గ్రీన్ సిటీ కోసం సెస్ | Sakshi
Sakshi News home page

గ్రీన్ సిటీ కోసం సెస్

Published Fri, Sep 12 2014 11:10 PM

trying to control pollution in delhi

* సిగరెట్ ప్యాకెట్, మద్యం సీసాపై రూపాయి చొప్పున పన్ను
*  ఈ నిధులతో పట్టణ రవాణా నిధి ఏర్పాటుకు చర్యలు
*  2017 నాటికి 8 కోచ్‌లతో 129 మెట్రో రైళ్ల ప్రవేశం
*  ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు

 
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పెరుగుతున్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మందుబాబులు, పొగరాయుళ్ల జేబులకు చిల్లు పెట్టి, తద్వారా వచ్చే సొమ్మతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, కాలుష్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించిన మరుసటి రోజే ఎల్జీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
* ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంత పరిపాలన విభాగం(జీఎన్‌సీటీడీ) అధికారులతోపాటు ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాల్లోకెళ్తే...
పజారవాణ వ్యవస్థను ప్రోత్సహించడం కోసం జీఎన్‌సీటీడీ పట్టణ రవాణా నిధిని ఏర్పాటు చేస్తుంది.
* నగరంలో విక్రయించే ప్రతి సిగరెట్ ప్యాకెట్, ప్రతి మద్యం సీసాపై ఒక రూపాయి సెస్ విధించడం ద్వారా వసూలయ్యే సొమ్ముతో ఈ నిధిని ఏర్పాటు చేస్తారు.
* కాలుష్య నియంత్రణ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటారు.
* పతి వాహనంపై వ్యాలిడ్ పీయూసీ స్టిక్కర్ ఉండేలా చూసేందుకు చర్యలు చేపడాతారు.
* ఢిల్లీలో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకునేందుకు వాహనం వ్యాలిడ్ పీయూసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న నిబంధనను విధించే విషయాన్ని పరిశీలిస్తారు.
* ఢిల్లీ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహ నాల ప్రవేశాలను నియంత్రిస్తారు.
* ఓవర్‌లోడింగ్ సమస్యను పరిష్కరించడం కోసం  ఢిల్లీలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వెయ్ ఇన్ మోషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు జీఎన్‌సీటీడీ ప్రణాళికలు రూపొందిస్తుంది.
* అనధికార పార్కింగ్‌లపై పోలీసులు కఠిన చర్యలు చేపడ్తారు.
* రద్దీగా ఉండే ఇరుకు వీధులలో పార్కిగ్‌ను నిరుత్సాహపర్చి, మల్టీలెవల్ పార్కింగ్‌లలో పార్కింగ్‌ను ప్రోత్సహించడం కోసం వేర్వేరు రేట్లతో పార్కింగ్ విధానాన్ని రూపొందిస్తారు.
* ఇరుకు రోడ్లపై ప్రీమియం పార్కింగ్ రేట్లను ప్రవేశపెట్టే విషయాన్ని కూడా పరిశీలిస్తారు.
* మెట్రో, ప్రజారవాణాకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడం కోసం బ్యాటరీతో నడిచే వాహనాలను రవాణా విభాగం, జీఎన్‌సీటీడీ ప్రవేశపెడాతాయి.
* 2017 నాటికి 129 మెట్రో రైళ్లలో 8 కోచ్‌లను ప్రవేశపెడాతారు.
* వాయు కాలుష్యం పట్ల ఢిల్లీ వాసుల్లో అవగాహన కల్పించడం కోసం రవాణా విభాగం, జీఎన్‌సీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వస్తాయి.

Advertisement
Advertisement