ఇద్దరు ఓటర్ల కోసం ఒక పోలింగ్ బూత్!

29 Mar, 2014 18:09 IST|Sakshi
ఇద్దరు ఓటర్ల కోసం ఒక పోలింగ్ బూత్!

ఇద్దరంటే ఇద్దరు ఓటర్లు... వారి చేత ఓటు వేయించేందుకు ఒక అరడజను మంది సిబ్బంది... కొండ కోనలపై ఉండే పోలింగ్ బూత్ లు... అక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అడవులను దాటాలి. ఇలాంటి నియోజకవర్గాలు అసలుంటాయా అనిపిస్తుంది కదూ...! కానీ మనదేశంలో సూర్యుడి తొలి అరుణకిరణాలు తాకే అరుణాచల్ ప్రదేశ్ లో ఇలాంటి పోలింగ్ బూత్ ఒకటుంది.


అంజా జిల్లాలో  హేయులియాంగ్ డివిజన్ లోని మాలోగావ్ అనే ఊళ్లో ఒక పోలింగ్ బూత్ ఉంది. ఆ ఊరి మొత్తానికి ఉండేది ఒకే కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు. వారి కోసమే పోలింగ్ బూత్ ఏర్పాటైంది.


అరుణాచల్ ప్రదేశ్ లో పది మంది కన్నా తక్కువ ఓట్లున్న పోలింగ్ బూత్ లు పది వరకూ ఉంటాయి. ఇరవై పోలింగ్ బూత్ లలో కేవలం 20 మంది ఓట్లే ఉన్నాయి. యాభై మంది వరకూ ఓటర్లున్న బూత్ లు 105 వరకూ ఉంటాయి.


మరి అరుణాచల్ లో అత్యధిక ఓటర్లున్న పోలింగ్ బూత్ ఎక్కడుంది? రాజధాని ఈటానగర్ లో 1650 ఓట్లు ఉన్నాయి. ఇదే అత్యధిక ఓటర్లున్న బూత్. మొత్తం అరుణాచల్ లో 2158 బూత్ లు ఉన్నాయి. వీటిలో 664 బూత్ లు అత్యంత దుర్గమ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఇంత పెద్ద అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.53 లక్షలే. అంటే విజయవాడ నగరం జనాభాతో సమానమన్నమాట.
 

మరిన్ని వార్తలు