కొవ్వు కరిగించాలా... 

24 Nov, 2017 11:09 IST|Sakshi

ఊబకాయంతో పాటు మధుమేహానికి కూడా దాల్చిన చెక్క విరుగుడుగా పని చేస్తుందని యూనివర్శిటీ ఆఫ్‌ మిషిగన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దాల్చిన చెక్కలోని సినమాల్డీహైడ్‌ అనే పదార్థం రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గిస్తుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కారణాలేమిటన్నది మాత్రం జున్‌ వూ నేతత్వంలోని శాస్త్రవేత్తల బందం నిర్ధారించింది. ఈ పదార్థం జీవక్రియలపై ప్రభావం చూపడం ద్వారా సినిమాల్డీహైడ్‌ ఊబకాయం, మధుమేహాలపై పనిచేస్తుందని జున్‌ తెలిపారు. వేర్వేరు వర్గాలు, వయసు, బాడీమాస్‌ ఇండెక్స్‌ ఉన్న వ్యక్తుల అడిపోసైట్స్‌ (కొవ్వులను నిల్వ చేసుకునే కణాలు) లపై తాము పరిశోధనలు జరిపామని సినిమాల్డీహైడ్‌ను ప్రయోగించినప్పుడు ఈకణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైమ్‌లు ఎక్కువగా పనిచేయడం మొదలైందని.. ఇవన్నీ శరీరంలోని లిపిడ్స్‌ను తగ్గించేవని తాము గుర్తించామని జున్‌ తెలిపారు. 

మన పూర్వీకులకు కొవ్వు పదార్థాలు పెద్దగా అందుబాటులో ఉండేవి కాదని.. ఆ పరిస్థితుల్లో అత్యవసర సమయాల్లో శరీరానికి కావల్సిన శక్తిని అందించేందుకు అడిపోసైట్స్‌ కొవ్వులను నిల్వ చేసుకునేవని.. పరిణామ క్రమంలో శరీరంలోకి చేరుతున్న అధిక కొవ్వులను ఇవి నిల్వ చేసుకుంటున్నాయని జున్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకాయం సమస్య పరిష్కారానికి శరీరంలోని కణాలు స్వయంగా కొవ్వులను కరిగించేలా చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో జున్‌కు దాల్చిన చెక్క మంచి లక్షణాల గురించి తెలిసింది. దాల్చిన చెక్కను ఇప్పటికే అనేక రకాల ఆహారాల్లో వాడుతున్న నేపథ్యంలో మధుమేహులు, ఊబకాయులు ఈ ఆహారం ద్వారానే తమ సమస్యలను తగ్గించుకునే అవకాశముందని చెప్పారు.   

మరిన్ని వార్తలు