నువ్వా.. నేనా?

12 May, 2014 03:29 IST|Sakshi

 నెలన్నరోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది.. ‘పుర’పోరులో నిలిచినవారిలో పట్టు సాధించేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. సాధారణ పోరుకు తొలి సెమీఫైనల్‌గా భావించిన మునిసిపాలిటీ ఎన్నికల ఫలితం తేలనుంది.
 
 గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డిన ఆయా రాజకీయపక్షాలు, అభ్యర్థుల జాతకం తేటతెల్లకానుంది. నువ్వా...నేనా? అనే రీతిలో సాగిలో సమరంలో గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో బరిలో నిలిచిన స్వతంత్రులు సైతం విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ ఫలితాలు కొందరు నేతలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. రాజకీయ భవిష్యత్‌నూ నిర్ణయించనున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 206 వార్డులకు 1178 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు పరోక్ష పద్ధతిలో వ ుునిసిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సిలర్‌గా గెలుపొందిన వారిని క్యాంపులకు తరలించేలా పార్టీలు, చైర్మన్‌గిరీపై కన్నేసిన నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ మెజారిటీ దక్కకున్నా..స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చక్రం తిప్పాలని పార్టీలు భావిస్తున్నాయి.
 
 ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో స్వపక్షం, విపక్షంతో సంబంధం లేకుండా మద్దతు కూడగట్టుకునే వ్యూహంలో చైర్మన్ అభ్యర్థులు ఉన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లాలో అత్యంత బలహీనంగా ఉండటంతో మూడు నాలుగు మునిసిపాలిటీలు మినహా మిగతా చోట ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్ర ఫలితం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీ తాము సాధించే ఫలితాల ఆధారంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదువులను దక్కించుకోవాలని భావిస్తున్నాయి.
 
 నేతలకు ప్రతిష్టాత్మకం !
 గద్వాల మునిసిపాలిటీ మాజీ మంత్రి డీకే అరుణ, వనపర్తి మునిసిపాలిటీ మాజీ మంత్రి జి.చిన్నారెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ రాజకీయాల నుంచి నిష్ర్కమించడంతో ఎవరుపట్టు సాధిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజా మాజీ ఎమ్మెల్యేలకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఫలితాలకు ముందు సవాలు విసురుతున్నాయి.
 
 మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, షాద్‌నగర్‌లో ప్రతాప్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డి ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. నారాయణపేట మునిసిపాలిటీలో పాగా వేస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. కల్వకుర్తిలో వైఎస్‌ఆర్‌సీపీ, అయిజలో టీఆర్‌ఎస్ పాగా వేస్తామనే ధీమాతో ఉన్నాయి.
 
 లెక్కింపు ఇలా..
 మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ: మునిసిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధంచేశారు. స్థానిక ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలో లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ఆరంభమవుతుంది. రౌండ్ల వారీగా కేవలం రెండు గంటల్లోనే పూర్తిచేయనున్నారు. కౌంటింగ్ కోసం కళాశాలలో హాళ్లతోపాటు భారీకేడ్లు, ఇతర ఏర్పాట్లుచేశారు. ఆయా మునిసిపాలిటీలకు కేటాయించిన టేబుళ్ల ప్రకారం ప్రతి వార్డును మూడురౌండ్లలో ఓట్లను లెక్కించి ఎన్ని టేబుల్స్ ఉన్నాయో ఆరగంటలో ఫలితాలను ప్రకటిస్తారు.  
 
 మహబూబ్‌నగర్
 వార్డులు 41, పోలింగ్ కేంద్రాలు 130
 లెక్కింపునకు 10టేబుళ్లకు ప్రతి టేబుల్‌కు నాలుగువార్డుల కేటాయింపు
 లెక్కించే ఈవీఎంలు 147
 బరిలో ఉన్న అభ్యర్థులు 367
 
 గద్వాల
 వార్డులు 33, పోలింగ్ కేంద్రాలు 49
 లెక్కింపును 5 టేబుల్స్, ఒక్కో టేబుల్‌కు 6వార్డులు
 లెక్కించే ఈవీఎంలు 56,
 బరిలో ఉన్న అభ్యర్థులు 130
 
 వనపర్తి
 26వార్డులు, పోలింగ్ కేంద్రాలు 51
 ఆరువార్డులకు ఆరుటేబుల్స్ కేటాయింపు
 లెక్కించే ఈవీఎంలు 59
 బరిలో ఉన్న అభ్యర్థులు 128
 
 నారాయణపేట
 మొత్తం వార్డులు 23, పోలింగ్ కేంద్రాలు 28
 లెక్కింపునకు 4టేబుల్స్, ఒక్కోటేబుల్‌కు 6వార్డుల కేటాయింపు
 లెక్కించే ఈవీఎంలు 33
 బరిలో ఉన్న అభ్యర్థులు 108
 
 కల్వకుర్తి
 మొత్తం వార్డులు 20, పోలింగ్ కేంద్రాలు 20
 లెక్కింపుకు 4టేబుల్స్, ఒక్కో టేబుల్‌కు 5వార్డుల కెటాయింపు,
 లెక్కించే ఈవీఎంలు 24
 బరిలో ఉన్న అభ్యర్థులు 87
 
 నాగర్‌కర్నూల్
 మొత్తం వార్డులు 20, పోలింగ్ కేంద్రాలు 22
 లెక్కింపుకు 4టేబుల్స్, ఒక్కో టేబుల్‌కు 5వార్డుల కేటాయింపు
 లెక్కించే ఈవీఎంలు 26
 బరిలో ఉన్న అభ్యర్థులు 134
 
 షాద్‌నగర్
 మొత్తం వార్డులు 23, పోలింగ్ కేంద్రాలు 39
 లెక్కింపుకు 4టేబుల్స్, ఒక్కోటేబుల్‌కు 5వార్డుల కేటాయింపు
 లెక్కించే ఈవీఎంలు 45
 బరిలో ఉన్న అభ్యర్థులు 144
 
 అయిజ
 వార్డులు 20, పోలింగ్ కేంద్రాలు 20
 4టేబుల్స్, ఒక్కో టేబుల్‌కు 5వార్డులు
 లెక్కించే ఈవీఎంలు 24
 బరిలో ఉన్న అభ్యర్థులు 68
 

>
మరిన్ని వార్తలు