బధిరుల బంధువు

27 Apr, 2014 23:25 IST|Sakshi
బధిరుల బంధువు

‘‘మీ కలలను విడిచిపెట్టకండి. కలలు మాత్రమే మనల్ని ముందుకు నడిపించగలవు. దేనినైనా సాధించేలా చేయగలవు. నా కలలే నన్ను నడిపించాయి. మిమ్మల్నీ నడిపిస్తాయి’’. ఈ మాటలు వింటే ఓ తలపండిన అనుభవజ్ఞుడు చెప్పిన సూక్తులేమో అనిపిస్తుంది. కానీ వీటిని చెప్పింది ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి. ఆమె పేరు స్మృతీ నాగ్‌పాల్. బధిరుల కోసమే జీవితాన్ని అంకితం చేసి, వారిని ముందుకు నడిపేందుకు నడుం కట్టిన ఓ ఆదర్శప్రాయమైన యువతి!
 
భావాలను వెల్లడించాలంటే ఏ మనిషికైనా భాష కావాలి. మరి భాషే తెలియని చెవిటి, మూగవారి పరిస్థితి ఏమిటి? వారు ఎవరికైనా ఏదైనా ఎలా చెప్పగలరు? ఎవరైనా చెప్పేది వాళ్లు ఎలా అర్థం చేసుకోగలరు? ఈ ప్రశ్నలు ఇరవై యేళ్ల వయసున్న అమ్మాయి మనసులో రావడం అరుదే. సినిమాలు, షికార్లు, చాటింగులు అంటూ తిరిగే వయసులో ఓ పెద్ద సమస్యకు పరిష్కారం కోసం ఆమె ఆలోచించడం గొప్ప విషయమే.
 
ఇంజనీరింగ్, మెడిసిన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎయిర్‌ఫోర్‌‌స... అంటూ నేటి యువతీ యువకులంతా పాకులాడుతుంటే... స్మృతీ నాగ్‌పాల్ మాత్రం బధిరుల కోసం ఏం చేయాలి అని ఆలోచించేది. ఆ ఆలోచన ఆమెను ఓ విభిన్నమైన దారిలో నడిపించింది. ఆ ప్రయాణం ఆమెను ఓ ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగేలా చేసింది. ఆమె అండతో మరికొన్ని జీవితాలు నిలబడేందుకు దోహదపడింది.
 
ఇంటి నుంచే మొదలు...: దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరిగింది స్మృతి. కష్టాలు పడే కుటుంబం కాదు. కానీ చుట్టూ సంతోషమే ఉన్నా... మనసులో మాత్రం ఏదో బాధ స్మృతికి. ఆ వేదన... ఆమె అక్కల వల్ల ఏర్పడింది. స్మృతికి ఇద్దరు అక్కలు. వాళ్లకీ ఆమెకీ మధ్య దాదాపు పదేళ్ల వయోభేదం ఉంది. దానితో పాటే మరో భేదమూ ఉంది. వాళ్లిద్దరూ బధిరులు. చిన్నప్పుడు ఆ సంగతి తెలియక వారితో మామూలుగా మాట్లాడేసేది స్మృతి. వాళ్లకి అది అర్థం కాదని తెలిశాక చాలా బాధపడిపోయేది.

తాను అనుకున్నది వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి నానా తంటాలూ పడేది. అలాగే వాళ్లు తమ భావాలను వెల్లడించడానికి పడే కష్టమూ ఆమెను బాధించేది. అప్పుడే ఆమెకు రకరకాల ఆలోచనలు కలిగేవి. సాధారణంగా బధిరులంతా మూగవాళ్లే అవుతారు. ఎందుకంటే... వారికి భాష తెలియదు కాబట్టి. మాట ఎలా పలకాలో అర్థం కాదు కాబట్టి. వారు తమ భావాలను సైగల ద్వారానో, రాసి చూపడం ద్వారానో వ్యక్తపరచాలి. చదువు అనేది పెద్ద వ్యవహారమే. కానీ సైగలు తేలికైన పరిష్కారం. అందుకే బధిరులకు సైగల భాష వచ్చి తీరాలి అనుకుంది స్మృతి.

