‘పాండ్యా లాంటి ఆకతాయిలకు పాఠాలు చెప్తాం’

20 Jan, 2019 01:35 IST|Sakshi

డియర్‌ మిస్టర్‌ ప్లేయర్‌

‘‘ఆడవాళ్లను చూడ్డం... వాళ్ల కదలికలను గమనించడం.. నాకు ఇష్టం.’’‘‘ఒక పార్టీకి వెళ్లాం. అక్కడున్న అమ్మాయిలను చూసి ‘‘వీళ్లలో నీ ఫ్రెండ్స్‌ ఎవరు? (తేరా వాలా కౌన్‌ కౌన్‌ హై)’’ అని అడిగారు. నేను ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. ‘‘ఈమె.. ఈమె.. ఈమె’’ అంటూ అందరినీ చూపించాను. ఎందుకంటే అందరితో ఏదో ఒకటి ఉంది నాకు. అప్పుడు మా పేరెంట్స్‌ ‘‘వాహ్‌! ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బేటా’’ అన్నారు. ఇవి కాఫీ విత్‌ కరణ్‌లో ప్రముఖ క్రికెటర్‌  హార్దిక్‌ పాండ్యా మాటలు. వివాదమై.. సుప్రీంకోర్ట్‌ దాకా వెళ్లింది వ్యవహారం. ప్రియా మాలిక్‌ కూడా ఆ క్రికెట్‌ ప్లేయర్‌ మాటలపై స్పందించారు. ‘‘అమ్మాయిలను అబ్జెక్టిఫై చేసే, చూసే పుత్రరత్నాలతో మేము ‘‘వాహ్‌! ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బేటా’’ అని అనలేము కానీ.. అలాంటి ఆకతాయిలను జెంటిల్‌మెన్‌గా తీర్చిదిద్దుతాం. తోటి మనుషులు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. థర్డ్‌ జెండర్‌ అయినా సరే.. వాళ్లకు గౌరవమివ్వాలని నేర్పుతాం. దయ, జాలి, కరుణ ఉండాలని చెప్తాం. డియర్‌ మిస్టర్‌ ప్లేయర్‌.. పవర్, పాపులారిటీతో పాటు బాధ్యతా వస్తుంది. మీలాంటి వాళ్లను యూత్‌ ఐకాన్స్‌గా తీసుకునే వాళ్లుంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మీ షోని ఒక ఏడేళ్ల పిల్లాడు చూస్తే.. మీరన్న మాటలను వాడు ఎలా తీసుకుంటాడు? ఓహో.. ఆడవాళ్లను ఇలాగే ట్రీట్‌ చేయాలేమో అని అనుకోడా? అది పురుషాహంకారంగా స్థిరపడదా? వాడితోపాటే అదీ పెరిగి బలపడ్తుంది. ఆడవాళ్లను చులకగా చూడ్డం, అగౌరవపరచడమే సహజమనే భావనలో ఉంటాడు. అదే ప్రవర్తనలో కనపడుతుంది. ఇది తల్లిదండ్రులకు గర్వకారణం కావద్దు’’ అంటూ స్లామ్‌ పొయెట్రీతో హార్దిక్‌ పాండ్యాను చెంపదెబ్బ కొట్టినంత పనిచేసింది ప్రియా మాలిక్‌.

ఎవరీ ప్రియా మాలిక్‌?!
ప్రియా మాలిక్‌ పుట్టిన ఊరు డెహ్రాడూన్‌. ఢిల్లీ యూనివర్శిటీలో ఇంగ్లీష్‌ హానర్స్‌ చదివారు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. మిడిల్‌ అండ్‌ సెకండరీ స్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. అక్కడే ‘‘అవర్‌ లేడీ ఆఫ్‌ సేక్రెడ్‌ హార్ట్‌’’ అనే స్కూల్లో టీచర్‌గా కూడా పనిచేశారు. తర్వాత ఆస్ట్రేలియాలోనే ‘‘బిగ్‌ బ్రదర్‌’’ టెలివిజన్‌ షోలో పాల్గొన్నారు. అందులో ఆమె రేసిజమ్‌నూ ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు ప్రియా. ఫైనలిస్ట్‌లో ఒకరిగా నిలిచారు.  సహజంగానే ఆమె పొయెట్‌. సమయం దొరికినప్పుడల్లా స్లామ్‌ పొయెట్రీ చదువుతారు. అలా ‘‘బిగ్‌ బ్రదర్‌’’ షోలో తను ఎదుర్కొన్న రేసిజంను స్లామ్‌ పొయెట్రీతోనే తిప్పికొట్టారు. ఇప్పుడు హార్దిక్‌ పాండ్యాకూ అలాగే ఆన్సర్‌ ఇచ్చారు.ఇండియా వచ్చాక నటనను వృత్తిగా స్వీకరించారు. ఇక్కడ కూడా ‘‘బిగ్‌ బాస్‌’’ సీజన్‌ 9 లోనూ కంటెస్టెంట్‌గా ఉన్నారు. స్లామ్‌ పొయెట్రీతోపాటు కామెడీ వీడియోస్‌కీ ప్రసిద్ధి ప్రియా మాలిక్‌. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 
– శరాది

మరిన్ని వార్తలు