, రాజకీయ కారణాలూ ఉన్నాయి. మిచిగాన్ వర్సిటీ ఈ అంశంపై నిర్వహించిన అధ్యయనంలో ‘పవర్’ పాలిటిక్స్ గురిం చి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

 ఏం తేలిందంటే..
 యూపీలో 1970-2010 కాలంలో 29 శాతం విద్యుత్తుకు ఎలాంటి బిల్లులూ వసూలు కాలేదు. కొన్నేళ్లుగా ఎన్ని సంస్కరణలు తెచ్చినా, విధానాల్లో మార్పులు తెచ్చినా పరిస్థితి మరింత దిగజారిందే తప్ప ఎలాంటి మార్పు లేదు. రాజకీయ కుటుంబాలు ఎక్కువగా ఉండే యూపీ పశ్చిమ ప్రాంతంలోనే అత్యధికంగా విద్యుత్ సరఫరా నష్టాలు నమోదయ్యాయి. హత్రాస్, మెయిన్‌పురి జిల్లాల్లో ఏకంగా 50 శాతం విద్యుత్తు సరఫరాలోనే నష్టపోవడం లేదా బిల్లులు వసూలు కాకపోవడం జరిగింది.

 దీనికి భిన్నంగా బహుళజాతి కంపెనీలు ఎక్కువగా ఉన్న గౌతమబుద్ధనగర్ ప్రాంతంలో అత్యల్పంగా 13.8 శాతం విద్యుత్తు నష్టాలు మాత్రమే నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మీటర్లు అమర్చకుండా ఫ్లాట్‌రేటు పద్ధతిలో బిల్లులు వసూలు చేయడం కూడా నష్టాలకు కారణమవుతోంది. ఎన్నికలకు ముందు గ్రామాలకు రోజుకు 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగేది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో 18 గంటలకు పైగా సరఫరా జరుగుతోంది.

గ్రామాలకు విద్యుత్ సరఫరా పెరిగినా, వసూలవుతున్న బిల్లుల మొత్తాలు మాత్రం యథాతథంగానే ఉంటున్నాయి. యూపీలో రాజకీయ దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో, ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు అలహాబాద్ హైకోర్టులో విచారణలో ఉంది. ఓట్లు రాబట్టుకునేందుకు, తమ తమ ప్రాంతాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రాజకీయ నేతలు విద్యుత్తును సాధనంగా ఉపయోగించుకుంటున్నారని మిచిగాన్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రియాన్ మిన్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు