మేధ వెనుక 500లకు పైగా జన్యువులు!

19 Mar, 2018 00:38 IST|Sakshi

మనిషి మేధకు.. మనలోని దాదాపు 500 జన్యువులు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల మంది డీఎన్‌ఏలను అధ్యయనం చేయడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎడిన్‌బరో, సౌతాంప్టన్, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసింది. మానవ జన్యుక్రమంలోని దాదాపు 187 ప్రాంతాలు ఆలోచన నైపుణ్యానికి కారణమవుతున్నాయని, 538 జన్యువులు వేర్వేరు మార్గాల్లో మనిషి తెలివిని ప్రభావితం చేస్తున్నాయని వీరు చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మేధకు సంబంధించిన కొన్ని జన్యువులతో దీర్ఘాయుష్షుకూ సంబంధం ఉండటం!

ఇంకేముంది... ఇంకొన్నేళ్లలో ఈ జన్యువులన్నింటినీ ప్రభావితం చేయడం ద్వారా అపరమేధావులను తయార చేసేద్దామని అనుకుంటున్నారా? అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కేవలం జన్యుక్రమం ద్వారానే మనిషికి మేధను సమకూర్చడం చాలా కష్టమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త డేవిడ్‌ హిల్‌ అంటున్నారు. జన్యువులతోపాటు వాతావరణ పరిస్థితులు కూడా మేధను ప్రభావితం చేస్తూండటం దీనికి కారణం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, బుర్రకు పదును పెట్టే పరిస్థితుల్లో పెరిగే వారితో పోలిస్తే, ఇవేవీ లేని పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు తక్కువ మేధ కలిగి ఉంటారని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు