సహకార స్వర్ణయుగం రానుందా?!

15 Nov, 2023 10:17 IST|Sakshi

ఉమ్మడి ఆర్థిక, సాంఘిక, సంస్కృతిక అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది తమ సమష్టి యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామికంగా తామే నిర్వహించుకునే వ్యాపార, సేవా సంస్థలే సహకార సంఘాలు. వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా చేసే వ్యాపారానికి భిన్నమైనది సహకార వ్యవస్థ. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి సంస్థల కేంద్రీకృత ఆధిపత్య లాభార్జన ధోరణికి భిన్నంగా సమష్టి ప్రయోజనాల కోసం నానాటికీ విస్తరిస్తున్న ఈ వికేంద్రీకృత వ్యవస్థకు స్వయంపాలన, స్వావలంబనలే మూలస్తంభాలు. కరోనా మహమ్మారి నేర్పిన కొన్ని గుణపాఠాల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకార వ్యవస్థను మరింత విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది.(ఈ నెల 14 నుంచి 20 వరకు జరుగుతున్న 70వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా..)

ఐక్యరాజ్యసమితి కూడా సహకార సంఘాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ.. 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకోవాలని ఇటీవలే తీర్మానం చేసింది. పుష్కర కాలం ముందు 2012లో కూడా అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని జరుపుకోవటం విశేషం. స్కాట్లండ్‌లోని ఫెన్‌విక్‌లో కీ.శ. 1761 మార్చి 14న ఏర్పాటైన ఫెన్‌విక్‌ చేనేత కార్మికుల సహకార సంఘమే తొట్టతొలి కోఆపరేటివ్‌ సొసైటీ. ప్రపంచంలో కనీసం 12% మంది ప్రజలు సహకారులే. సుమారు 30 లక్షల సహకార సంఘాలు ప్రపంచ దేశాల్లో లాభం కోసం కాకుండా విలువల కోసం పనిచేస్తున్నాయి. భారతీయ సహకారోద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద సహకార వ్యవస్థ. దేశం వలస పాలనలో మగ్గిపోతున్న కాలంలో సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా పనిచేసిన సర్‌ ఫ్రెడరిక్‌ నికల్సన్‌ మన దేశంలో సహకార వ్యవస్థకు బీజం వేశారు.

మొట్టమొదటి సహకార సంఘం 1904లో ప్రస్తుతం తమిళనాడులో తిరువళ్లూరు జిల్లాలోని తిరుర్‌ అనే గ్రామంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలోని 8,54,355 సహకార సంఘాల్లో సుమారు 30 కోట్ల మంది సభ్యులున్నారు. మరో 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి చురుగ్గా చర్యలు చేపట్టింది. మన దేశంలో వ్యవసాయ రుణాలిచ్చే సొసైటీల సంఖ్యే ఎక్కువ. కింది స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలతో మొదలుకొని చాలా రాష్ట్రాల్లో మూడంచెల సహకార వ్యవస్థ అమల్లో ఉంది.

జిల్లా, రాష్ట్రస్థాయి సొసైటీల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అనేక రాష్ట్రాల్లో వ్యాపార లావాదేవీలు, సేవలు అందించే సొసైటీల(మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలు) రిజిస్ట్రేషన్‌ కేంద్ర సహకార రిజిస్ట్రార్‌ పరిధిలోకి వస్తుంది. రెండేళ్ల క్రితం హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు కావటంతో ఈ రంగంలో సరికొత్త కదలిక చోటుచేసుకుంది. జాతీయ సహకార విధానం రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్వం నుంచి ఉన్న వ్యవసాయం, హౌసింగ్, ఉద్యోగుల సహకార సంఘాలు వంటి సంప్రదాయ రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ముఖ్యంగా యువతను భాగస్వాముల్ని చేసే విధంగా అనేక సేవా రంగాల్లో సొసైటీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెంపొందించగల శక్తి సహకార రంగానికి ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ లక్ష్యాలతో మూడు వేర్వేరు మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌లను కేంద్రం ఇటీవలే నెలకొల్పింది. మొదటిది మన ఉత్పత్తులను విదేశాలకు భారీస్థాయిలో ఎగుమతులను చేపట్టే లక్ష్యంతో ఏర్పాటైంది. సొసైటీల ద్వారా సర్టిఫైడ్‌/దేశీ విత్తనోత్పత్తి చేయటంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయటమే లక్ష్యంగా రెండో సొసైటీ ఏర్పాటైంది. ఇక మూడోది మరింత ముఖ్యమైనది.

వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం చేసే రైతుల సొసైటీలు, ఎఫ్‌పిఓల నుంచి సేకరించి భారత్‌ ఆర్గానిక్స్‌ బ్రాండ్‌ పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా, అవుట్‌లెట్ల ద్వారా దేశ విదేశాల్లో విక్రయించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. భారీ వాణిజ్య లక్ష్యాలతో పనిచేసే ఈ సొసైటీలకు వచ్చే లాభాల్లో సగాన్ని నేరుగా రైతులు, ఇతర ఉత్పత్తిదారులకు అందించబోతున్నారు. అనుకున్నట్లు యువతను సహకార వ్యాపార, సేవా రంగాల వైపు సమర్థవంతంగా ఆకర్షించగలిగితే భారతీయ సహకార రంగానికి స్వర్ణయుగం తధ్యమని చెప్పొచ్చు. 
– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు

(చదవండి: పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!)

మరిన్ని వార్తలు