మనుషులను, వాళ్ల మనస్తత్వాలను చదవడం ఇష్టపడతాను!

23 Jan, 2014 01:28 IST|Sakshi

అక్కినేని దేవుణ్ని పెద్దగా నమ్మేవారు కాదు; అభిమానుల ఆశీర్వాదబలాన్ని మాత్రం నమ్మేవారు. అక్కినేని గుడికి వెళ్లేవారు కాదు; పరిశ్రమనే దేవాలయంగా భావించేవారు. ఆధ్యాత్మిక, ఆహార, అలవాట్ల విషయాల్లో ఆయనవైన పద్ధతులు ఉండేవి. నటనలోనే కాదు, వాటిలో కూడా ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకోవచ్చు.  కొన్నేళ్లక్రితం అక్కినేనితో వివిధ వ్యక్తిగత అంశాల మీద జరిపిన సంభాషణాసారం..
 
 ఆరోగ్యం:

 మీ ఆరోగ్య రహస్యం ఏంటంటారు?
 1. వారసత్వంగా వచ్చిన జీన్స్; 2. నిర్వహణ; 3. అభిమానుల ఆశీస్సులు! నిర్వహణ అంటే క్రమశిక్షణ, మితాహారం, సమయపాలన, ప్రతి విషయానికీ గాభరా పడకపోవడం... ఇవన్నీ! ఇక అభిమానుల ఆశీస్సులు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. (నవ్వుతూ) లండన్‌లో బీబీసీ వాడి ప్రసారాలు ఇక్కడ మనం అందుకోవడం లేదూ... ఇదీ అంతే!
 
 మిమ్మల్ని భయపెట్టిన అనారోగ్యం ఏదైనా వుందా?
 (క్యాన్సర్‌ను గుర్తించకముందు చెప్పిన మాటలివి) అసలు ఇంతవరకూ తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి ఎరగను! ఒక్క పన్నూ ఊడలేదు! ఒకే ఒక్కసారి అనారోగ్యం వచ్చింది. 1955లో కాశ్మీరులో ఉండగా స్మాల్‌పాక్స్ వచ్చింది. 1974 అక్టోబర్ 18న తొలిసారి బైపాస్ సర్జరీ జరిగింది. 1988లో రెండోసారి గుండెపోటు వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనుకుని, గుండె బలహీనంగా ఉండడంతో మానేశారు. ఆ ఆపరేషన్ అయ్యి నాలుగు దశాబ్దాలైంది. ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరూ ఇలా ఆపరేషన్ అయ్యాక ఇన్నేళ్లు బతకలేదట! మనోబలాన్ని మించింది మరొకటి లేదు. అదే నా శక్తి!
 
 మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది?
 ఉదయం 5 గంటలకు లేస్తాను. 45 నిమిషాలు మెడిటేషన్, వాకింగ్ చేస్తాను. తర్వాత పేపర్లు చదువుతాను. 1946 నుంచి దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి సలహా మేరకు ‘హిందూ’ పేపరు కచ్చితంగా చదువుతున్నాను.
 
 ఆల్కహాల్ అలవాటు వుందా?
 నాకు మొదట్లో మందు అలవాటు లేదు. అయితే కొలెస్టరాల్‌ను కరిగించేందుకు ఆల్కహాల్ ‘వాసోడైలేటర్’గా పనిచేస్తుందని రోజుకు రెండు ఔన్సుల బ్రాందీ తీసుకోమన్నారు డాక్టర్లు. అప్పటినుంచీ తీసుకుంటున్నాను.
 
 ఆహారం:
 మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? ఇష్టపడే ఐటమ్స్? తిననివి?
 దాదాపు వెజిటేరియన్‌నే! మునుపు కొంచెం నాన్‌వెజ్ తినేవాణ్ణి కానీ ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఒకప్పుడు వృత్తి మూలంగా లిమిట్‌లో తినాల్సి వస్తే, ఇప్పుడు ఆరోగ్యరీత్యా లిమిట్‌లో తినాల్సి వస్తోంది. గుత్తి వంకాయ కూరంటే ఇష్టం! అలాగే బెల్లంతో చేసిన పదార్థాలంటే ఇష్టం. ఇక ఇష్టపడనివంటే... వేపుళ్లు అస్సలు తినను!
 
 మీ డైలీ ఫుడ్ చార్ట్..?
 బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్స్ ఎక్కువగా వుండే పదార్థాలు, పాలు తీసుకుంటాను. వీటికి అదనంగా చిన్న పైనాపిల్ ముక్క, గ్లాసు మజ్జిగ! మధ్యాహ్నం సోయామిల్క్ తాగుతాను. మళ్లీ 11.30 నుంచి 12 గంటల మధ్య మజ్జిగ తీసుకుంటాను. ఇక లంచ్ విషయానికొస్తే ఒక చపాతీ, పులుసు కూర, ఇగురు కూర, సాంబారు, ఒక స్పూన్ అన్నం తింటా! రాత్రి మాత్రం కొద్దిగా అన్నం తీసుకుంటాను.
 
 దుస్తులు:
 సాధారణంగా ఎటువంటి దుస్తులు ఇష్టపడతారు? షాపింగ్ చేస్తారా?
 సినిమాల్లో రంగురంగుల బట్టలు వేసుకోవడం ఇష్టపడేవాణ్ణి కానీ, విడిగా ఖద్దరు ఇష్టం. అప్పుడప్పుడూ ప్యాంటూ షర్టూ వేస్తుంటాను. ఇక షాపింగ్ అంటారా... అమెరికాలాంటి దేశాలకెళితే తప్ప అస్సలు చేయను!
 
 ఫ్యాషన్లను పట్టించుకుంటారా?
 పట్టించుకుంటాను... కానీ అవి సినిమాల వరకే పరిమితం!
 
 ఈ పంచెకట్టు ఎప్పటినుంచి అలవాటు?


 సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేస్తున్నప్పుడు ఓసారి వెయ్యి రూపాయలు సంపాదించాను. ఆ సమయంలో దుక్కిపాటి మధుసూధనరావుగారు, మరో ఇద్దరు బంధువులు కలిసి తలో ఐదువేల పెట్టుబడితో గుడివాడలో ‘జవహర్ ఖాదీబండార్’ పెట్టారు. ఆ షాపు ఓపెనింగ్ టైంలో ముగ్గురు కలిసి వ్యాపారం చేయకూడదని ఎవరో సెంటిమెంట్ పెట్టారు. దాంతో నా దగ్గరున్న వెయ్యి రూపాయలతో నేనూ ఒక భాగస్వామిగా చేరాను. అప్పుడు ఖద్దరు బట్టలు కొన్నాను. అప్పటినుంచీ పంచెలే అలవాటయ్యాయి. అప్పుడు నా వయసు పదిహేడేళ్లు. అన్నపూర్ణా స్టూడియో కట్టిన సమయంలో ప్యాంట్లు కుట్టించుకున్నాను. జూలై, ఆగస్టుల్లో గాలి ఎక్కువగా వీస్తుంది. అప్పట్లో స్టూడియో చుట్టుపక్కలంతా నిర్మానుష్యం కాబట్టి సుడిగాలులు వీచేవి. దగ్గరుండి పనులు చేయిస్తున్నప్పుడు ఈ గాలులు వల్ల పంచె ఎగురుతుండేది. దాంతో కంఫర్ట్ కోసం పది ప్యాంట్లు కుట్టించాను. అంతకుముందు నా జీవితంలో ప్యాంట్లు కుట్టించడమే ఎరుగను. నా కోసం అప్పట్లో ప్రత్యేకంగా పొందూరులో పంచె అంచెను డిజైన్ చేసేవారు. ‘నాగేశ్వరరావు అంచు’ అని దానికి పేరు. ఇప్పుడు హైదరాబాదులోనే కొంటున్నాను. ప్రస్తుతం సభలూ సమావేశాలకే పంచెను పరిమితం చేశాను.
 
 ఆడవాళ్లలో మీరు ఎటువంటి వస్త్రధారణను కోరుకుంటారు?
 చీరకంటే అందమైనది ఇంకేం ఉంది! ఒంపుసొంపులన్నీ చీరకట్టులోనే బాగా కనబడతాయి!
 
 పుస్తకాలు:
 మీరు పుస్తకాలు చదువుతుంటారా?
 చదవను! మనుషులను, వాళ్ల మనస్తత్వాలను చదవడం ఇష్టపడతాను. అయితే చిన్నప్పుడు మాత్రం శరత్ నవలలు చదివేవాణ్ణి.
 
 ఆధ్యాత్మిక గ్రంథాలు..?
 అస్సలు చదవను! నా ఆధ్యాత్మిక గ్రంథం సినిమానే! దేవాలయం ఇక్కడే వుంది... దేవుడూ ఇక్కడే వున్నాడు! ఇక వేరే ఆధ్యాత్మికత లేదు.
 
 మీరిష్టపడే సినీరచయితలు?


 చాలామంది ఉన్నారు. నీట్‌గా డైలాగ్‌లు రాయాలంటే సముద్రాల రాఘవాచార్యగారే! అలాగే ఆరుద్ర గారిది ఒక స్టయిల్. నాకెక్కువ ఆత్రేయగారే పనిచేశారు. ఇలా ఇంకా ఎంతోమంది అద్భుతమైన ప్రతిభావంతులు నాకెంతో జ్ఞానాన్నిచ్చారు!
 
 భక్తి:

 దేవుని ఉనికి గురించి..?


 ఎనభై లక్షల జీవరాశుల్లో గొప్ప జీవరాశి మానవుడు. అతణ్ణి మించిన శక్తిమంతుడు లేడు. అసలు నా దృష్టిలో మనకు మించిన శక్తిమంతుణ్ణి గౌరవించడమే ఆస్తికత్వం! నేను పెద్దవాళ్లను గౌరవిస్తాను, మంచితనం ఎక్కడుంటే అక్కడే భగవంతుడు ఉంటాడని నమ్ముతాను. అసలు దేవుడున్నాడా లేడా అనే మీమాంసను పక్కనపెడితే... ఆ భావన వల్ల్లే మానవుల్లో కనీసం ఈ మాత్రమైనా క్రమశిక్షణ ఉందనిపిస్తుంది.
 
 అయితే మీరు నాస్తికులనుకోవచ్చా?


 మనల్ని సృష్టించిన అమ్మానాన్నల్ని పూజించకుండా, ఎక్కడో వున్నాడనుకునే దేవుణ్ణి పూజిస్తాం. దేవుడు ఉన్నాడని అనుకోవడం తప్పనికాదు... అన్నీ తనే చూస్తాడులే అనుకుని అనేక పాపాలు చేసుకుంటూ పోవడమే మంచిది కాదు! వెళ్లి హుండీలో డబ్బు వేసేస్తే పాపాలు కడిగేస్తాడు అనుకోవడం పొరపాటు. నువ్వు చెడు చేయనంతవరకు దేవునిగురించి ఆలోచించనక్కర్లేదంటాను నేను!
 
 మీ హ్యాపీనెస్‌కి, హ్యాపీలైఫ్‌కి దేవుడు కారణం అనుకోవడం లేదా?


 వయసు పెరిగాక - ఆరోగ్యం, మనశ్శాంతి, కాలక్షేపం అనేవి అతిపెద్ద సమస్యలు. అయితే వీటిని మూడు ఆయుధాలతో తిప్పికొట్టవచ్చు. దేహాన్ని దేవాలయంగా చూసుకోవడంతో ఆరోగ్యాన్ని; తన చుట్టూ వున్న వాళ్లను ప్రేమిస్తూ, ప్రేమించబడటంతో మనశ్శాంతిని; దేనికి ఎంత సమయం కేటాయించాలనే సమయపాలన ద్వారా కాలక్షేప సమస్యను జయించవచ్చు. ఏ వయసులోనైనా మనిషి సుఖసంతోషాలతో హాయిగా జీవించాలంటే యుద్ధాలు, పోరాటాలు చేసి రాజ్యాలు జయించనవసరం లేదు. ఈ మూడు సూత్రాలను కచ్చితంగా పాటించడమే నా హ్యాపీనెస్‌కు, హ్యాపీలైఫ్‌కూ ఫార్ములా!
 
 - పులగం చిన్నారాయణ

మరిన్ని వార్తలు