తొలిదశ ‘ప్రాదేశిక’ ప్రచారానికి నేటితో తెర

4 Apr, 2014 00:05 IST|Sakshi

 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికలు జరగనున్న 24 మండలాల్లో ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. దీంతో అన్ని రాజకీయపార్టీలు  చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ ముఖ్యనేతలు చివరిరోజున ముమ్మర ప్రచారం చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ ప్రభుగౌడ్, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, నందీశ్వర్‌గౌడ్, జయప్రకాశ్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు, ఇటీవలే ఆ పార్టీలో చేరిన బాబూమోహన్, టీడీపీ నేతలు శుక్రవారం గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు.

మొదటి విడతగా 24 జెడ్పీటీసీ, 353 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా మండలాల్లో ముఖ్యనేతలు శుక్రవారం సాయంత్రం వరకు ఓటర్ల వద్దకు వెళ్లి మద్దతు కోరనున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిందే తడవుగా రాజకీయ పార్టీలు గ్రామాల్లో స్థానిక ప్రచారం ప్రారంభించాయి. గురువారం మాజీ మంత్రి గీతారెడ్డి న్యాల్‌కల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అలాగే ఆమె జహీరాబాద్ మండలంలో ప్రచారం చేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే హరీష్‌రావు సంగారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మొదటి విడత ఎన్నికలు జరిగే సిద్దిపేట, గజ్వేల్‌లో మరోమారు పర్యటించనున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన బాబూమోహన్ రేగోడ్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉంటే జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల మండలాల్లో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

 ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
 జిల్లాలో ఈ నెల 6న మొదటి విడతగా 24 మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆయా మండలాల్లో ఎన్నికల కేంద్రాలను సిద్ధం చేయటంతోపాటు గురువారం ఎన్నికల సిబ్బంది నియామకం పూర్తిచేశారు.
 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని అధికారులు చేరవేశారు. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు