బోట్స్‌వానా

14 Feb, 2015 23:00 IST|Sakshi
బోట్స్‌వానా

నైసర్గిక స్వరూపం:

వైశాల్యం:    5,81,730 చదరపు కిలోమీటర్లు
జనాభా:    21,55,784 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని:    గబోరోన్
ప్రభుత్వం:    పార్లమెంటరీ రిపబ్లిక్
కరెన్సీ:    పులా
భాషలు:    ఇంగ్లిష్, సేట్స్‌వానా
మతం:    {Mైస్తవులు 15 శాతం మిగిలిన జనాభా స్థానిక  తెగలు
వాతావరణం:    జనవరిలో 18 నుండి 31 డిగ్రీలు, జూన్‌లో 5 నుండి 23 డిగ్రీలు
పంటలు:    మొక్కజొన్న, గోధుమ,
ఖనిజాలు:    నికెల్, రాగి, వజ్రాలు
పరిశ్రమలు:    పశుపోషణ, గనులు, మాంసం, పర్యాటకం
ఎగుమతులు:    వజ్రాలు, మాంసం, నికెల్, రాగి
స్వాతంత్య్రం:    1966 సెప్టెంబర్ 30
సరిహద్దులు:    జాంబియా, అంగోలా, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే
 
చరిత్ర

19వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని డేవిడ్ లివింగ్‌స్టోన్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతవరకు ఆ ప్రాంతం అంతా ఆటవిక తెగల ప్రజల జీవనం బాహ్య ప్రపంచానికి తెలియదు. అతడు ప్రయాణించిన మార్గాన్ని నేడు మిషినరీ రోడ్‌గా పిలుస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని బోట్స్‌వానా అని అక్కడి తెగల వారు పిలుచుకునేవారు. డేవిడ్ బావింగ్ స్టోన్ ఆటవిక తెగలలో స్నేహపూర్వకంగా మెలగి వారికి కొంత నాగరికతను నేర్పాడు. వారి గురించి ప్రపంచానికి పరిచయం చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం తరపున వారికి అతడు రక్షణ కల్పించాడు. ఆటవిక తెగల ప్రజలు అతనిని తమ ఆరాధ్య దైవంగా భావించారు. 1885లో బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో తమ సైన్యాన్ని రక్షణగా ఉంచింది. ఈ ప్రాంతాన్ని వాళ్ళు బెచువానాలాండ్ అని పిలిచారు. ఆ ప్రదేశమే నేడు బోట్స్‌వానాగా పిలవబడుతోంది. ఒకప్పుడు బోయేర్ రాజులు, అలాగే దక్షిణాఫ్రికా పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1966లో స్వాతంత్రం లభించే నాటికి బోట్స్‌వానా ఆంగ్లేయుల అధీనంలో ఉండింది. సర్ సెరెట్సె ఖామా అధ్యక్షతన దేశంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది.

ప్రజలు-సంస్కృతి
 
వీరి ముఖ్యవృత్తి వ్యవసాయం. ఆటవిక తెగల ప్రజలు కాబట్టి వీరి ఆచార వ్యవహారాలు విచిత్రంగా ఉంటాయి. దేశంలో ప్రముఖంగా ఎనిమిది ఆటవిక తెగలు ఉన్నాయి. అవి ఎన్‌గ్యాటో, క్వెనా, ఎన్‌గ్యాకెట్సె, తవానా, కెగట్లా, లెటె, రోలోంగ్, టెలోక్వా. ఈ తెగలలో ఏ కుటుంబంలో ఎక్కువ పశువులు ఉంటాయో ఆ కుటుంబం గొప్పది అని భావిస్తారు. వీరు రోజులో ఎక్కువ భాగం ఆహారం కోసం వేటాడతారు. ముఖ్యంగాకలహరి ఎడారి ప్రాంతంలో ఉండే తెగల వాళ్ళు అడవి జంతువుల వేటలో దినమంతా గడిపేస్తారు.
 ఒకప్పుడు ఒక్కొక్క కుటుంబానికి మూడేసి ఇళ్లు ఉండేవి. ఒకటి గ్రామంలో, మరొకటి వారి పొలంలో, మరొకటి పశువుల మేత కోసం వెళ్ళిన ప్రదేశంలో ఉండేవి. పశువుల మేతకోసం యువకులు ఇళ్లు వదిలి దూరప్రాంతంలోనే ఎక్కువ కాలం గడిపేవాళ్లు. గ్రామానికి గ్రామపెద్ద ఉంటాడు.రైతులు ఎక్కువగా తమ తమ పొలాలలోనే గడుపుతారు.
 
 చూడదగిన ప్రదేశాలు


1. సెంట్రల్ కలహరి గేమ్ రిజర్వ్

 ఇది కలహరి జాతీయ పార్కులో ఒక భాగం. దీనిని 1961లో ఏర్పాటు చేశారు. ఇది 52,800 చ.కి.మీ. వైశాల్యంతో ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గేమ్ రిజర్వు. ఈ పార్కులో జిరాఫీలు, గోధుమవర్ణపు హైనాలు, వార్తాగ్‌లు, చీతాలు, అడవికుక్కలు, పులులు, సింహాలు, అడవి దున్నలు, ఇలాండ్‌లు, జెమ్స్‌బార్, కుడు మొదలైన జంతువులు ఉన్నాయి. ఇక్కడే దాదాపు 16 వేల ఏళ్ల క్రితం ఏర్పడిన లోయ ఉంది. పూర్వం ప్రవహించిన కొన్ని నదులు ఎండిపోయి ప్రస్తుతం వాటి అనవాళ్లు కనబడుతూ ఉంటాయి. నదీతీర ప్రాంతంలో ఎన్నో ఏళ్ల క్రితపు శిలాజాలను మనం దర్శించవచ్చు. అంటసాన్ జాతికి చెందిన అడవి మనుషులు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటారు. వీరి ప్రధానవృత్తి జంతువుల వేట. ఈ ప్రాంతంలో ఎండాకాలంలో 45 డిగ్రీలపైబడి ఉష్ణోగ్రత ఉంటుంది.
 
2. గబోరోన్

దాదాపు 15 కిలోమీటర్ల పొడవున్న ఈ నగరం 1966లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజధానిగా వెలుగొందుతోంది. నగరంలో రెండున్నర లక్ష జనాభా ఉంది. నగరంలో బ్లాకులు, ఎక్స్‌టెన్షన్‌లు, ఫేజులు అని ఉంటాయి. ప్రతి బ్లాకుకు నెంబరు ఉంటుంది. అందరూ ఈ నెంబర్ల ప్రకారమే పిలుస్తారు. నగరం మధ్యలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. నగరాన్ని ఆనుకొని నాట్వేన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. నగరం చాలా బాగా వృద్ధి చెందుతోంది. నగరం చుట్టూ ఎన్నో ఎక్స్‌టెన్షన్‌లు నిర్మింపబడుతున్నాయి. నగరం మధ్యలో అనేక వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. దీనినే మాల్ అంటారు.

గబోరోన్ నగరంలో ఇస్కాన్ అధ్వర్యంలో ప్రసిద్ధ కృష్ణ దేవాలయం నిర్మింపబడింది. దీనితోపాటు శ్రీవెంకటేశ్వర మందిరాన్ని అక్కడి తెలుగు ప్రజలు నిర్మించారు. సిక్కుల గురుద్వారా, ముస్లిముల మసీదులు కూడా అనేకం ఉన్నాయి. జాతీయ మ్యూజియం, నేషనల్ బొటానికల్ గార్డెన్, జాతీయ అసెంబ్లీ, త్రీ డిగోసీ మాన్యుమెంట్ (ఇక్కడ 3వ ఖామా, 1వ సెబెలె, 1వ బతియాన్‌ల విగ్రహాలు ఉన్నాయి. ఖామా అంతర్జాతీయ విమానాశ్రయం, పార్లమెంటు భవనం, నగరాన్ని ఆనుకొని కిగాన్ కొండ, గబోరోన్ డ్యామ్, మోకొలోడి నేచర్ రిజర్వు... ఇలా ఎన్నో చూడదగినవి నగరంలో ఉన్నాయి.

3. చోబే జాతీయ పార్కు

ఈ పార్కు దేశ ఉత్తర ప్రాంతంలో ఉంది. పదకొండు వేల చదరపు కిలోమీటర్ల్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు నాలుగు భాగాలుగా విభజింపబడి ఉంది. అవి సెరోండేలా ఏరియా, సావుటి మార్ష్‌రియా, లిన్యాంటి మార్ష్, హింటర్‌లాండ్‌లు. సెరోండేలా ప్రాంతంలో చోబే నది ప్రవహిస్తోంది. ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏనుగులు, జిరాఫీలు, అడవి దున్నలు, ఆంటిలోప్‌లతోపాటు అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే కసానే నగరం, దానిని ఆనుకొని విక్టోరియా జలపాతం ఉన్నాయి.
 సావుటి మార్ష్ ఏరియా అంతా సవన్నాల గడ్డి మైదానాలు పరుచుకుని ఉంటాయి. పర్యాటకులు ఈ ప్రాంతంలో సఫారికి వస్తుంటారు. ఈ ప్రాంతం నుండి జీబ్రాలు, వలసవెళుతూ వస్తూ ఉంటాయి.

 లిన్యాంటి మార్ష్ లిన్యాంటి నదీతీరంలో ఉంది. ఈ ప్రాంతంలో సరస్సులు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొసళ్ళు, ఏనుగులు అధికంగా నివాసం ఉంటాయి. హింటర్‌లాండ్ అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఈ ప్రాంతంలో ఇలాండ్ అనే జంతువులు అధికంగా ఉంటాయి.
 
4. కెకలగాడి ట్రాన్స్‌ఫ్రాంటియర్ పార్కు

దేశ దక్షిణ భాగంలో ఉన్న ఈ పార్కు 38వేల చదరపు కిలోమీటర్లు వైశాల్యంతో ఉంది. ఇది కలహరి ఎడారిని ఆనుకొని ఉంది. నసాబ్, అవూబ్ అనే రెండు నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. ఈ నదులు శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే ప్రవహిస్తాయి. అయితే భూగర్భజలం పుష్కలంగా ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకమైన చెట్లు పెరుగుతాయి. ఈ పార్కులో పులులు, సింహాలు, ఏనుగులతో పాటు అనేక అడవి జంతువులు ఆవాసం ఉంటాయి. గద్దలు, ఇక్కడ అధిక సంఖ్యలో కనబడతాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -11 డిగ్రీలకు పడిపోతాయి. ఈ పార్కులో కొంత భూభాగాన్ని అక్కడ నివసించే సాన్ ఆటవిక తెగల ప్రజలకు వదిలేశారు. ఇది యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ ఎడారిగా ఉన్న ప్రాంతంలో భూభాగం ఎర్రగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇసుక తుఫానులు వస్తుంటాయి.
 
5. కలహరి ఎడారి

కలహరి ఎడారి దాదాపు 9 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ  ఎడారి బోట్స్‌వానా, నమీబియా దక్షిణ ఆఫ్రికా దేశాలలో విస్తరించి ఉంది. ఈ  ఎడారి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 100 నుండి 110  మిల్లీ మీటర్ల వర్షపాతం కురవడం వల్ల ఎడారిలో అనేక రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వీటికోసం ఎన్నో జంతువులు ఇక్కడికి వస్తాయి. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు, అడవి దున్నలు అధికంగా ఉన్నాయి. ఎడారిలో తుమ్మ చెట్లు అధికం మన పుచ్చకాయల లాంటి పళ్ళను ఇచ్చే మొక్కలు ఈ ఇసుక నేలలో బాగా పండుతాయి. పొడవాటి ముళ్ళు కలిగిన పొదల మాదిరిగా పెరిగే మొక్కలు ఎడారి అంతా పరుచుకొని ఉంటాయి. ఈ ఎడారిలో ఆరు నెలలు అతి వేడిగా ఉంటే మిగిలిన ఆరునెలలు చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పూర్వం మకగాడిక్‌గాడి అనే సరస్సు ఉండేదట. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఎండిపోయి కనబడుతుంది.

ఈ ప్రాంతంలో సాన్ తెగకు చెంది ఆటవిక తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు నీళ్ళ కోసం మొక్కల వేళ్ళను తవ్వితీసి, బాగా పిండి నీటి చుక్కలను సేకరిస్తారు. విండోయెక్ అనే పట్టణం కూడా కలహరి బేసిన్ ప్రాంతంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు బాగా వస్తారు.    
 
5. బోట్స్‌వానా వజ్రాల గనులు


బోట్స్‌వానా దేశంలో మొత్తం నాలుగు వజ్రాలు గనులు ఉన్నాయి. 1.డమ్‌ట్ షా, 2. జ్వనెంగ్, 3. లెథకానే, 4. ఓరపా గనులు. డమ్‌ట్‌షా వజ్రాల గని ఫ్రాన్సిన్  టౌన్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. జ్వనెంగ్ వజ్రాల గని రాజధాని గబోరోన్ నుండి 120  కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిబీర్స్ వజ్రాల వ్యాపార సంస్థ అధిపత్యంలో ఈ గనిలో వజ్రాల ఉత్పత్తి జరుగుతుంది. వెధకానే వజ్రాలగని ఫ్రాన్సిస్‌టౌన్‌కు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గని 1975 లో ప్రారంభమైంది. ఈ గనినుండి ప్రతిసంవత్సరం మూడున్నర మిలియన్ కారట్‌ల వజ్రాలు ఉత్పన్నం అవుతాయి. ఈ గని నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఓప్రా వజ్రాల గని ఉంది. ఈ గని నుండి ప్రతి ఏటా 11 మిలియన్‌ల కారట్‌ల వజ్రాలు ఉత్పత్తి అవుతున్నాయి.

మరిన్ని వార్తలు