గుబులు రేపుతున్న తిరక్రాస్ ఓటింగ్!

9 May, 2014 01:17 IST|Sakshi
గుబులు రేపుతున్న తిరక్రాస్ ఓటింగ్!

సాక్షి ప్రతినిధి,విజయనగరం : బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు క్రాస్ ఓటింగ్‌కు పిలుపునిచ్చారు. ఒకటి అటు, ఒకటి ఇటు అంటూ లోపాయికారిగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు కూడా ఓటర్లకు ఇదే చెప్పారు. మొత్తానికి ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో చాలాచోట్ల క్రాస్ ఓటింగ్ పడినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ క్రాస్ ఓటింగ్‌లో చాలా మంది తప్పులో కాలేసినట్టు తెలిసింది. పోలింగ్ బూత్‌లో ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోడానికి మరొక ఈవీఎంను ఏర్పాటు చేశారు.  క్రాస్ ఆలోచనలో తికమకకు గురై ఎంపీకి వేద్దామని ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేకి వేద్దామనుకుని ఎంపీకి ఓటువేసిన వారు చాలామంది ఉన్నారు. బయటకొచ్చాక పక్కనున్న వారు చెప్పిన తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని నాలిక కరుచుకున్నారు.
 
 విజయనగరంలో మీసాల గీత అనుచరులు పలువురు ఎమ్మెల్యే ఓటు తమకి, ఎంపీ ఓటు బొత్స ఝాన్సీలక్ష్మీకి వేయాలని లోపాయికారీ పిలుపునివ్వడంతో పలువురు అదే తరహాలో ఓటేసినట్టు తెలిసింది. ఓటర్లు తడబడటంతో టీడీపీకీ రావాల్సిన ఓట్లు చాలావరకు ఆ పార్టీ కోల్పోయినట్టు సమాచారం.  మీసాల గీత అనుచరుల నిర్వాకాన్ని పసిగట్టిన అశోక్ వర్గం టీడీపీ నాయకులు పలువురు అందుకు ప్రతీకారంగా ఎమ్మెల్యే ఓటు కోలగట్ల వీరభద్రస్వామికి, ఎంపీ ఓటు అశోక్‌గజపతిరాజుకు వేసినట్టు నగరంలో ఇప్పటికే విసృ్తతంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు కూడా లోపాయికారిగా క్రాస్ ఓటింగ్‌కు పిలుపునివ్వడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యడ్ల రమణమూర్తికి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరంలో కూడా సామాజికవర్గం కోణంలో టీడీపీ నాయకులు పలువురు ఎంపీ ఓటు విషయంలో క్రాస్ ఓటింగ్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇక్కడ కూడా అశోక్ గజపతిరాజు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఎమ్మెల్యేకి వేయవలసిన ఓటు ఎంపీకి, ఎంపీకి వేయవలసిన ఓటు ఎమ్మెల్యేకి వేశారు. దీంతో ఆ రెండు పార్టీలు నష్టపోయాయి.  
 
 ఇక, బొబ్బిలిలో టీడీపీ నాయకులు ఎంపీ ఓటును కాంగ్రెస్‌కు వేయాలని పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కూడా అశోక్ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సాలూరు టీడీపీలో  పలువురు ఎమ్మెల్యే ఓటు రాజన్నదొరకు, ఎంపీ ఓటు సంధ్యారాణికి వేయాలని పిలుపునివ్వడంతో ఆ ప్రక్రియ గుట్టుగా జరిగిపోయింది. దీంతో భంజ్‌దేవ్‌కు నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. కురుపాం టీడీపీలో ఎంపీ ఓటు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌కు వేయాలన్న లోపాయికారీ పిలుపుతో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అంచనాలు తలకిందులయ్యాయి. ఇదే తరహాలో కాంగ్రెస్‌లో  కూడా క్రాస్ ఓటింగ్ జరగడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది.  క్రాస్ ఓటింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. క్రాస్ ఓటింగ్ పరిణామాల కారణంగా ఎవరికి ఎన్ని ఓట్లు  వస్తాయన్న ఇషయాన్ని ఆయా పార్టీలు అంచనా వేసుకోలేకపోతున్నాయి. ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రం క్రాస్ ఓటింగ్ జోలికి పోకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులకు అటువంటి భయం లేకుండా పోయింది. ఈ క్రాస్ ఓటింగ్ తమకు కలిసొస్తుండడంతో మరింత మెజార్టీ పెరుగుతుందని ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు.
 

మరిన్ని వార్తలు