ఏటీఎం చార్జీల మోత.. ఎదుర్కొనేదిలా..

12 Sep, 2014 23:07 IST|Sakshi
ఏటీఎం చార్జీల మోత.. ఎదుర్కొనేదిలా..

ఏటీఎంలు వచ్చిన తర్వాత అడపా, దడపా వంద.. రెండొందలకు కూడా మెషీన్ దగ్గరకి వెళ్లడం మనలో చాలా మందికి అలవాటుగా మారింది. దీంతో ఖర్చులు పెరిగిపోయిన బ్యాంకులు...ఇలాంటి ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించేయడం మొదలుపెట్టేశాయి.

నవంబర్ నుంచి ఇతర బ్యాంకుల ఏటీఎంలే కాకుండా సొంత బ్యాంకుల ఏటీఎంలలో కూడా ఉచిత లావాదేవీల సంఖ్య తగ్గిపోనుంది. నగదు విత్‌డ్రాయల్ కావొచ్చు.. మినీ స్టేట్‌మెంట్ కావొచ్చు.. ఏదైనా సరే అయిదు లావాదేవీలు దాటితే ఆపై ప్రతీ దానికి దాదాపు రూ. 20 దాకా కట్టుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. ముందుగా దీన్ని హైదరాబాద్ తదితర ఆరు మెట్రో నగరాలకే పరిమితం చేస్తున్నారు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ చార్జీల మోత  నుంచి తప్పించుకోవడానికి వీలవుతుంది.
 
సాధారణంగా ఏటీఎంలో నగదు విత్‌డ్రాయల్ మాత్రమే కాకుండా బ్యాలెన్స్ చూసుకోవడం, మినీ స్టేట్‌మెంట్లు తీసుకోవడం వగైరా లావాదేవీలు కూడా ఎక్కువగానే చేస్తుంటాం. ఇలాంటివన్నీ కూడా పరిమితిలోకే వస్తాయి. కనుక, సాధ్యమైనంత వరకూ ఇలాంటివి పెట్టుకోకుండా.. అవసరమైతే ఎస్‌ఎంఎస్ ద్వారా అకౌంటు బ్యాలెన్స్ వగైరా తెలుసుకోవచ్చు.
 
ప్రతీ కొనుగోలుకు నగదు విత్‌డ్రా చేసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా వీలైన చోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. అయితే, వీటిపై 1-2 శాతం దాకా లావాదేవీ ఫీజులు పడే అవకాశంతో పాటు ఫర్వాలేదులే అని ఎక్కువగా ఖర్చు చేసేసే ప్రమాదమూ ఉంది. ఆ విషయంలో జాగ్రత్తపడితే ఫర్వాలేదు.
 
ఏటీఎంలో నుంచి తీస్తే తప్ప కుదరనంతగా పర్సును ఖాళీ చేసుకోకుండా ఉండటం మంచిది.  విత్‌డ్రా చేసుకునేటప్పుడే తక్షణావసరం కన్నా కాస్త ఎక్కువ విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. అలాగే, ఊహించని అవసరాల కోసం ఇంటి వద్ద కొంత నగదును అట్టే పెట్టొచ్చు. అలాగని, భారీ మొత్తాలు ఇంటి దగ్గర ఉంచడం అంత శ్రేయస్కరం కాదు. పైగా  రూ. 20 ఆదా  చేసే ప్రయత్నంలో భారీ మొత్తంపై వచ్చే వడ్డీని కోల్పోయే అవకాశం ఉంది.
 
వీలైనంతగా సొంత బ్యాంకు ఏటీఎంకే ప్రాధాన్యం ఇవ్వండి. ఏటీఎంలు దగ్గర్లో ఎక్కడున్నాయో తెలిపేలా కొన్ని బ్యాంకుల యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని వాడండి.
 

మరిన్ని వార్తలు