జీవితమంతా రంధ్రాన్వేషణమే!

2 Oct, 2016 00:22 IST|Sakshi
జీవితమంతా రంధ్రాన్వేషణమే!

నరుడి శరీరానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఈశ్వరుడు తనకి ఏ విభూతినిచ్చాడో దాన్ని మాత్రమే కాక, ప్రపంచం మొత్తం మీద ఏ ప్రాణిలో ఏ గొప్ప విభూతి ఉన్నా దానిని తనదిగా వాడుకోగలిగిన శక్తి ఒక్క నరుడికే ఉంటుంది. మరే ఇతర ప్రాణికీ ఉండదు. వేగంగా పరిగెత్తగల, పర్వతాలు ఎక్కగల గుర్రాన్ని మచ్చిక చేసుకుని తాను కూడా అదేవేగంతో  వెళ్లగలడు, పర్వతాలు సునాయాసంగా ఎక్కగలడు. నీళ్ళలో ఈదగలిగిన చేపను చూసి తానూ నేర్చుకోవడమేగాక, ఓడలు చేసుకుని సముద్రాలు దాటి వెళ్ళగలడు.

ఎగరగలిగిన శక్తిని ఆ పరమేశ్వరుడు ఒక్క పక్షికే ఇచ్చాడు. దాని గమనాన్ని ఆకళింపుచేసుకున్న మనుష్యుడు విమానాలు ఎక్కి ఎగురుకుంటూ వెళ్ళగలుగుతున్నాడు. మొక్కలోని ఓషధీ శక్తిని తీసుకుని తన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి వినియోగించుకుంటున్నాడు. ఈశ్వరుని సృష్టిలోని సమస్త ప్రాణుల ైవభవాన్ని తన అభ్యున్నతికి వాడుకోగల శక్తి ఒక్క నరుడికే ఉంది. ఆ బుద్ధి ఒక విస్ఫోటనా శక్తి.

ఆ శక్తిని మనుష్యునిలో ఉంచిన పరమేశ్వరుడు దానికి తోడుగా ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు. వీటితో మనుష్యజన్మకున్న పరమ ప్రమాదకరమైన లక్షణం కానీ, తననితాను ఉద్ధరించుకోగలిగిన శక్తికానీ నిలబడతాయి. అపారమైన తెలివితేటలకు పక్కన ఐదు ఇంద్రియాలను అనుభవించడానికి కొన్ని కోట్ల భోగాలను కూడా పెట్టాడు.  ప్రధానంగా శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములని ఐదు భోగములను మనుష్యుడు అనుభవిస్తాడు.

శబ్దమంటే చెవితో వినడం. చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి. ఓ వీణానాదం, ఓ ఉపన్యాసం, పక్షుల కలకూజితాలు... తెల్లవారిలేస్తే ఎన్నో శబ్దాలు విని పరవశించ గల శక్తి మనుష్యునికి ఉంది. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. వాటికి చెవి ఉపయోగం ఎంతవరకు అంటే... కొన్ని కొన్ని శబ్దాల చేత అవి ప్రీతి పొందుతాయి. ఇవి మనకు హాని చేయవన్న నమ్మకం పొందుతాయి. మరికొన్ని శబ్దాలను ప్రమాదకరమని గుర్తిస్తాయి. అంతవరకే వాటి ప్రయోజనం. అంతకుమించి దానికి మరే ఉపయోగం ఉండదు. మిగిలిన ప్రాణులు పొందలేని ఇటువంటి సుఖాలు మనుష్యుడు పొందుతున్నాడు. అన్నిటికంటే పెద్ద సుఖం ఏమిటంటే... ఈ చెవులగుండా విని కొన్ని కోట్ల జన్మలనుండి తరుముకొస్తున్న వాసనా బలాన్ని వదలిపెట్టేస్తాడు. ఇది మనుష్యజన్మకున్న ప్రత్యేకమైన గొప్పతనం.

వాసనాబలం అని ఒకటుంటుంది. అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళి పోతున్నప్పుడు ఇక్కడ అన్నీ చక్కబెట్టుకుని వెళ్ళిపోతాడు. మృత్యుకాలం ఆసన్నమయిందను కోండి. సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఐదు జ్ఞానేంద్రియాల శక్తులను తీసి మూటకట్టుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవినుంచి వినికిడి శక్తిని, నాలుకకు రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శశక్తిని, ముక్కుకి ఉన్న వాసనా శక్తిని తీసి మూటకడుతుంది.

ఇప్పుడు ఎటునుంచి బయటికి వెళ్ళాలా అన్ని ప్రయత్నిస్తుంది.దానికి ఒక తీర్పు ఏర్పాటు చేసాడు పరమేశ్వరుడు. జీవించి ఉన్నంతకాలం తొమ్మిది రంధ్రాలు పనిచేయాలి. పుట్టేవరకు ఒక రంధ్రం, వెళ్ళిపోయేటప్పుడు మరొక రంధ్రం పనిచేయాలి. పదకొండు రంధ్రాల మీద ఉంటుంది. మనకు తత్త్వంలో ఒకమాట అంటుంటారు.’వాడికి రంధ్రాన్వేషణ’ అలవాటురా !’ అని. అసలు జీవితంలో వేదాంత తత్త్వమంతా ఆ ఒక్కమాటలోనే ఉంది. వాస్తవంగా కూడా వాడి జీవితమంతా రంధ్రాన్వేషణమే.

అమ్మకడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కుంటాడు. బయటికి వచ్చాక పసితనంలో ఎక్కడ ఉన్నాడో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తాడు. కొంచెం పెద్దయిన తర్వాత సైగలతో చెప్తే అమ్మ వాడిని మరుగుదొడ్డికి తీసుకుని వెళ్ళి వస్త్రం విప్పేయగానే విసర్జన ఎక్కడెక్కడినుంచి అవుతున్నదో తెలుసుకుంటాడు. ఆ తరువాత వాటిని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి ప్రవృత్తి. ఆ తరువాత ఉద్యోగంలో డబ్బు ఎందుకిస్తారంటే రంధ్రాన్వేషణకే. తప్పులు వెతికి పట్టుకున్నందుకే. ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన చేయాలి కదా.. అంటే రంధ్రం వేయాలి. చిట్టచివరివరకు ఎవరియందు రంధ్రాన్వేషణమనే బుద్ధి నిలబడుతుందో వాడు తరించి పోయాడని గుర్తు.

రెండుకళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు, నోరు, మలమూత్ర ద్వారాలు. ఈ తొమ్మిది రంధ్రాల్లోంచి శరీరంలోనుంచి ఎప్పుడు ఏది ఎక్కడ బయటికి వెళ్ళాలో, బయటినుంచి ఏది లోపలకు వెళ్ళాలో ఈ జీవుడు వాటిని చక్కగా వినియోగించుకుని, 10 రకాల వాయువులను- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, క్రికర, కూర్మ, ధనంజయ, దేవదత్తములనే వాటిని లోపల కుంభించగల శక్తితో ఉంటే... వాడు ఉన్నాడని గుర్తు.

ఒకసారి పీలిస్తే అది పది వాయువులవుతుందని శాస్త్రం చెపుతుంది. అవి లోపల ఈ తోలుతిత్తిలో నిలబడాలి. ఈ తిత్తికి తొమ్మిది కన్నాలు. ఇవి చిట్టచివర మూటగట్టుకుని ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళాలా... అని రంధ్రాన్వేషణ చేసే సమయంలోనే... అక్కడ మనుష్య జన్మను ఎవడు ఎలా వాడుకున్నాడన్న విషయాన్ని పరమేశ్వరుడు పరీక్షగా చూస్తాడు.

ఈశ్వరుడు ఎప్పుడూ మనిషి పునర్జన్మలో వేలు పెట్టడు. మనిషి తన కర్మలచేత తానే తన పునర్జన్మను నిర్ణయించుకుంటాడు. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. వాడు శాస్త్రాన్ని, గురువుగారి పాదాలను, భగవంతుని బాగా పట్టుకున్నవాడయితే వాడు ఊర్ధ్వలోక చలనం చేస్తాడు. మాడు దగ్గర బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. దానిని మూతవేసి ఉంచుతాడు పరమేశ్వరుడు.

అలా ఆ సమయానికి శరీరంలోని వాయువులను పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రాన్ని బద్దలు కొట్టుకుని ఎవరు అక్కడినుంచి నిర్గమిస్తారో వారు మళ్ళీ ఇక ఈ శరీరంలోకి రారు. వివేకానందుడి వంటి మహాత్ములు వారి నిష్ర్కమణ ముహూర్తాన్ని వారే పెట్టుకున్నారు. అలా వెళ్లలేని వాడు... దొంగదారుల్లో వెడతాడు. అంటే అధోముఖంగా వెడతాడని గుర్తు.     

మరిన్ని వార్తలు