జన తరంగం

5 May, 2014 01:01 IST|Sakshi
జన తరంగం
  • విజయమ్మ రోడ్‌షోలకు అద్భుత జన స్పందన
  •  ప్రసంగాలపై వెల్లువెత్తిన ప్రజా ప్రశంసలు
  •  వివిధ వర్గాలతో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి భేటి
  •  సింహాద్రి అప్పన్న  దీవెనలతో మొదలై భీమిలి సాగరహోరు సాక్షిగా, చినవాల్తేరులో జనవాహిని కదలిరాగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ ఆదివారం ఎన్నికల ప్రచార యాత్ర అనూహ్యరీతిలో అద్భుతంగా సాగింది. మండువేసవిలో చల్లదనాన్ని అందిస్తున్నట్లు ఫ్యానుగాలి నగరాన్ని మలయమారుతంలా తాకింది. విజయమ్మ  సింహాచలం, భీమిలి, విశాఖ నగర పరిధిలోని చినవాల్తేరు,రాంనగర్, హెచ్‌బీ కాలనీ సభల్లో చేసిన ప్రసంగాలకు అద్భుత స్పందన లభించింది. రోడ్‌షోలలో అడుగడుగునా జనం ఆమెకు నీరాజనాలు పట్టారు. వివిధ వర్గాల ప్రముఖులతో ఆమె సమావేశమై చేసిన ఆలోచనాత్మక, ఆచరణాత్మక సూచనలు అందరి కితాబులందుకున్నాయి.
     
    సాక్షి, విశాఖపట్నం : ‘‘మీకు నేను తోడుంటా. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా. ఎంపీగా గెలిచాక మీ కష్టసుఖాలు నాతో పంచుకోండి. మహానేత వైఎస్‌కు విశాఖ అంటే ప్రాణం. ఇక్కడ సహజసిద్ధ ప్రకృతి అందాలు ఆయనకు బాగా ఇష్టం. ఎప్పుడూ నాతో అనేవారు. విశాఖపట్నం బాగుంటుందని..అక్కడి ప్రజలు చాలా మంచి వాళ్లని. మీ అందరినీ చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది’’ విజయమ్మ భావోద్వేగంతో చెప్పిన మాటలివి.. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి విజయమ్మ సింహాచలం, భీమిలి, చినవాల్తేరు, రాంనగర్ రోడ్డు, హెచ్‌బీ కాలనీల్లో రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు.

    విజయమ్మను చూసేందుకు జనం పరుగులు తీశారు. ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. ఆమె చెప్పిన ప్రతిమాటను ఆసక్తిగా విన్నారు. విశాఖ నగరంలోకి కాన్వాయ్ రాగానే పూలతో ఆమెకు స్వాగతం పలికారు. వీరందరిని చూసి విజయమ్మ పులకరిం చారు. జగన్ అధికారంలోకి రాగానే అయిదు సంతకాలతో ప్రతి ఒక్కరి సమస్య లు పరిష్కరిస్తారని చెప్పడంతో చప్పట్లు చరిచారు. జై జగన్..జై జగన్ అంటూ యువత నినదించింది. ఎంపీగా పోటీ చేస్తున్న తనను ఆదరించండంటూ పిలుపునిచ్చారు.

    విశాఖను అంతర్జాతీయస్థాయి నగరంగా మార్చుకుందామన్నారు. విశాఖలో చాలామంది యువతకు ఉద్యోగావకాశాలు లభించడం లేదని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమల విస్తరణ చేపట్టి స్థానికులకు ఎక్కువ అవకాశం కల్పిస్తారని చెప్పారు. మరోపక్క ఉదయం, మధ్యాహ్నం విజయమ్మ ఐటీ నిపుణులు, రైతు సంఘాల నేతలు, మత్స్యకార వర్గాలు,వైశ్యులతో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలు విన్నారు.
     

మరిన్ని వార్తలు