ఆమె తన అక్కలిద్దరికీ సైగలతోనే అర్థమయ్యేలా చెప్పేది. కానీ వాళ్లలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు కదా! వాళ్లకీ తాను ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే దూరదర్శన్‌లో చేరింది. రోజూ ఉదయం బధిరుల వార్తలు చదివి, తర్వాత కాలేజీకి వెళ్లేది. బధిరుల భాషను అందరికీ నేర్పాలని తపన పడేది. బధిరుల పాఠశాలలకు వెళ్లి వాళ్లతో గడిపేది. వాళ్లకు సైగల భాషను నేర్పించేది. సైగల ద్వారానే వాళ్లతో సంభాషించేది. అంతలో ఆమె డిగ్రీ పూర్తయ్యింది. ఓరోజు అనుకోకుండా తారసపడిన ఓ స్నేహితుడు... ఆమె మార్గాన్ని మరోవైపు మళ్లించాడు.
 
నేస్తం తెలిపిన వాస్తవమే ఊతంగా...: ఓరోజు బధిరుడైన తన చిన్ననాటి స్నేహితుడిని కలిసింది స్మృతి. ఏం చేస్తున్నావని అడిగితే... తానో చిన్న కంపెనీలో పని చేస్తున్నానని చెప్పాడతను. వెంటనే అతడు ఓ మంచి చిత్రకారుడన్న విషయం గుర్తొచ్చిందామెకి. పైగా అతడు ఫైన్ ఆర్‌‌ట్సలో పీజీ కూడా చేశాడని తెలిసి, మరి ఈ పనెందుకు చేస్తున్నావని అడిగితే, తనలాంటి వాళ్లకి ప్రతిభ ఉంటే చాలదు, ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పాడు. ఆ మాట స్మృతి మనసులో సూటిగా నాటుకు పోయింది.

నిజమే. ప్రోత్సాహం లేకపోతే ఎంతటి కళ అయినా మరుగున పడిపోతుంది. ఎంత మంచి కళాకారుడి జీవితమైనా నిరర్థకమైపోతుంది. ఈ విషయం అవగత మవగానే స్మృతి మనసులో ఓ లక్ష్యం రూపు దిద్దుకుంది. అది, ‘అతుల్యకళ’ సంస్థగా ఆవిర్భవించింది. ఈ సంస్థ లక్ష్యం... తమలో ఈ ప్రతిభ ఉంది అని చెప్పుకోలేని, చెప్పుకోవడం చేతకాని బధిరులకు అండగా నిలబడటం. స్మృతి ఆశయాన్ని చూసి ఆకర్షితులైన కొందరు యువతీ యువకులు ఆమెతో చేతులు కలిపారు.

అతుల్యకళలో సభ్యులయ్యారు. వీరంతా కలిసి ఎక్కడెక్కడ బధిరులున్నా వారిని కలుస్తారు. వారిలో ఏ ప్రతిభ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తారు. వారి ప్రతిభకు తగిన విధంగా పలు సంస్థల వారితో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తారు. బధిరులు తయారు చేసిన కళాకృతులు, చిత్రాలను అమ్మి పెడతారు. తర్వాత మెల్లగా వారికే అమ్మడమెలాగో నేర్పిస్తారు. అందుకు అవసరమైన సంజ్ఞల భాషలో తర్ఫీదు నిస్తారు. మొత్తంగా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి ప్రతిభనే వారి జీవితాలకు ఆధారంగా చేసి ముందుకు నడిపిస్తారు.
 
‘‘ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినట్టు జీవించే హక్కు ఉంది. వైకల్యం ఉన్నంతమాత్రాన ఎవరి ప్రతిభా మరుగునపడిపోకూడదు’’ అనే స్మ ృతి సహకారంతో, ‘అతుల్యకళ’ అండతో కొన్ని వేలమంది బధిరుల ప్రతిభ ప్రపంచం ముందుకు వచ్చింది. కొందరు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు అయ్యారు. కొందరు రచయితలు అయ్యారు. కొందరు చిత్రకారులయ్యారు. కొందరు సొంతంగా షాపులు పెట్టుకుని, తాము తయారు చేసిన వస్తువులను అమ్ముతూ జీవిస్తున్నారు. స్మృతి పుణ్యమా అని... వారికిప్పుడు భాష తెలుసు. భావాలను ప్రకటించడం తెలుసు. భరోసాగా బతకడమూ తెలుసు!
 - సమీర నేలపూడి
 
‘అతుల్యకళ’ అండతో బధిరులు సృష్టిస్తున్న కళాకృతులకు మంచి గిరాకీయే ఉంది. వీళ్లను ప్రోత్సహిద్దామన్న ఉద్దేశంతో కొనేవాళ్లతో పాటు, ఆ కళాత్మకతకు ముగ్ధులై కొనే కస్టమర్లూ బోలెడంత మంది ఉన్నారు. ఈ ఉత్పత్తులను  http://www.craftsvilla.com
వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చు.
 

మరిన్ని వార్తలు