ఆయనొస్తే బతకలేం..!

29 Apr, 2014 02:25 IST|Sakshi
ఆయనొస్తే బతకలేం..!
  • వంశీ తీరుపై టీడీపీ నేతల్లో ఆందోళన
  •  వెన్నుపోటుకు రంగం సిద్ధం
  •  సొంత పార్టీలోనే ఏకమవుతున్న వ్యతిరేక వర్గం
  •  తన సామాజికవర్గంలోనే సహాయనిరాకరణ!
  •  పద్మవ్యూహంలో గన్నవరం టీడీపీ అభ్యర్థి
  •  రోజురోజుకీ నీరుగారుతున్న   గెలుపు ఆశలు
  •  సాక్షి, విజయవాడ : గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. ఆయన దుందుడుకు స్వభావం వల్ల గతంలో ఇబ్బందులు పడ్డవారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు. వంశీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సొంత సామాజికవర్గంలోనే ఆయనకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గం పనిచేస్తోంది.

    వంశీ గెలిస్తే నియోజకవర్గంలో ఆయన వర్గం మినహా మిగిలినవారిని ఇబ్బందులకు గురిచేస్తారనే భయం వారిలో నెలకొంది. నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి వంశీ గతంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపైనే దాడులు చేయించారు. ఆయా వర్గాల వారితో ఆయన ఇప్పుడు సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ గతంలో జరిగిన ఘటనలను వారు జ్ఞప్తికి తెచ్చుకుని రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని భయపడుతున్నారు.

    రెండు దశాబ్దాల కాలంగా నియోజకవర్గంలో మైన్స్, వైన్స్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వంశీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వంశీ అధికారంలోకి వస్తే తాము తట్టుకోలేమని, తమ వ్యాపారాలు గుల్ల అవుతాయని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
     
    చంద్రబాబు పర్యటన సమయంలోనే దాడులు

     
    వరద బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు 2006లో మానికొండ గ్రామానికి రాగా, టీడీపీలోని జి.కృష్ణబాబు వర్గ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలో వచ్చిన వంశీమోహన్ తన అనుచరులతో కలిసి మానికొండలో తమకు వైద్య శిబిరానికి అనుమతించలేదంటూ తనతోపాటు కృష్ణబాబు, సూరిబాబు, సత్యనారాయణ తదితరులపై దాడి చేసినట్లు వల్లూరి వెంకటేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త అప్పట్లో ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ఈ ఘటన నేపథ్యంలో వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాత రాజీ కుదరడంతో కేసులు ఎత్తేసుకుని వంశీ తిరిగి పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు పైకి కృష్ణబాబు వర్గంతో వంశీ సఖ్యతగా ఉన్నా పాత విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం వంశీతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నవారే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేసరికి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
     
    దాసరితో పొసగని వైనం...
     
    సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, వంశీలు నిన్నటి వరకు కత్తులుదూసుకున్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల వల్ల రాజేంద్రనాథ్‌రెడ్డి పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో బైండోవర్ కేసులు పెట్టారు. ఏడాది పాటు ఇరువర్గాల నేతలు కమిషనరేట్ చుట్టూ తిరిగారు. తనవంటి శాంతస్వభావం కలిగిన వ్యక్తిపై బైండోవర్ కేసు పెట్టటం అన్యాయమని దాసరి అప్పట్లో ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు టికెట్ రాకపోవడం ఎలా ఉన్నా.. వంశీ గతంలో చేసిన అల్లర్లకు దాసరి బాలవర్ధనరావు కుటుంబం, ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. గత దశాబ్దకాలంగా పక్కలో బల్లెంలా ఉన్న వంశీమోహన్‌ను దెబ్బతీసేందుకు తగిన సమయం వచ్చిందని వారు భావిస్తున్నారు. దీంతో పైకి వంశీకి సహకరిస్తున్నట్లు కనపడుతున్నా... లోలోపల మాత్రం వ్యతిరేకంగా లాబీయింగ్ నడుపుతున్నారు.
     
    దేవినేని కుటుంబంతో విభేదాలు...

     
    మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఆయన సోదరుడు, టీడీపీకి చెందిన దేవినేని బాజీప్రసాద్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు, వంశీకి మధ్య విభేదాలు ఉన్నారుు. పార్టీలో ఆధిపత్యం కోసం దేవినేని ఉమాతో విభేదించగా, నగరంలోనూ ఆధిపత్యం కోసం దేవినేని నెహ్రూతో గొడవలకు దిగారు. ఈ క్రమంలో దేవినేని నెహ్రూ వర్గీయులపై వంశీ అనుచరులు కేసులు కూడా పెట్టారు. దేవినేని కుటుంబ సభ్యులు కూడా వంశీ ఓటమికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
     
    ప్రచారంలోనూ అదే పోకడ..
     
    వంశీ తన ఎన్నికల ప్రచార పర్వంలోనూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. కుర్రకారుతో తప్పతాగించి ఊరూ వాడా తిప్పటం ఆయనకు మైనస్‌గా మారింది. ప్రచార సమయంలో కూడా గొడవలు, అల్లర్లు చెలరేగుతుండటంతో ప్రజలు భయూందోళనలకు గురవుతున్నారు.
     
    డబ్బే ప్రధాన ఆయుధం..!

    అన్నివైపుల నుంచి ఎదురుదాడిని ఎదుర్కొంటున్న వంశీ చివరకు డబ్బే ప్రధాన ఆయుధంగా మార్చుకున్నట్టు సమాచారం. చివరకు డబ్బును వెదజల్లి గెలవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. స్వపక్షంలో అసంతృప్తులు, వెన్నుపోట్ల నడుమ వంశీ ధనరాజకీయం ఎంతవరకు పనిచేస్తుందన్నది వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు