ఓట్లు ఫుల్.. సీట్లు నిల్ !

18 May, 2014 02:21 IST|Sakshi

* భారీగా ఓట్లు సాధించినా సీట్లు గెలుచుకోలేని పలు పార్టీలు
* ఓట్ల శాతంలో మూడో స్థానంలో నిలిచినా ఒక్కసీటూ రాని బీఎస్పీ
* తక్కువ ఓట్లతోనే రికార్డు స్థాయిలో సీట్లుపొందిన టీఎంసీ, అన్నాడీఎంకే, బీజేడీ
* సీపీఐ, డీఎంకే సహా 1,652 పార్టీలకు సున్నాయే

న్యూఢిల్లీ:
ఓట్లు గొప్ప.. సీట్లు దిబ్బ.. దేశవ్యాప్తంగా పలు పార్టీల విచిత్రమైన పరిస్థితి ఇది. ఆ పార్టీలు రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించినా కూడా ఒక్క సీటూ గెలుచుకోలేకపోయాయి. అదే తక్కువ శాతం ఓట్లు వచ్చిన కొన్ని పార్టీలు ఏకంగా రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలైన మొత్తం ఓట్లలో వివిధ పార్టీలు సాధించిన ఓట్ల శాతాన్ని చూస్తే..  282 ఎంపీ సీట్లు సాధించి విజయ దుందుభి మోగించిన బీజేపీ గత ఎన్నికల్లో కంటే ఓట్ల శాతాన్ని 12 శాతం పెంచుకుని.. 31 శాతం (17.2 కోట్ల) ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ఓట్ల శాతం 28 నుంచి 19.3 శాతాని (10.7 కోట్ల ఓట్లు)కి తగ్గింది. ఈ పార్టీ 44 సీట్లు మాత్రమే సాధించగలిగింది.

ఇక 4.1 శాతం ( దాదాపు 2.3 కోట్ల) ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 3.8 శాతం ఓట్లు పొందిన టీఎంసీ 34 సీట్లు, 3.3 శాతం ఓట్లు పొందిన అన్నాడీఎంకే ఏకంగా 37, 1.9 శాతం ఓట్లు పొందిన శివసేన 19, 1.2 శాతం ఓట్లు గెలుచుకున్న టీఆర్‌ఎస్ 11 సీట్లు  గెలుచుకున్నాయి. ఇదే సమయంలో 3.4 శాతం ఓట్లు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాలు, 3.3 శాతం ఓట్లు పొందిన సీపీఎం 9 సీట్లు, 2 శాతం ఓట్లు సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ 4 స్థానాలు సాధించాయి.  ఇక అన్నింటికన్నా చిత్రమైనదేమిటంటే.. ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల సంఖ్య పరంగా 20 సీట్లతో ఐదో పెద్ద పార్టీగా నిలిచిన బిజు జనతాదళ్ (బీజేడీ)కు వచ్చిన ఓట్లు కేవలం 1.7 శాతమే... సరిగ్గా ఇంతేశాతం ఓట్లు పొందిన డీఎంకే పార్టీకి కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు.

ఇక దేశవ్యాప్తంగా నమోదైన ఓట్లలో దాదాపు 2.5 శాతం చొప్పున సంపాదించిన వైఎస్సార్‌సీపీ 9, టీడీపీ 16 స్థానాలు సాధించాయి. బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ఓట్లలో 16 శాతానికిపైగా సాధించిన జేడీయూ కేవలం రెండే లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగింది. కాగా... సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఒక శాతానికిపైగా ఓట్లను 18 పార్టీలు సాధించగలిగాయి. సీపీఐ, శిరోమణి అకాలీదళ్, డీఎండీకే, పీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి చాలా పార్టీలకు ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ సారి ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘నోటా’కు దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య 60 లక్షలు.
 
 1,652 పార్టీలకు సున్నాయే..
 బీజేపీ కూటమి హవా కొనసాగిన ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్‌ఎల్డీ, ఏజీపీ వంటి ప్రముఖ పార్టీలు ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. అంతేకాదు దేశంలో ప్రస్తుతం రిజిస్టరైన మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 1,687 కాగా.. ఇందులో 1,652 పార్టీలకు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ సారి లోక్‌సభకు దేశవ్యాప్తంగా 8,200 మంది అభ్యర్థులు పోటీ పడగా.. వారిలో వివిధ పార్టీల తరఫున బరిలోకి దిగిన 5,007 మందిలో 540 మంది గెలవగా, స్వతంత్రులుగా రంగంలోకి దిగినవారిలో ముగ్గురు విజయం సాధించారు.  
 
 కమలదళంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు గెలుపు
 ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బరిలో నిలిపిన ప్రతి ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు విజయం సాధించారు. అదే.. కాంగ్రెస్‌కు చెందిన ప్రతి 10 మంది అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే గెలవగలిగారు. మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 428 మంది అభ్యర్థులను పోటీకి నిలిపింది. అందులో 282 మంది గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 457 మంది అభ్యర్థులను పోటీకి దించగా.. అందులో 44 మంది మాత్రమే గెలిచారు. అన్నా డీఎంకే, బిజూ జనతాదళ్, లోక్‌జనశక్తి పార్టీ వంటివి తమకు బలమున్న ప్రాంతాలకే పరిమితమై పోటీ చేయటం వల్ల వాటి గెలుపు శాతం ఎక్కువగా నమోదు చేశాయి.
 
 వాటి గెలుపు శాతాలు 90 శాతానికి పైగా ఉన్నాయి. ఇక తమకు బలం లేని ప్రాంతాల్లోనూ పోటీ చేసిన పార్టీ గెలుపు శాతం చాలా దారుణంగా ఉంది. 443 స్థానాల నుంచి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 4 సీట్లలోనే విజయం సాధించటంతో ఆ పార్టీ గెలుపు శాతం కేవలం 0.9 గా నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ తనకు బలమున్న పశ్చిమబెంగాల్‌లోనే కాక.. ఇతర ప్రాంతాల నుంచి కూడా కలిపి 100 మందికి పైగా అభ్యర్థులను నిలిపింది. దీనివల్ల బెంగాల్‌లో అత్యధికంగా 34 సీట్లు గెలుచుకున్నప్పటికీ.. ఆ పార్టీ గెలుపు శాతం 30 గానే ఉంది.

>
మరిన్ని వార్తలు