గ్రేట్‌ రైటర్‌ ; జేమ్స్‌ జాయిస్‌

13 Aug, 2018 00:13 IST|Sakshi

ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రభావశీల రచయితల్లో ఒకరిగా గుర్తింపు పొందారు జేమ్స్‌ జాయిస్‌ (1882–1941). చైతన్య స్రవంతి శైలిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన రచయిత. అత్యంత సంక్లిష్టమైన రచనా విధానానికి సాక్ష్యాలుగా ఆయన నవలలు ‘యులెసీస్‌’, ‘ఎ పొర్ట్రెయిట్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్ట్‌ యాజ్‌ ఎ యంగ్‌మాన్‌’ (దీన్ని ‘యువకళాకారుని ఆత్మగీతం’ పేరుతో చింతపట్ల సుదర్శన్‌ తెలుగులోకి అనువదించారు), ‘ఫినెగన్స్‌ వేక్‌’ నిలుస్తాయి. ఐర్లాండ్‌లోని మధ్య తరగతి కుటుంబంలో పది మంది పిల్లల్లో పెద్దవాడిగా జన్మించాడు జాయ్స్‌. తండ్రి తాగుడు వ్యసనం వల్లా, ఆర్థిక ఎగుడుదిగుళ్ల వల్లా ఇబ్బంది పడ్డాడు. మెడిసిన్‌ మధ్యలో వదిలేశాడు.

ఇరవై ఏళ్ల వయసులోనే యూరప్‌ వలస వెళ్లాడు. ట్రియస్ట్‌(ఇటలీ), రోమ్‌ (ఇటలీ), పారిస్‌(ఫ్రాన్స్‌), జ్యూరిక్‌ (స్విట్జర్లాండ్‌) నగరాల్లో బతికాడు. అయినప్పటికీ ఆయన ఆత్మ డుబ్లిన్‌(ఐర్లాండ్‌ రాజధాని) కోసం కొట్టుకులాడేది. డుబ్లిన్‌ నడిబొడ్డుకు గనక చేరుకుంటే, ప్రపంచంలోని అన్ని నగరాల నడిబొడ్డుకు చేరుకున్నట్టే అని వ్యాఖ్యానించాడు. దానికి తగ్గట్టే ఆయన కథాసంపుటి పేరు ‘డుబ్లినర్స్‌’. చేంబర్‌ మ్యూజిక్, గ్యాస్‌ ఫ్రమ్‌ ఎ బర్నర్‌ ఆయన కవితాసంపుటాలు. మతాన్ని పూర్తిగా నిరాకరించిన జాయ్స్, తల్లి మరణశయ్య మీద ఉన్నప్పుడు సైతం ప్రార్థన చేయడానికి సిద్ధపడలేదు.
 

మరిన్ని వార్తలు