క్యాన్సర్ ముప్పు తప్పుతుంది!

4 Feb, 2016 08:17 IST|Sakshi
క్యాన్సర్ ముప్పు తప్పుతుంది!

ఈ ఏడాది మొదలుకొని 2018 వరకూ... అంటే ఈ మూడేళ్ల పాటూ క్యాన్సర్ చికిత్స విషయంలో ప్రపంచం ఇస్తున్న నినాదం - ‘వియ్ కెన్... ఐ కెన్’. దీని అర్థం  ‘నాకూ సాధ్యమే. మనకూ సాధ్యమే’ అని.  ఆ సాధ్యమయ్యేదేమిటంటే... క్యాన్సర్‌ను సమూలంగా తొలగించడం. క్యాన్సర్‌కు చికిత్స అనేది సాధ్యం కాదన్నది ఒకనాటి మాట. ఇప్పుడది సాధ్యమని చెప్పడమే  ఈ నినాదం ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ కణాల భారాన్ని కేవలం  రోగి మాత్రమే భరిస్తాడనుకోవడం  పొరబాటు. దాని బరువు అందరిమీదా, సమాజం  అంతటిపైనా పడుతుంది.  అందుకే రోగి వ్యక్తిగతంగానూ,  మనమందరం సామూహికంగానూ క్యాన్సర్‌నుజయించడం  సాధ్యమని చెప్పడమే  ఈ నినాదమిచ్చే సందేశం.
 
లక్షణాలివే...
వేగంగా బరువు తగ్గడమన్నది క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కనిపించే లక్షణం. తీసుకుంటున్న ఆహారం మోతాదుగానీ, పోషకాలు గానీ తగ్గకుండా కేవలం బరువు మాత్రమే తగ్గుతూ ఉండటం  లేదా ఆకలి తగ్గుతుండటం. (ఆకలి తగ్గడం అనేది ఇతర వ్యాధుల్లోనూ కనిపించినా ముందుగా క్యాన్సర్ సంబంధిత పరీక్షలు చేయించి, అది లేదని నిర్ధారణ చేసుకోవాలి). లింఫ్‌నోడ్స్‌లో వాపురావడం, ప్రత్యేకించి పిల్లల్లో మెడమీద, చంకల్లో, గజ్జల్లోని లింఫ్‌నోడ్స్ సైజు పెరగడం, మచ్చలు వేగంగా పెరగడం, వాటిల్లో పగుళ్లు రావడం. కంఠస్వరంలో మార్పులు రావడం. (స్వరపేటిక, శ్వాసనాళాల్లో మార్పులు రావడం వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది). ఎడతెరిపి లేకుండా జ్వరం. ఇది వారాలు, నెలలు కొనసాగుతూ ఉండటం. చిన్నపనికీ తీవ్రమైన అలసట. ఎప్పుడూ నీరసం, నిస్సత్తువగా అనిపించడం. పొట్ట ఉబ్బరం అనిపించడం, వాంతులు కావడం, మధ్యమధ్యన మలబద్ధకం.  మహిళల్లో రొమ్ముల్లో కొంతగానీ, మొత్తంగానీ వాపు రావడం, రొమ్ముపై చర్మం గట్టిపడటం లేదా గుంతలు పడటం. చనుమొన ఎర్రబారడం లేదా ఆ ప్రాంతంలో రక్తస్రావం. రుతుక్రమంలో తేడాలు... ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
 
స్క్రీనింగ్‌తో తప్పుతుంది ముప్పు...
 పక్కన పేర్కొన్న లక్షణాలు కనిపించగానే కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ లేదన్న విషయం తెలుస్తుంది. ఒకవేళ ఉన్నా దాన్ని ముందే గుర్తిస్తే చాలు. పూర్తిగా తగ్గుతుంది. ఇలా స్క్రీనింగ్ పరీక్షలతో ఎలాంటి ముప్పు అయినా తొలగిపోతుంది.
 
అది కేవలం అపోహ మాత్రమే...
కొందరు తరచూ అనే మాట... ‘క్యాన్సర్ కంటే దాని చికిత్స ప్రక్రియే చాలా బాధాకరంగా ఉంటుంద’ని. ఇది కేవలం అపోహ మాత్రమే. అవగాహన లేకపోవడం వల్ల దీన్ని మరికొందరు వదంతిగా వ్యాప్తి చేస్తుంటారు. ఈ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న వైద్య చికిత్స ప్రక్రియలతో క్యాన్సర్ పూర్తిగా తగ్గేందుకే అవకాశాలు ఎక్కువ. క్యాన్సర్‌కు చేసే శస్త్రచికిత్సలో ఏమాత్రం నొప్పి ఉండదు. అసలు క్యాన్సర్ గడ్డను తొలగించిన బాధ కూడా తెలియదు. అయితే కొందరిలో సర్జరీతో కలిగే మానసిక ఒత్తిడి వల్ల గుండెపోటు రావచ్చు. ఇక సర్జరీ తర్వాత కదలకుండా ఉండటం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే శ్వాసనాళంలో రక్తపు గడ్డ ఇరుక్కుని ‘పల్మనరీ థ్రాంబో ఎంబాలిజమ్’ అనే సమస్య కూడా రావచ్చు. దీంతోనూ కొందరికి గుండెపోటు రావచ్చు. అయితే కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ఈ దుష్ర్పభావాలన్నింటినీ నివారించవచ్చు.
 
కీమో సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తాత్కాలికమే...
కీమోథెరపీతో కొన్ని దుష్ర్పభావాలు కనిపిస్తాయి. ఉదాహరణకు జుట్టు రాలిపోవడం వంటివి. అయితే కీమోథెరపీ చికిత్స వల్ల రాలిపోయిన జుట్టు మళ్లీ మామూలుగానే వస్తుంది. ఇలాంటివే మరికొన్ని ప్రభావాలూ కనిపిస్తాయి. కీమోథెరపీ వల్ల కనిపించే ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌లో భాగంగా తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్ తగ్గడం, రక్తహీనత ఏర్పడటం వంటివీ జరుగుతాయి. ఇలాంటి సమయాల్లో తన అవసరాలను పూరించుకోడానికి శరీరం ఉపక్రమిస్తుంది. ఉదాహరణకు రక్తకణాలు నశించగానే వాటిని భర్తీ చేయడానికి ఎముక మజ్జ (బోన్ మ్యారో) ఎక్కువగా పనిచేస్తుంది. దాంతో ఎర్రరక్తకణాలు పుట్టుకొస్తాయి. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు వారికి ఎరిథ్రోపోయిటిన్ అనే ఇంజెక్షన్లు అవసరమైన మోతాదులో ఇస్తుంటారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి రక్తం లేదా ప్లేట్‌లెట్స్ ఎక్కించడమూ చేస్తుంటారు.
 
తరచూ ఇన్ఫెక్షన్లు...

మనలో వ్యాధినిరోధకత కల్పించడానికి తెల్లరక్తకణాలు దోహదపడుతుంటాయి. అవి తగ్గడం వల్ల తేలిగ్గా ఇన్ఫెక్షన్‌కు గురవుతుంటారు. క్యాన్సర్ రోగుల్లో వీటి సంఖ్య కూడా తగ్గుతుంటుంది. కొన్నిసార్లు శరీరమంతా ఇన్ఫెక్షన్‌తో నిండిపోవడం, రక్తం సెప్టిక్ కావడం (సెప్టిసీమియా) వంటి సమస్యలు రావచ్చు. తెల్లరక్తకణాలు తగ్గినప్పుడు  జీసీఎస్‌ఎఫ్ (గ్రాన్యులోసైట్ కాలనీస్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్) వంటి ఇంజెక్షన్లతో తెల్లరక్తకణాలు తగ్గడాన్ని నివారించవచ్చు. ఇప్పుడు తెల్ల రక్తకణాలు తగ్గకుండా ఉండటానికి ముందుగానే గ్రాన్యులోసైట్ కాలనీస్ స్టిమ్యులేటింగ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు.

ఇన్ఫెక్షన్లను యాంటీబయాటిక్స్‌తోనూ నియంత్రిస్తారు. కొందరిలో విరేచనాలు అవుతుంటే వాటిని తగిన మందులతో ఆపుతారు. అలాగే శరీరంలోని నీటిపాళ్లను సమతౌల్యంలో ఉంచడానికి ద్రవాహారాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా ఇస్తారు. కొందరిలో ప్లేట్‌లెట్స్ తగ్గవచ్చు. అలాంటప్పుడు శరీరానికి గాయాలైతే రక్తం ఆగకుండా ప్రవహిస్తుంటుంది. అంతర్గత రక్తస్రావం జరిగినా రక్తం ఆగదు. కొందరిలో మెదడులోనూ రక్తస్రావం కావచ్చు. అలాంటి వారికి అవసరానికి తగినట్లు ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తుంటారు. కొందరిలో కీమోథెరపీ సమయంలో మందులతో వికారం, వాంతులు అవుతుండవచ్చు. దాంతో వారు ఏమీ తినలేరు. అయితే వాంతులు, వికారాలను తగ్గించడానికి మంచి మందులూ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీ సమయంలో వికారం, వాంతులు అవ్వకుండా ముందుజాగ్రత్తగా ఈ మందులను ఇంజెక్షన్స్‌గా ఇస్తుంటారు. కొందరు కీమోథెరపీ తర్వాత బాగా నీరసించి పోతారు. నిస్సత్తువ ఆవహిస్తుంది. ఇలాంటి వారు మంచి ఆహారంతో పాటు, తగినంత విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మామూలుగానే అయిపోతారు. కీమోథెరపీలో వచ్చే ఇలాంటి ప్రభావాలన్నీ తాత్కాలికమే.
 
మరింత అధునాతన చికిత్స ‘టార్గెటెడ్ థెరపీ’...
క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ మందుల ప్రభావం ఒళ్లంతా ఉండటం సాధారణం. ఇప్పుడు నిర్దిష్టంగా ఆ క్యాన్సర్ కణాలమీద మాత్రమే ప్రభావం చూపే అత్యంత ఆధునికమైన మందులూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు ఇచ్చే చికిత్సను ‘టార్గెటెడ్ థెరపీ’ అంటారు. వీటివల్ల ఆరోగ్యకరమైన ఇతర కణాలపై ఎంతమాత్రమూ ప్రభావం పడదు. ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్, తల-మెడ క్యాన్సర్, బ్లడ్‌క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లలో ఈ తరహా మందులు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. టార్గెటెడ్ థెరపీతో భవిష్యత్తులో క్యాన్సర్‌ను సమూలంగా నివారించడం, పూర్తిగా నయం చేయడమూ సాధ్యమేనని ఆధునిక పరిశోధన ఫలితాలు పేర్కొంటున్నాయి. అలాగే రేడియేషన్ చికిత్సలో కూడా నిర్దిష్టంగా ఆ క్యాన్సర్ కణాల మీద పనిచేసే అత్యంత ఆధునికమైన సైబర్‌నైఫ్ లాంటి చికిత్సా విధానం ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. సామాజికంగానూ, వ్యక్తిగత స్థాయిలోనూ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుంటే క్యాన్సర్ ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు. త్వరగా దాన్ని గుర్తిస్తే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ‘వియ్ కెన్, ఐ కెన్’ అనే ఈ క్యాన్సర్ డే సందేశం.
 
రేడియేషన్ ప్రభావాలూ అప్పటివరకే...
కొందరిలో రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి రావచ్చు. అలాంటప్పుడు రేడియేషన్ ఇచ్చేచోట చర్మం కమిలినట్లుగా అనిపించవచ్చు. కొందరిలో రక్తకణాలు తగ్గవచ్చు. మరికొందరిలో దురద లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తల, మెడ భాగంలో రేడియేషన్ చికిత్స తీసుకునే  వారికి నోరంతా పొడిబారినట్లు ఉంటుంది. పొట్టభాగంలో రేడియేషన్ చికిత్స తీసుకునేవారికి మూత్రం ఎక్కువసార్లు వస్తుండవచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ కేవలం తాత్కాలికమే. ఇవన్నీ రెండు, మూడు రోజుల్లోనే తగ్గిపోతాయి.
 
ఒకసారి క్యాన్సర్ రావడం అంటూ జరిగితే అది పూర్తిగా తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. ఇప్పుడు ఉన్న అత్యాధునిక వైద్యచికిత్సలతో క్యాన్సర్ తగ్గుతుంది. ఎంత త్వరగా దాన్ని గుర్తిస్తే తగ్గే అవకాశాలు అంతగా పెరుగుతాయి. అయితే కొన్ని అపోహలతో కొందరు క్యాన్సర్‌ను ఇంకా లొంగని వ్యాధిగానే చూస్తున్నారు. కేవలం ఈ తప్పుడు అభిప్రాయం వల్లనే, ఈ వ్యాధి పట్ల తగినంత అవగాహన లేకపోవడం వల్లనే చికిత్సను ఆలస్యం చేసుకొని, ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇలాంటివాళ్లు ఎంత త్వరగా గుర్తించి, ఎంత త్వరగా చికిత్సకు వెళ్తే... ఈ వ్యాధి అంత త్వరగా తగ్గుతుంది. మనదేశంలో ఏటా దాదాపు 13 లక్షల మంది కొత్త క్యాన్సర్ పేషెంట్లు నమోదవుతున్నారు. అయితే వీళ్లలో దాదాపు సగం మంది కేవలం అపోహలతో సకాలంలో డాక్టర్‌ను కలవకపోవడం వల్లనే తమ వ్యాధిని ముదరబెట్టుకుంటున్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు.
 

మరిన్ని వార్తలు