ఏపీలో ఫ్యాన్‌గాలి

7 May, 2014 01:37 IST|Sakshi
ఏపీలో ఫ్యాన్‌గాలి

నేడే ఎనిమిదో విడత పోలింగ్
సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీకే విజయావకాశాలు
బీజేపీతో టీడీపీ పొత్తు పట్ల మైనారిటీ ఓటర్లలో వ్యతిరేకత
దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు గడ్డుకాలం

 
 నవ్యాంధ్ర నిర్మాణానికి.. ఓటేద్దాం రండి.  ఓటు... ప్రజాస్వావ్యు వ్యవస్థలో వజ్రాయుుధం.  పౌర ప్రయోజనాలను కంటికి రెప్పలా కాపు కాసే రెండక్షరాల తారకవుంత్రం.  ఐదేళ్ల పాటు వునల్ని పాలించాల్సిన వారిని ఎంచుకోవాల్సిన రోజు వచ్చేసింది. ఈ ఒక్క రోజు సాకులన్నీ పక్కన పెడదాం. అందరవుూ ఒక్కటై కదులుదాం. వెళ్లి ఓటేద్దాం. సరైన వారిని ఎంచుకుని వురీ ఓటేద్దాం. స్వర్ణయుుగాన్ని సాధించి చూపించే సవుర్థులను ఎన్నుకుందాం. వున భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. ఐదేళ్ల పాటు రోజూ నిశ్చింతగా ఉందాం. నా ఒక్క ఓటు పడకపోతే ఏవువుతుందనే ఆలోచనే వద్దు. ఒక్కో బిందువూ కలిస్తేనే సింధువు. వునవుంతా శాసనకర్తలమేనని, వునం వేసే ఒక్కో ఓటూ వున భవితను శాసిస్తుందని గుర్తుంచుకుందాం. నూరు శాతం పోలింగ్‌తో కొత్త చరిత్ర సృష్టిద్దాం. పదండి... ఓటేసి గెలుద్దాం...
 
7 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్
 - 64 లోక్‌సభ స్థానాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల తతంగాన్ని సజావుగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలను 35 రోజుల పాటు తొమ్మిది విడతల్లో నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 30 నాటికి ఏడు విడతల పోలింగ్ ముగియడంతో దేశంలోని రాజకీయ పార్టీల్లో అలసట కనిపిస్తోంది. రాజకీయ పార్టీల ప్రచారంలో పునరావృతమవుతున్న అవే వ్యక్తిగత విమర్శలు, ప్రతి విమర్శలు వాటి ఆలోచనల్లో దివాలాకోరుతనానికి అద్దం పడుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రధాన జాతీయ పార్టీలు రూపొందించుకున్న వ్యూహాలు, ప్రచారంలో అవి అనుసరించిన తీరుతెన్నులను సమీక్షించడం నేడు జరుగుతున్న ఎనిమిదో విడత పోలింగ్ సందర్భంగా కీలకం కాగలదు.  
 
  - ప్రవీణ్ రాయ్
 సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్
 డెవలపింగ్ సొసైటీస్(సీఎస్‌డీఎస్)

 
దేశం నలువైపులా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ తెలివిగా రూపొందించిన తన జంట వ్యూహంపై ఆధారపడింది. మొదటగా తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలో పార్టీ అగ్రనేతలంతా ‘గుజరాత్ నమూనా’, ‘రాష్ట్రాల్లో నిర్ణయాత్మక ప్రభుత్వాలు’ ప్రచారంతో హోరెత్తించారు. మరోవైపు పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, అనుబంధ శక్తులు ముఖ్యంగా బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో, మతపరమైన ఉద్వేగాలకు పేరుపొందిన రాష్ట్రాల్లో ‘హిందుత్వ’ కార్డును బాహాటంగాను, పరోక్షంగాను ప్రచారంలోకి తెచ్చారు.
 
 మోడీ దూకుడును అరికట్టడంలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ చతికిలపడినట్లే కనిపించడంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ మోడీ వర్సస్ ఇతరులుగా మారింది. కాంగ్రెస్ ప్రధాన ప్రచార సారథి రాహుల్ గాంధీ తన ప్రచారంలో యూపీఏ-2 సర్కారు సాధించిన విజయాలను ఏకరువు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించినా, ఓటర్లకు చేరువ కావడంలోను, వారికి అర్థమయ్యే రీతిలో వివరించడంలో విఫలమయ్యారు. మోడీ దూకుడును ఎదుర్కొనేందుకు ప్రచారానికి ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగడమే ఇందుకు నిదర్శనం. ఇక ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు, ఇతర బీజేపీయేతర పార్టీలు కూడా మోడీపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఒక పార్టీ ప్రధాని అభ్యర్థికి, ఇతరులకు నడుమ పోటీగా కుదించుకుపోయిన తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవే. మోడీకి, ఇతరులకు నడుమ జరుగుతున్న ప్రస్తుత పోటీలో పార్టీ విస్మృతిలోకి జారుకుంది. ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడిన తర్వాత ఈ పరిణామంపై కూలంకషమైన విశ్లేషణలు జరుగుతాయి.  
 
 ఆంధ్రప్రదేశ్-25
ఈ విడతలో జరిగే ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. సీమాంధ్రలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో కోస్తాంధ్రలో 17, రాయలసీమలో 8 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 10 శాతానికి పైగానే ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 12 శాతానికి పైగా ముస్లింలతో పాటు దాదాపు 10 శాతం మంది క్రైస్తవ ఓటర్లు ఉన్నారు. గత 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 21 స్థానాలతో ఘన విజయం సాధించగా, మిగిలిన నాలుగు స్థానాలనూ టీడీపీ దక్కించుకుంది.
 
 ఆంధ్రప్రదేశ్‌లోని కుల సమీకరణాలను బట్టి చూసుకుంటే 2009 లోక్‌సభ ఎన్నికల్లో (సీఎస్‌డీఎస్ ఎన్‌ఈఎస్ 2009 సమాచారం ఆధారం) రెడ్డి ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కమ్మ ఓటర్లు టీడీపీ వెంట నడిచారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాపులు 1989 నుంచి రెండు ప్రధాన పార్టీల గెలుపు ఓటములను నిర్ణయిస్తూ వచ్చారు. అయితే, 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) బరిలోకి దిగడంతో కుల సమీకరణాలు మారాయి. మూడు పార్టీలకూ వాటి అధినేతల కులాల నుంచి మద్దతు లభించింది. పీఆర్పీకి బీసీల్లో ముఖ్యమైన కులాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్, పీఆర్పీలతో పోలిస్తే బీసీల్లో ఎక్కువ మంది మద్దతును టీడీపీయే పొందింది. కాంగ్రెస్‌కు ముస్లింలు, మాలలు మద్దతుగా నిలవగా, మాదిగల్లో కొందరు కాంగ్రెస్ వైపు, మరికొందరు టీడీపీ వైపు నిలిచారు. ముస్లింలు కాంగ్రెస్‌కే అండగా నిలిచారు.
 
 రాష్ట్రంలో ఇటు లోక్‌సభకు, అటు అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలను చూరగొన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిసలైన వారసుడని ప్రజలు భావిస్తున్నారు. యూపీఏ సర్కారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేపట్టిన రాజకీయ కక్ష సాధింపు చర్యల కారణంగా ప్రజల్లో ఆయన పట్ల నెలకొన్న సానుభూతి కూడా ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓట్ల రూపంలో లబ్ధి కలిగించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న ఫలితంగా రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్ వర్గాల ఓట్లన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపే మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల టీడీపీ-బీజేపీ కూట మికి విజయావకాశాలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి.
 
 టీడీపీ-బీజేపీ పొత్తులో తలెత్తిన పొరపొచ్చాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చాయి. పొత్తు పట్ల ఉభయ పార్టీల మద్దతుదారుల్లోనూ అసంతృప్తి ఉంది. ఫలితంగా ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి బదిలీ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే. జగన్‌మోహన్ రెడ్డి అక్రమంగా భారీ ఆస్తులను పోగు చేసుకున్నారని టీడీపీ-బీజేపీ కూటమి గుప్పిస్తున్న ఆరోపణలను ఓటర్లు విశ్వసిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ వద్ద అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలిస్తే, ఆరోపణలు గుప్పిస్తున్న పార్టీల అభ్యర్థులు కూడా ఆస్తుల విషయంలో తక్కువేమీ కాదని ఓటర్లకు తేలికగానే అర్థమవుతోంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో చాలా మంది శతకోటీశ్వరులే. రాజకీయాలను ప్రజాసేవ కోసం కాకుండా స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్న వారే.
 
 వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన కడప లోక్‌సభ స్థానంలో పోటీని ముఖ్యంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్‌కు సోదరుడి వరుసయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. కొత్త రాష్ట్రమైన సీమాంధ్రకు ఏది రాజధానిగా ఉండాలనే అంశం నుంచి గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరా, శాంతి భద్రతల సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచారాంశాలుగా ఉన్నాయి. ఇక రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.  
 
 2009 లో ఎవరికెన్ని
 ఈ 64 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 34 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు మూడు స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 4 స్థానాలను, లెఫ్ట్‌ఫ్రంట్ 6, బీఎస్పీ 5, ఎస్పీ 3, ఇతర పార్టీలు 9 స్థానాలను గెలుచుకున్నాయి. అంటే, ఎనిమిదో విడత పోలింగ్ జరగనున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు 58 శాతం స్థానాలను కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
 
 బీహార్-7
 ఈ విడతలో బీహార్‌లోని శివహర్, సీతామఢీ, ముజఫర్‌పూర్, మహారాజ్‌గంజ్, సారణ్, హజీపూర్ (ఎస్సీ), ఉజియార్‌పూర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో ఆరు నియోజకవర్గాలు తిర్హుట్, ఒక నియోజకవర్గం మిథిల ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ 10 శాతానికి పైగానే ఉన్న ముస్లిం ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకపాత్ర పోషించనున్నారు.  లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని బీజేపీని నేరుగా ఢీకొంది. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీకి రాం రాం చెప్పేసి ఒంటరిగా బరిలోకి దిగిన జేడీయూ మూడో స్థానానికి పరిమితమైన సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 17 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు పూర్తిగా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైపు మళ్లినట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. కుల సమీకరణాలను చూసుకుంటే అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) ఓటర్లు ఇప్పటి వరకు జేడీయూ వైపు ఉంటూ వచ్చారు. దాదాపు వంద కులాలకు చెందిన ఎంబీసీల జనాభా 30 శాతానికి పైమాటే. ఓబీసీల్లో యాదవులు లాలూ వైపు ఉండగా, కుర్మీలు నితీశ్ వెంట ఉన్నారు.
 
 మోడీని ఓబీసీకి చెందిన నాయకుడిగా బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయడంతో కుర్మీలు మినహా ఎంబీసీలలో ఎక్కువమంది ఈసారి బీజేపీ వైపు మొగ్గుతున్నారు. లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్డీదేవి పోటీలో ఉన్న సారణ్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే, 2009లో తన భర్త గెలుచుకున్న స్థానాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యత ఆమెపై పడింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ప్రతాప్ రూడీ, బీహార్ శాసనమండలి చైర్మన్, జేడీయూ అభ్యర్థి సలీం పర్వేజ్ నుంచి ఆమె గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. సారణ్‌తో పాటు మహారాజ్‌గంజ్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. మహారాజ్‌గంజ్ నుంచి ఆర్జేడీ సిటింగ్ ఎంపీ ప్రభునాథ్ సింగ్ బరిలో ఉన్నారు. ఇక మాజీ సీఎం, కురువృద్ధుడైన జేడీయూ సిటింగ్ ఎంపీ రామ్‌సుందర్ దాస్ హజీపూర్ నుంచి మరోసారి బరిలోకి దిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
 
 హిమాచల్-4
 హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్డా, మండి, హమీర్‌పూర్, సిమ్లా(ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. 2009 ఎన్నికల్లో వీటిలో మూడింటిని బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ప్రస్తుత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం హమీర్‌పూర్. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై కమల్ కాంత బాత్రా పోటీ చేస్తున్నారు. ఆమె కార్గిల్ యుద్ధంలో అమరుడైన, పరమవీర చక్ర పురస్కార గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి రాజీందర్ సింగ్ రాణా ఆమెకు ప్రత్యర్థులుగా ఉన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మండిలోనూ పోరు ఆసక్తికరంగానే ఉంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ, కెయొంతాల్ రాజవంశానికి చెందిన ప్రతిభా సింగ్ బీజేపీ ప్రత్యర్థి స్వరూప్ శర్మను ఎదుర్కొంటున్నారు. ఈ నాలుగు స్థానాల్లో 2009 నాటి ఫలితాలే రావచ్చని భావిస్తున్నారు. పరిస్థితులు ప్రతికూలిస్తే బీజేపీ మరో స్థానాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది.  
 
 ఉత్తరాఖండ్-5
 ఉత్తరాఖండ్‌లో టెహ్రీగఢ్‌వాల్, గఢ్‌వాల్, అల్మోరా(ఎస్సీ), నైనితాల్- ఉధమ్‌సింగ్‌నగర్, హరిద్వార్ నియోజకవర్గాల్లో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. నైనితాల్-ఉధమ్‌సింగ్‌నగర్, హరిద్వార్ స్థానాల్లో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ మొత్తం 5 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. అయితే, ఈ సారి కాంగ్రెస్‌కు అంత అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ సీనియర్ నేత సత్పాల్ మహారాజ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం, మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోకపోవడం పార్టీని బాగా దెబ్బతీశాయి. విజయ్ బహుగుణ కుమారుడు సాకేత్ బహుగుణ కాంగ్రెస్ టికెట్‌పై టెహ్రీగఢ్‌వాల్ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరక్‌సింగ్ రావత్ గఢ్‌వాల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి హరీశ్ రావత్ భార్య రేణుక రావత్ హరిద్వార్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో గెలుచుకున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోయేలా ఉంది.
 
 ఉత్తరప్రదేశ్-4

 ఈ రాష్ట్రంలో నేడు పోలింగ్ జరుగుతున్నవి జరగనున్నవి ఐదో దశ ఎన్నికలు. ఈ విడతలో 15 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అవి అమేథీ, సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, కౌశాంబీ(ఎస్సీ), ఫూల్పూర్, అలహాబాద్, ఫైజాబాద్, అంబేద్కర్‌నగర్, బహరాయిచ్(ఎస్సీ), కైసర్‌గంజ్, శ్రావస్తీ, గోండా, బస్తీ, సంత్ కబీర్‌నగర్, భదోహి. వీటిలో అవధ్ ప్రాంతంలో 4, తూర్పు ప్రాంతంలో 5, ఈశాన్య ప్రాంతంలో 6 నియోజకవర్గాలున్నాయి. బహరాయిచ్, కైసర్‌గంజ్, శ్రావస్తీ, గోండా నియోజకవర్గాల్లోని ఓటర్లలో  20 శాతానికి పైగా, మరో 8 నియోజకవర్గాల్లో 10 శాతానికి పైగా ముస్లిం లున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎస్సీ ఓటర్ల శాతం కూడా గణనీయంగానే ఉంది. నాలుగు స్థానాల్లో 10 శాతానికి పైగా, మిగ తా స్థానాల్లో 20 శాతానికి పైగా ఎస్సీ ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ 15 స్థానాల్లో కాంగ్రెస్ 7, బీఎస్పీ 5, సమాజ్‌వాదీ పార్టీ 3 సీట్లు గెలుచుకున్నాయి.
 
రాష్ట్రంలోని మొత్తం 80 నియోజకవర్గాల్లో కనీసం 50 గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీకి ఈ స్థానాలు చాలా కీలకమైనవి. అయితే, ముస్లింలు, దళితులు, యాదవులు గణనీయ సంఖ్యలో ఉండటం, వారు బీజేపీకి ఓటేసే అవకాశం లేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసే అంశం. పై కారణాల వల్ల ఈ స్థానాల్లో బీజేపీ బోణీ కొట్టలేకపోవచ్చు. ఇన్నాళ్లూ బీఎస్పీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న దళితులను తమవైపు తిప్పుకోవడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. దాంతోపాటు గుజరాత్ మోడల్ అభివృద్ధి మంత్రం, మోడీ ఓబీసీ వర్గానికి చెందినవాడంటూ ఓబీసీ కార్డు ఉపయోగించడం ద్వారా ఓట్లను రాబట్టాలనుకుంటోంది. ఈ ప్రయత్నంలో బీజేపీ ఎంతవరకు సఫలం అవుతుందన్నది ఫలితాల తరువాతే తెలుస్తుంది. కాంగ్రెస్ 2009లో గెలుచుకున్న స్థానాల్లో మెజారిటీ స్థానాలను కోల్పోనుంది. వాటిని కుల సమీకరణాల ప్రభావంతో ఎస్పీ, బీఎస్పీ, లేదా బీజేపీ తమ ఖాతాలో వేసుకోవచ్చు.
 
 కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న అమేథీపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. రాహుల్‌గాంధీపై టీవీ నటి స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపింది. వారిద్దరికీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుమార్ విశ్వాస్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. 16 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న సుల్తాన్‌పూర్ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ అక్కడ వరుణ్ గాంధీని పోటీలో నిలిపింది. వరుణ్‌గాంధీపై కాంగ్రెస్ టికెట్‌పై ‘రాణీ సాహెబా’ అమితా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆమె భర్త సిట్టింగ్ ఎంపీ ‘రాజా సాహెబ్’ సంజయ్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
 
 పశ్చిమ బెంగాల్-6

 రాష్ట్ర వాయువ్య ప్రాంతంలోని పురూలియా, మేదినీపూర్, ఝార్‌గ్రామ్(ఎస్సీ), బంకురా, బిష్ణుపూర్, అసన్‌సోల్(ఎస్సీ) నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఇవి వామపక్షాలకు కంచుకోటల్లాంటి సీట్లు. వీటిలో మేదినీపూర్, అసన్‌సోల్, బిష్ణుపూర్‌లలో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ ఆరు స్థానాల్లో సీపీఎం 4, సీపీఐ 1, ఎఫ్‌బీఎల్ 1 గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో అసన్‌సోల్ నుంచి సీపీఎం తరఫున బరిలో ఉన్న సిటింగ్ ఎంపీ బాంగ్సా గోపాల్ చౌధరీ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రఖ్యాత బెంగాలీ గాయకుడు బాబుల్ సుప్రియో, తృణమూల్ టికెట్‌పై పోటీ చేస్తున్న డోలా సేన్ ఆయనకు గట్టి పోటీనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాల నుంచి కొన్ని స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశం ఉంది. రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని, ఓటర్లను ప్రలోభపెడ్తున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలు.. ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆ పార్టీ వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. మే 12న రాష్ట్రంలోని మరో 18 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
 
 జమ్మూ కాశ్మీర్-2
 జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్, బారాముల్లా-కుప్వారా నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన లడఖ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి తరఫున బౌద్ధుడైన త్సెరింగ్ సంఫాల్ పోటీ చేస్తుండగా, బీజేపీ కూడా మరో బౌద్ధుడు థుప్సాన్ చెవాంగ్‌ను రంగంలోకి దించింది. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి గులాం రజా వీరిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు. బౌద్ధుల ఓట్లలో చీలిక ఫలితంగా గులాం రజాకు విజయావకాశాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. గత 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్థి గులాం హసన్ ఖాన్ ఈసారి పోటీ చేయడం లేదు. ఇక బారాముల్లా-కుప్వారా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీ షరీఫుద్దీన్ షేక్ పోటీ చేస్తుండగా, పీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యే ముజఫర్ హుస్సేన్ బేగ్‌ను రంగంలోకి దించింది. ఇక్కడ ద్విముఖ పోటీ హోరాహోరీగా ఉంది. మరోవైపు, ఎన్నికలను బహిష్కరించాలంటూ జేకేఎల్‌ఎఫ్, హురియత్ కాన్ఫరెన్స్ నేతలు యథా ప్రకారం పిలుపునివ్వడంతో ఈ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.
 
 మన ఎన్నికలు.. అమెరికా కంపెనీలు
 దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అమెరికాకు చెందిన మూడు సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లయిన ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్ ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు, ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేందుకు వేదికగా నిలిచాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా అనేకమంది అభ్యర్థులు, అన్ని పార్టీలు తమ ప్రచారానికి ఈ నెట్‌వర్కింగ్ సైట్లను ఉపయోగించుకున్నాయి. ఏడవ దశ ఎన్నికలు ముగిసిన తరువాత ట్విటర్‌లో 4.9 కోట్ల ఎన్నికలకు సంబంధించిన కామెంట్లు, చర్చలు చోటు చేసుకున్నాయంటే జనబాహుళ్యంలోకి అవి ఎంతగా చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల కోసం ఫేస్‌బుక్ గత సంవత్సరం నుంచే సన్నాహాలు ప్రారంభించిందని ఆ కంపెనీ పాలసీ మేనేజన్ కేటీ హాబత్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఈ మార్చిలో ఫేస్‌బుక్‌లో ‘ఎలక్షన్ ట్రాకర్’ను ప్రారంభించామని తెలిపారు.

మరిన్ని వార్తలు