మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..

20 Nov, 2023 17:02 IST|Sakshi

ఓ స్వలింగ జంట మగ బిడ్డకు జన్మనివ్వడమే ఓ మిరాకిల్‌ అనేకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడపున మోయడం మరింత విశేషం.  ఈఘటన ఐరోపాలో చోటు చేసుకుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తోంది కదా!. ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించి బిడ్డల్ని కనే ప్రయత్నం చేశారనుకున్నా.. ఇద్దరూ గర్భంలో మోయడం ఏంటీ అనే డౌటు వస్తుంది కదా!. గతంలో తొలిసారిగా ఓ స్వలింగ జంట ఇలానే ఒకే బిడ్డను ఇద్దరూ మోసి చరిత్ర సృష్టించారని ఈ స్వలింగ జంట రెండోదని అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటా కథా కమామీషు చూద్దాం!.

స్పెయిన్‌లో మజోర్కాలోని పాల్మాలో ఎస్టీఫానియా(30), అజహారా(27) అనే స్వలింగ జంట అక్టోబర్‌ 30న ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరూ మహిళలే. పిల్లల్ని కనాలని ఆశపడ్డారు. ఇద్దరు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలనుకున్నారు. అందుకోసం ఓ ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళ గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల అనంతరం ఆ పిండాన్ని అజహారా గర్భంలో పెట్టారు.

అలా ఇద్దరూ ఒకే బిడ్డను మోసి మాతృత్వపు అనుభూతిని పొందారు. ఇందుకోసం సుమారు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టి మరీ తమ కలను సాకారం చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరూ కేర్‌ వహిస్తూ తమ అనుబంధం మరింత బలపడింది అనేందుకు చిహ్నంగా ఒకే బిడ్డకు జన్మనిచ్చాం. ఆ ఆలోచన మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ ఆనందంగా చెబుతున్నారు ఇరువురు.

ఈ వైద్య విధానాన్ని ఇన్వోసెల్‌గా పిలిచే సంతానోత్పత్తి చికిత్స అంటారు. ఇలా ఇంతకుమునుపు 2018లో టెక్సాస్‌లో ఓ స్వలింగ జంట(ఇద్దరు  మహిళలు) ఒకే బిడ్డను మోసి.. ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు. సంతానం లేనివాళ్లకే గాక పిల్లల్ని కనడం సాధ్యం కానీ ఇలాంటి స్వలింగ జంటలకు ఈ సరికొత్త వైద్య విధానం ఓ వరం. వైద్యవిధానం సరికొత్త ఆవిష్కరణలతో అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తోందనడానికి ఈ ఘటనే ఓ నిదర్శనం

(చదవండి: కోవిడ్‌ కొత్త వ్యాక్సిన్‌ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి)

మరిన్ని వార్తలు