మొక్కవోయి జొన్న

21 Oct, 2017 04:10 IST|Sakshi

మొక్కజొన్న... కాల్చుకు తిన్నా కాదనదు. వేపుకు తిన్నా వద్దనదు. వండుకు తిన్నా ఒదిగిపోతుంది. పెనం మీద అట్టవుతుంది. నూనెలో గారెవుతుంది. అందుకే... తినే ముందుగా...మొక్కజొన్నకు ఓ మొక్కు మొక్కుదాం.

  క్రిస్పీ కార్న్‌
కావలసినవి :  మొక్కజొన్న గింజలు – ఒకటిన్నర కప్పు; కార్న్‌ ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్స్, మైదా – 2 టేబుల్‌ స్పూన్స్‌; వరిపిండి – 2 టేబుల్‌ స్పూన్స్‌; ఉప్పు – రుచికి సరిపడ; నల్లమిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉల్లిపాయలు – పావు కప్పు; తరిగిన కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్స్‌; నూనె – వేయించడానికి సరిపడ.

తయారీ
♦ ఒక గిన్నెలోకి మొక్కజొన్న గింజలు, కార్న్‌ఫ్లోర్, మైదా, వరిపిండి, ఉప్పు, మిరియాల పొడి,
1 స్పూన్‌ నీళ్లు పోసి బాగా కలపాలి.
♦ స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగిన తర్వాత, స్టౌ సిమ్‌లో పెట్టి, ముందుగా కలిపి పెట్టిన మొన్న జొన్న మిశ్రమాన్ని వేసి బాణలిపై మూతపెట్టాలి.
♦ 15 సెకన్లు ