బీహార్ మహిళకు ‘నైటింగేల్’ పురస్కారం

5 May, 2014 03:48 IST|Sakshi
బీహార్ మహిళకు ‘నైటింగేల్’ పురస్కారం

పాట్నా: పోలియో నివారణకు విశేష సేవలందించినందుకుగానూ బీహార్‌కు చెందిన ఆరోగ్య శాఖ అధికారి మార్తా డోడ్రేను భారత ప్రభుత్వం ఆదివారం ఫ్లోరెన్స్ నైటింగేల్ 2014 అవార్డుకు ఎంపిక చేసింది. 40 ఏళ్ల మార్తా బీహార్‌కు పొరుగునే ఉన్న జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన గిరిజన మహిళ. ఆమె బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని కుషేశ్వర్‌స్థాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు. పోలియో టీకాల ప్రచారంలో తన పనితీరును గుర్తించి అవార్డు ప్రకటించడం తనకు సంతోషంగా ఉందని మార్తా చెప్పారు. పోలియో టీకాల ప్రచారంలో భాగంగా ఆమె ప్రతిరోజూ మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు అనేక కిలోమీటర్లు కాలినడకనే వెళ్లి వందలాది మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించారు.

 

ఈ అవార్డు కింద మార్తాకు రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా మే 12న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా డోడ్రేకు అవార్డు ప్రదానం చేయనున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుకు డోడ్రే ఎంపికైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు