‘ఏడు’లోనూ భారీ పోలింగ్

1 May, 2014 02:43 IST|Sakshi
‘ఏడు’లోనూ భారీ పోలింగ్

7 రాష్ట్రాలు, 2 యూటీలలోని 89 స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్
 పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 81.35 శాతం పోలింగ్

 
 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి భారీ పోలింగ్ నమోదైంది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 89 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో 9 స్థానాలకు అత్యధికంగా 81.35 శాతం పోలింగ్ నమోదవగా పంజాబ్‌లోని 13 స్థానాలకు ఒకే దశలో జరిగిన పోలింగ్‌లో ఆ రాష్ట్ర చరిత్రలోకెల్లా తొలిసారిగా 73 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలకు ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ రికార్డయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో కేవలం 47.92 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలకు 57.10 శాతం, బీహార్‌లోని ఏడు స్థానాలకు 60 శాతం నమోదైంది. అలాగే జమ్మూకాశ్మీర్‌లో ఒక స్థానానికి 25.62 శాతం, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డామన్ డయూలలో ఒక్కో స్థానానికి వరుసగా 85 శాతం, 76 శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్‌లోని మోగా, ఖదూర్ సాహిబ్, అమృత్‌సర్ స్థానాల పరిధిలో అకాలీదళ్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 15 మంది గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేసిన యూపీలోని రాయ్‌బరేలీ స్థానంలో 51.85 శాతం ఓటింగ్ రికార్డయింది. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేసిన గుజరాత్‌లోని వడోదరా స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది.

ఓటేసిన మోడీ భార్య, తల్లి

 బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భార్య యశోదాబెన్, ఆయన మాతృమూర్తి హిరాబా మోడీలు బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెహ్సనా జిల్లాలోని ఉంఝా నగరంలో ఉన్న కోట్ కువా ప్రాంతంలో యశోదాబెన్ ఓటు వేశారు. అనంతరం మీడియా ప్రశ్నలకు ఏమాత్రమూ స్పందించకుండానే ఆమె హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేవిధంగా మోడీ తల్లి హిరాబా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఎన్నికల కేంద్రానికి ఆటోలో వచ్చి ఓటు వేశారు. గాంధీనగర్ నుంచి బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ తలపడుతున్న విషయం తెలిసిందే.

ఈ ఎన్నికలు గుర్తుండిపోతాయి: అద్వానీ

భారత్‌లో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల కంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ చెప్పారు. బుధవారం కుమారుడు జయంత్, కుమార్తె ప్రతిభా అద్వానీలతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో ఓటేసిన అనంతరం అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ‘నేను 1947 నుంచి అన్ని ఎన్నికలను చూశాను. దేశంలో 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికలను చూశాను. అయితే దేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయి’ అని చెప్పారు. నిర్బంధ ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలని పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్ విజయవంతమైతే ఎంతగానో సంతోషిస్తానని చెప్పారు. అయితే, తన పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలపై ప్రశ్నించగా, అద్వానీ దాటవేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడతానని, రాజకీయాలు మాట్లాడనని పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు