బతుకు చెట్టుకు తల్లి వేర్లు

7 Jun, 2019 00:29 IST|Sakshi

ఆరుగురు మహిళలు. ఆరుగురూ సామాన్యులు. సామాన్యులే కానీ.. వీళ్ల చేతుల్లో బంజరు భూమి బంగారమైంది. వీళ్లు వేసిన విత్తనం అడవై మొలకెత్తింది. వీళ్లు నాటిన మొక్క డాక్టర్‌ అయి ప్రాక్టీస్‌ పెట్టింది. వీళ్లు నూర్పిన సిరిధాన్యాలు.. ఆధునిక మానవుడికి తినడమెలాగో నేర్పాయి. మనం నరుక్కుంటున్న కొమ్మల్ని తిరిగి భూమాతకు అంటుకడుతున్న ఈ తల్లులకు.. సహస్ర ప్రణామాలు. శతకోటి వందనాలు.  

వెనుకటి మనిషి ‘చెట్టు నరికి గోడ కట్టకూడదు’ అని చెబితే అతడిని వెనుకబడిన మనిషిగా చూసింది మోడరన్‌ సొసైటీ. అభివృద్ధి పేరుతో అడవులను విచక్షణా రహితంగా నరికేసింది కూడా అప్పుడే. అడవుల్లో స్థిరనివాసం ఏర్పరచుకునే రోజుల నుంచి తనను తాను సంఘజీవిగా మలుచుకుంటూ పరిణతి చెందే క్రమంలో మనిషి పెట్టుకున్న నియమావళే చెట్టును నరికి గోడ కట్టకూడదనేది.

మైదానంలో ఇల్లు కట్టుకోవాలి తప్ప, ఇంటి నిర్మాణం కోసం చెట్టును నరికేయవద్దని చెప్పడంలోనే... మనిషి జీవిక చెట్టుతో ముడిపడి ఉందని పూర్వికులు గ్రహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మాటను ఒట్టి నానుడిగా విని వదిలేసి, వేలకు వేల ఎకరాల్లో వందల ఏళ్ల కిందట పుట్టి, ఆకాశాన్నంటే ఎత్తుకు ఎదిగిన చెట్లను సైతం మొదలు నరికేసి... అదే నేలలో ఆకాశాన్నంటే భవనాలను కట్టి ‘ఇదిగో ఇదే అభివృద్ధి’ అని మోడరన్‌ మేన్‌ అంటున్నాడు.

రాళ్లూరప్పలకు జీవం
ఇప్పుడా మోడరన్‌ మేన్‌కి కర్తవ్యాన్ని, మానవ ధర్మాన్ని గుర్తు చేస్తూ.. ‘మీరు కాంక్రీట్‌ జంగిల్‌ కడితే, మేము నేచురల్‌ జంగిల్‌ని నిర్మిస్తాం’ అని మట్టిని తవ్వి మొక్కను నాటారు ఓ ఆరుగురు గ్రామీణ మహిళలు. వందలు, వేలు కాదు.. లక్షల మొక్కలు నాటారు! రాళ్లు రప్పలతో నిండి ఉన్న బంజరు నేలను చదును చేశారు. చేతి సత్తువతో గుంటలు తవ్వి మొక్కను నాటారు. ఆ మొక్క బతకాలంటే నీళ్లు పోసేదెవరు? దగ్గరలో నది లేదు, కాలువ లేదు. నీటి ప్రాజెక్టులనేవి ఉంటాయని కూడా వాళ్లకు తెలియదు. కుండలతో నీళ్లు మోసుకొచ్చి మొక్కలకు పోశారు.

కడవ భుజాన పెట్టుకుని కిలోమీటర్ల దూరం నీటిని మోసి మొక్కలను బతికించారు. ఆ మొక్కలు పెరిగి పెద్దయ్యాయి, దశాబ్దాల వాళ్ల కష్టం పచ్చటి అడవిగా కళ్ల ముందు నిలిచింది. ఇంతటి శ్రమకోర్చిన వాళ్లందరూ గ్రామీణ దళిత మహిళలే. చిరుధాన్యాలు సాగుచేసే మహిళా రైతులు కూడా. వారి శ్రమను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆ ఆరుగురు మహిళలను గౌరవిస్తూ ఈ ఏడాది ‘ఈక్వేటర్‌ ప్రైజ్‌’ను ప్రకటించింది!

నారూనీరు డీడీఎస్‌
ఈ ప్రైజ్‌కు ఎంపికైన మహిళలకు మార్గదర్శనం చేసిన స్వచ్ఛంద సంస్థ ‘డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ వాళ్లకు సన్మానం చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ ఐదవ తేదీన మెదక్‌జిల్లా జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌లో జరిగిన  కార్యక్రమంలో ఈ మహిళలను శాలువాతో సత్కరించారు. కార్యక్రమానికి పుణెకి చెందిన పర్యావరణ వేత్త ఆశిశ్‌ కొఠారి హాజరయ్యారు.

ముఖ్య అతిథులుగా క్లైమేట్‌ చేంజ్‌ ఎక్స్‌పర్ట్, ఎన్‌ఐఆర్‌డి విజిటింగ్‌ ఫ్యాకల్టీ ఉత్కర్ష్‌ ఘాటే, ఐఏఎస్‌ అధికారి ఉషారాణి పాల్గొన్నారు. ఉత్కర్ష్‌ ఘాటే సిరిధాన్యాల సాగులో ఉన్న ప్రయోజనాలను వివరించారు. ‘‘పత్తి వంటి వాణిజ్య పంటలు వేసిన రైతుల ఆత్మహత్యలను చూస్తున్నాం. కానీ మిల్లెట్స్‌ (కొర్రలు, జొన్న, సజ్జ, అరికెల వంటి చిరుధాన్యాలు) రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక్కటీ లేదు. చిరుధాన్యాలు.. వాటిని తిన్న మనిషి ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు రైతును కూడా కాపాడతాయి’’ అని అన్నారు.  

మహిళలే వెన్నుదన్ను
భూమి పుట్టి నాలుగన్నర కోట్ల ఏళ్లయిందని అంచనా. కాంస్య యుగం,   లోహయుగం, మధ్యయుగం, ఆదిమ మానవ జాతి దశ నుంచి ఇప్పటి మోడరన్‌ పీరియడ్‌ వరకు ఎలా లెక్కేసుకున్నా సరే మనిషి ఒకచోట స్థిరంగా నివసించడం మొదలు పెట్టింది.. ఈ చివరి పదివేల నుంచి పదిహేను వేల ఏళ్ల మధ్యలోనే ఉంటుంది. అయితే కోట్ల ఏళ్ల భూమి మనుగడను ఆందోళనలో పడేయడానికి మనిషికి నిండా రెండువేల ఏళ్లు కూడా పట్టనే లేదు! ఆధునిక మానవుడు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీశాడు. చివరికి అతడి మనుగడే దెబ్బతినే పరిస్థితులు ఏర్పడడంతో ‘దిద్దుబాటు’కోసం  డి.డి.ఎస్‌. వంటి సంస్థలు మహిళల సహాయంతో నడుం బిగిస్తున్నాయి.
– వాకా మంజులారెడ్డి

విశ్వవిజేతలు
►నాగ్వార్‌ సునందమ్మది ఇందూరు గ్రామం. రాళ్లు రప్పలతో నిండి ఉన్న తొంభై ఎకరాల భూమిని చదును చేసి వేలాది మొక్కలను నాటింది. ఆమె కృషి... సామాజిక అడవులు విస్తరించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసింది.

►మైసనగారి రత్నమ్మ ఆల్గోల్‌ గ్రామంలో మహిళా సంఘం నాయకురాలు. ఆమె 72 గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో మహిళాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో యాభై ఎకరాలు, వంద ఎకరాలు, రెండు వందల ఎకరాల గుబ్బడి (మెట్ట నేల) ఉండేది. ఆ నేలల్లో వేప, మామిడి, చింత, రామచింత మొక్కలను నాటించారామె. ఫారెస్టు అధికారులు పర్యటనకు వస్తే చాలు... బీడు భూములను చూపించి మొక్కలిస్తే ఈ నేలలో కూడా నాటుతానని అడిగేదని, మొక్కలు ఏర్పాటు చేసే వరకు అధికారులను వెంటాడేదని చెబుతారు తోటి మహిళలు. ఆమె ఆ రకంగా చెట్లను నాటి సామాజిక అడవిని నాటి పరిరక్షించారు. అందుకు గాను భారత ప్రభుత్వం 1993లో ఆమెను ‘వృక్షమిత్ర’ పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సంగతులను గుర్తు చేసుకున్నారామె.

►బేగరి తుల్జమ్మది పస్తాపూర్‌. ముప్పైకి పైగా మహిళా సంఘాల రూపకల్పనతోపాటు విత్తన సాగులో ఆమె విశేషంగా కృషి చేశారు. సిరిధాన్యాలను సాగు చేసే మహిళా రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా (32 గ్రామాలకు) చేస్తూ ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించారామె. ఆమె చొరవతో బీడుపడిపోయి ఉన్న ఐదువేల మూడు వందల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.  ఆ నేలలో వాళ్లు చిరుధాన్యాలను పండిస్తున్నారు.

►చిల్కపల్లి అనుసూయమ్మ మారుమూల గ్రామాల మహిళలను నడిపించిన మార్గదర్శి. పడావు నేలలకు పచ్చటి దుప్పటి కప్పడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. వేలాది మంది మహిళలను చైతన్యవంతం చేయడంలో ఆమె దిట్ట. వారందరినీ కలుపుకుంటూ నిరుపయోగమైన భూమిలో లక్షలాది మొక్కలు నాటి అడవిని సృష్టించిన మహిళ.

►నడిమిదొడ్డి అంజమ్మది గంగ్వార్‌ గ్రామం. ఆమె పాతికేళ్లుగా మనదేశీయ సంప్రదాయ విత్తనాలను కాపాడుతోంది. ఈ విత్తనాలతో సాగు చేసిన పంటలకు చీడపీడలు ఆశించవు. ఆమె పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం కలిగిన మహిళ కూడా. ఈ రంగంలో అంజమ్మ సేవలకుగాను గతంలో అనేక ప్రాంతీయ, జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. సిరిధాన్యాల సాగుతో జీవితాలను నిలబెట్టుకోవచ్చని, సిరిధాన్యాలతో తినడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని పాతికేళ్ల కిందటే జాతీయ వేదికల మీద చెప్పిన మహిళ కూడా.

►ఎర్రోళ్ల కనకమ్మది మచ్నూర్‌ గ్రామం. ఆమె పాతికేళ్లుగా బీడుభూములను సాగులోకి తీసుకువచ్చి, ఔషధ వనాన్ని పెంచారు. వనాన్ని పెంచడంతోపాటు ఏ చెట్టులో ఏ ఔషధ లక్షణం ఉందో తెలుసుకుని, గ్రామంలోని మహిళలను సంఘటిత పరిచి వారికి తెలియచేసింది. ఆధునిక వైద్యం అందుబాటులో లేని తమ గ్రామాల్లో ప్రత్యామ్నాయ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారామె.

యూఎన్‌డీపీ ఈక్వేటర్‌ అవార్డు
ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌). ఈ సంస్థ ఏటా పేదరిక నిర్మూలన, జీవవైవిధ్య నిరంతరత కోసం సమిష్టిగా కృషి చేస్తున్న సంఘాలకు ఈక్వేటర్‌ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది 127 దేశాల నుంచి 847 నామినేషన్లు వచ్చాయి. ఎంపికైన 20 అవార్డుల్లో ఒకటి మన తెలుగు వాళ్లది. తెలుగు వాళ్లు ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలానికి చెందిన గ్రామీణ మహిళల సంయుక్త కృషే ఈ అవార్డును తెచ్చి పెట్టింది.

ఐక్యరాజ్య సమితి గడచిన 17 ఏళ్లుగా ఈ అవార్డులిస్తోంది. మనదేశం ఇంతకుముందు తొమ్మిది ఈక్వేటర్‌ అవార్డులు అందుకున్నది. ఇది పదవ అవార్డు. దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో సమష్టిగా కృషి చేసిన స్వయం సహాయక బృందాల మహిళలు 2019 అవార్డుకు ఎంపికయ్యారు. వారికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో బహుమతి ప్రదానం చేస్తారు. పురస్కారంలో జ్ఞాపికతోపాటు పదివేల డాలర్ల (సుమారుగా ఏడు లక్షల రూపాయలు) నగదు బహుమతి అందచేస్తారు.

మరిన్ని వార్తలు