నిరుపేదలకు ఉచిత ప్రయాణం

4 May, 2020 03:32 IST|Sakshi

నేటి రోజులతో పోల్చుకుంటే ఒకనాడు పడిన కష్టమే నయం అనిపిస్తుంది. ఈ రోజు ఎలా గడుస్తుందా అని ఆపన్నుల కోసం దిక్కులు చూసే జీవులే ఎన్నో. ఇక అత్యవసర పరిస్థితి వస్తే.. ఆరోగ్యం సహకరించకపోతే.. ఆసుపత్రికి వెళ్లాలన్నా కష్టమే. కావల్సిన సరుకులు తీసుకొని ఇంటికి తిరిగి రావాలన్నా సరైన రవాణా సదుపాయం లేక యాతనపడే వారెందరో. ఇలాంటి సమయంలో పేదలకు ఉచితంగా ఆటో సదుపాయం అందిస్తోంది ముంబయ్‌లోని ఓ మహిళా డ్రైవర్‌. ఆమె పేరు శీతల్‌.

తన కుటుంబ పోషణకు శీతల్‌ కొన్నేళ్లుగా ఆటో నడుపుతోంది. కరోనా వైరస్‌ కారణంగా దేశమంతా లాక్డౌన్‌ కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నిరుపేదలను తన ఆటోలో ఉచితంగా తీసుకెళుతోంది. తిరిగి వారిని వారున్న చోటుకు చేర్చుతోంది. ‘నా కుటుంబ పోషణకు ఆటోను నడిపేదాన్ని. ఇప్పుడు పేదప్రజల ఇబ్బందిని చూసి, వారికి ఇలా సేవ చేయాలనుకున్నాను. వారిని వారి గమ్యాలకు చేర్చడం, అవసరాలు తీరే మార్గం చూపడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది శీతల్‌. ఈ కష్ట సమయంలో శీతల్‌ లాంటి వ్యక్తులు తమ సేవాగుణంతో గొప్పవారిగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు