గోరంత పోషణ

16 Jul, 2017 23:54 IST|Sakshi
గోరంత పోషణ

బ్యూటిప్స్‌

గోళ్లు పొడిబారకూడదు: గోరు పొడిబారడం అనేది దేహారోగ్యం మీద, సౌందర్య పోషణ మీద ఆధారపడి ఉంటుంది. దేహంలో అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉంటే గోరు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే... కొందరిలో చేసే పనుల రీత్యా గోళ్లు పొడిబారుతుంటాయి. అలాంటప్పుడు... రోజూ ఉదయం, రాత్రి గోళ్ల మీద ఒక చుక్క ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనె వేసి మునివేళ్లతో గోళ్లను వలయాకారంగా మర్దనా చేయాలి.

గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు: గోళ్లకు సౌందర్య పోషణతోపాటు గోళ్లు, చిగుళ్ల గాయాలకు చికిత్స కూడా చాలా అవసరం. గోళ్లు కత్తిరించేటప్పుడు కానీ మరే ఇతర కారణాలతోనైనా గోరు చిగురు దగ్గర చీలిపోతుంది. దానికి తేనె చక్కటి ఔషధం. గాయాన్ని కడిగి, తడి తుడిచిన తర్వాత అరచేతిలో నాలుగు చుక్కల తేనె వేసుకుని గాయానికి పట్టించాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు గాయానికి తేనె తగులుతూ ఉంటే ఇక గాయానికి ఇన్‌ఫెక్షన్‌ చేరదు.

గోళ్లు విరిగిపోతుంటే: గోళ్లు గరుకుగా మారిపోవడం, పెళుసుబారి మధ్యలో విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి అందులో గోళ్లను ముంచాలి. అలాగే 15 – 20 నిమిషాల సేపు ఉంచిన తర్వాత గోళ్లను నూనెలో నుంచి తీయాలి. కారుతున్న నూనెను మాత్రం తుడిచి గోళ్లను సబ్బుతో కడగకుండా అలాగే ఉంచాలి. ఒకటి– రెండు రోజులు నెయిల్‌ పాలిష్‌ వేయకుండా గోళ్లకు గాలి తగలనివ్వాలి.

గోళ్లకు నొప్పి లేకపోయినప్పటికీ, అవి దేహంలో ప్రాణం ఉన్న ఇతర భాగాల వంటివే. కొద్దిగానైనా సరే వాటికి గాలి అందాలి, పోషకాలు అందాలి, రక్తప్రసరణ కావాలి, సంరక్షణ కావాలి.

మరిన్ని వార్తలు