భగత్‌ హల్వా (1795 నుండి)

2 Mar, 2019 00:26 IST|Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

భగత్‌ హల్వా తాజ్‌మహల్‌ అంత పురాతనమైనది కాకపోవచ్చును కాని, ఇంచుమించు అంత పురాతనమైనదే. బెలాంగంజ్‌ ప్రాంతానికి చెందిన లేఖ్‌రాజ్‌ భగత్‌ సుమారు రెండు శతాబ్దాల క్రితం హల్వాను అమ్మడం ప్రారంభించారు. మట్టితో అలికిన నేల మీద కూర్చుని రెస్టారెంట్‌ భోజనం చేసే రోజులు అవి. చెక్క స్పూనుతో, మట్టి పాత్రలలో మాత్రమే ఆ రోజుల్లో ఆహారం తీసుకునేవారు. దక్షిణ భారతీయులు, చైనీయులు ఇక్కడకు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. లడ్డు, బర్ఫీల స్థానంలో స్టేపుల్‌ ఫుడ్‌ అంటే పూరీ కూర, కేక్స్‌ పేస్ట్రీలు వంటివి పరిచయం చేశారు. అన్నిటికీ దీటుగా నిలబడింది ఇది.భగత్‌ హల్వాయి కుటుంబం లో తొమ్మిదో తరానికి చెందినవారు రాజ్‌కుమార్‌ భగత్‌. మొఘలుల కాలం నుంచి వీరి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయట. బొగ్గులు, కట్టె పుల్లల వంటి వాటిని వంటకు ఉపయోగించే వారు కాదు. కేవలం ఆవు పిడకల మీద మాత్రమే వంట  చేసేవారు. మొదట్లో పూరీ కూర తయారుచేసేవారు. బేడాయ్‌ (స్టఫ్‌డ్‌ పూరీ), రబ్రీ, జిలేబీ, బర్ఫీ వంటి మిఠాయిలు తయారుచేసేవారు. కాలక్రమేణా వీరు తమ వ్యాపారాన్ని విస్తరించారు. నగరంలో చాలా షాపులు ప్రారంభించారు. స్వీట్స్‌ నుంచి కేకుల వరకు, బ్రెడ్‌ నుంచి బటర్‌ వరకు, చాట్‌ నుంచి ఫాస్ట్‌ ఫుడ్‌ వరకు, అన్ని రకాల సంప్రదాయ మిఠాయిలు సైతం వీరు తయారుచేస్తున్నారు. 

కోకోనట్‌ వాటర్‌ రిఫ్రెషనర్‌
కావలసినవి: కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర లీటర్లు; పుదీనా ఆకులు – అర కప్పు; నిమ్మ తొనలు – 4 (చిన్న చిన్న ముక్కలు); నిమ్మ రసం – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన పుచ్చకాయ ముక్కలు – అర కప్పు; ఐస్‌ క్యూబ్స్‌ – కొద్దిగా.
తయారీ: ∙ఒక పాత్రలో ఒక టీ స్పూను నిమ్మ రసం, కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా కలిపి మిక్సీ జార్‌లో వేసుకోవాలి ∙నిమ్మ తొనలు, పుచ్చకాయ ముక్కలు జత చేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ∙గ్లాసులోకి తీసుకోవాలి ∙కొబ్బరి నీళ్లు, ఐస్‌ క్యూబ్స్‌ జత చేసి బాగా కలిపి, చల్లగా అందించాలి.

ట్రాపికల్‌ కోకోనట్‌ సంగారియా
కావలసినవి: పైనాపిల్‌ తరుగు – ఒక కప్పు; పచ్చి మామిడికాయ తురుము – ఒక కప్పు; కమలాపండు తొనలు – ఒక కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర కప్పులు

తయారీ: ∙ఒక పెద్దపాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి ∙సుమారు రెండు గంటలపాటు మూత పెట్టి ఉంచేయాలి ∙కొద్దిగా ఐస్‌ వేసి చల్లగా అందించాలి.

వాహ్‌ లస్సీవాలా! వాహ్‌!!!జైపూర్‌ లస్సీవాలా (1944 నుంచి)
జైపూర్‌ లస్సీవాలా గురించి ఎవరికి తెలియదు కనుక మళ్లీ వాళ్ల గురించి చెప్పడానికి. తరతరాలుగా అందరూ అక్కడి లస్సీ తాగినవారే. జైపూర్‌ వెళితే లస్సీని రుచి చూడకుండా వెనక్కు రారు. ఎం.ఐ. రోడ్‌లో ఈ లస్సీవాలా సుమారు ఏడు దశాబ్దాలుగా లస్సీ అమ్ముతున్నారు. 1944లో కిషన్‌లాల్‌ అగర్వాల్‌ ‘లస్సీవాలా’ ప్రారంభించారు. జైపూర్‌లో ఇటువంటి షాపు ఇదే మొదటిది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా తియ్యగా, ఉప్పగా రెండు ఫ్లేవర్స్‌లోను లస్సీ దొరుకుతుంది. ఇప్పుడు సుగర్‌ ఫ్రీ లస్సీ కూడా అందిస్తున్నారు. ఈ లస్సీని రుచి చూడని సెలబ్రిటీలు లేరు. ప్రముఖ బాలీవుడ్‌ తారలంతా ఈ లస్సీని రుచి చూసినవారే. ఈ లస్సీవాలాను దర్శించి, లస్సీ రుచిని తలచుకుంటూ నాలుక తడుపుకుంటుంటారు. అమితాబ్, ముఖేష్‌ అంబానీ, శిల్పాశెట్టి, డింపుల్‌ కపాడియా, శోభాడే వంటి వారంతా ఈ లస్సీని ఆస్వాదించినవారే. మిగిలిన షాపులు రాత్రివరకు తెరిచి ఉంటాయి.

లస్సీవాలాలు మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు మాత్రమే తెరచి ఉంటాయి. ఇందుకు కారణం ఏమిటని ప్రశ్నిస్తే, లస్సీవాలా అధినేత ఘనశ్యామ్‌ అగర్‌వాల్‌ ఇందుకు మంచి సమాధానం చెబుతారు, ‘సాయంత్రానికి పెరుగు పులిసిపోతుంది. అంతేకాదు ఆ తరవాత ఇంక మా దగ్గర పెరుగు కూడా మిగలదు’ అంటారు. కుల్లాడ్‌ (మట్టి పాత్ర)  200 మి.లీ., 400 మి.లీ. పరిమాణంలో రెండు సైజులలో లస్సీ దొరుకుతుంది. ఇందులో పెరుగు, ఐస్, మంచి నీళ్లు పోస్తారు. మండుటెండలో చల్లటి లస్సీ కోసం నిలబడలేమనుకుంటే, ప్యాకింగ్‌ కూడా తెప్పించుకోవచ్చు. బటర్‌ పేపర్‌తో కవర్‌ చేసి, దారంతో బిగించి ఇంటి గుమ్మం దగ్గరకు చేరుతుంది ఈ కుల్లాడ్‌. భారతీయులే కాకుండా, ప్రతిరోజు కనీసం వంద మంది విదేశీయులు సైతం కుల్లాడ్‌ లస్సీని రుచి చూస్తారు. జైపూర్‌ వెళితే లస్సీ తాగడం మరచిపోకండేం!!! 

మరిన్ని వార్తలు