ఒక బలహీనమైన గాఢమైన ప్రేమ

6 May, 2019 00:13 IST|Sakshi

కొత్త బంగారం

లీనా ఆండర్సన్‌ రాసిన స్వీడిష్‌ నవల ‘విల్‌ఫుల్‌ డిస్‌రిగార్డ్‌’లో, 31 ఏళ్ళ ఎస్టర్‌ తెలివైనది. ఫిలాసఫీలో డిగ్రీ ఉంటుంది. కవిత్వం, వ్యాసాలూ రాస్తూ స్టాక్‌హోమ్‌లో ఉంటుంది. ఆమె ‘భౌతిక, మానసిక అవసరాలను తృప్తి పరుస్తూ, ఆమె స్వేచ్ఛకు అడ్డుచెప్పని పెర్‌తో సామరస్యమైన సంబంధంలో’ 13 ఏళ్ళుగా ఉంటుంది. ఆమెకు ‘తన ఆలోచనలు తెలుసు. తన సిద్ధాంతాల ప్రకారమే జీవించేది.’

ఒకరోజు, పేరున్న వీడియో ఆర్టిస్టయిన హ్యూగో రస్క్‌ గురించి లెక్చర్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, నెట్‌లో అతని వివరాలు వెతుకుతుండగా, ‘ఆమెకు అతనితో దృఢమైన సంబంధం’ ఉన్న భావన కలుగుతుంది. అతను ప్రేక్షకుల్లో కూర్చునుంటాడు. లెక్చర్‌ తరువాత, ‘బయటవారెవరూ నన్ను ఇంత కచ్చితంగా, లోతుగా అర్థం చేసుకోలేదు’ అని ఎస్టర్‌కు చెప్పిన క్షణమే ఆమె అతనితో ప్రేమలో పడిపోతుంది.

‘మాకిద్దరికీ గాఢమైన బంధం ఏర్పడింది’ అని స్నేహితురాళ్ళకు చెప్పినప్పుడు ‘నీపై అతనికే ఆసక్తీ ఉండదులే’ అని వారు తేల్చిపారేసినా పట్టించుకోదు. ఎస్టర్‌కు రస్క్‌తో ‘ఒంటిమీద స్పృహ లేని ఉద్రిక్తమైన వారం’ గడిపిన తరువాత, బయట ప్రపంచం కనిపించడం మానేస్తుంది. పెర్‌తో ఉండే తన సంబంధం పేలవంగా అనిపిస్తుంది. ఎస్టర్, హ్యూగో కలిసి డిన్నర్లకు వెళ్ళడం, టెక్ట్స్‌ మెసేజులు పంపుకోవడం ప్రారంభిస్తారు. 

ఆడ అభిమానులున్న హ్యూగో ఆమెను తనింటికి రానివ్వడు. తన స్టూడియోలో కలుసుకుంటాడు. ఆమె మెసేజులని పట్టించుకోవడం మానేస్తాడు. మెయిల్స్‌కు జవాబివ్వడు. అలా అని, తనకింక ఆమెపై ఆసక్తి లేదనీ చెప్పడు. ఆమె మాత్రం అతను కనిపిస్తాడేమోనన్న ఆశతో అతని స్టూడియో చుట్టూ తిరుగుతుంటుంది. ‘నా ఫోన్‌ సైలెంట్లో కానీ లేదు కదా!’ అని ఆత్రంగా, తన ల్యాండ్‌లైన్‌ నుంచి ఫోన్‌ చేసుకుని చూసుకుంటుంది. హ్యూగో ప్రతీ రెండు వారాంతాలకూ తల్లి కోసమని చెప్పి బారస్‌ అనే ఊరుకి వెళ్తానని చెప్తాడు. ఇతర స్త్రీలతో గడపడానికే వెళ్తున్నాడన్న అనుమానం కలిగినప్పటికీ, ‘అతనికేవో అడ్డంకులొచ్చుంటాయిలే’ అని నచ్చచెప్పుకుంటుంది.

బాధ మరచిపోడానికి ప్యారిస్‌ వెళ్తుంది. తటపటాయిస్తూనే హ్యూగోకి ఫోన్‌ చేస్తుంది. ‘సరే, నీవు తిరిగి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం’ అని అతనన్నప్పుడు, అలవాటైన ఆమె ఆశ మళ్ళీ చిగురిస్తుంది. వెనక్కి తిరిగి వచ్చి, పెర్‌కు అకారణంగా ఫోన్‌ చేస్తుంది. అతను తమ సంబంధాన్ని తిరిగి కొనసాగించాలనుకున్నా, ఆమె ఇష్టపడదు. ఇలా– సంవత్సరం, నాలుగు నెలలు గడిచిన తరువాత, హ్యూగోతో తనకున్న అన్యోన్యత కేవలం తన ఊహే అని గ్రహిస్తుంది. తన ఆ ఆకర్షణ, హ్యూగో కనపరిచిన వ్యక్తిత్వం వల్ల కలిగిందేనని అర్థమై, తన్ని తాను ఏవగించుకుంటుంది. తన ‘దుఃఖం అంత తీవ్రంగా, అపరిమితంగా కొనసాగడం అసాధ్యం’ అని గుర్తిస్తుంది. ఆ సంబంధం మెల్లిమెల్లిగా తెగిపోయిన వర్ణన– భావావేశంతో, నిజాయితీగా ఉంటుంది.

నవల్లో ఏ పాత్రనీ భౌతికంగా వర్ణించరు ఆండర్సన్‌. ఎవరి నేపథ్యాల, జీవనశైలుల ప్రస్తావనా ఉండదు. ఏకపక్ష ప్రేమేనని తెలిసినప్పటికీ, మనల్ని మనం ఎంత ఇష్టపూర్వకంగా వంచించుకుంటామో చెబుతుంది పుస్తకం. ప్రతి ఒక్కరూ యీ పరిస్థితిని ఎప్పుడో అప్పుడు ఎదుర్కునే ఉంటారంటారు రచయిత్రి. ఒక సంబంధంలో బలహీన స్థితిలో ఉండేది ఎక్కువ ప్రేమించే వ్యక్తే అంటారు. 

పాఠకులకు ఎస్టర్‌ పట్ల చిరాకు పుట్టినా సానుభూతీ కలుగుతుంది. పుస్తకం–తేలికైన ప్రేమకథలా కాక పాత్రల మానసిక అధ్యయనంలా అనిపిస్తుంది. డైలాగులకు కొటేషన్‌ మార్క్స్‌ ఉండనప్పటికీ, ప్రతీ పదం అర్థవంతంగా ఉన్నందువల్ల అర్థమవుతుంది. సెరా డెత్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించిన యీ పుస్తకాన్ని అదర్‌ ప్రెస్‌ 2016లో ప్రచురించింది. స్వీడిష్‌లో 2013లో మొదటిసారి ప్రచురించబడినప్పుడు ‘ఆగస్ట్‌ ప్రైజ్‌’ గెలుచుకుంది.
-కృష్ణ వేణి

మరిన్ని వార్తలు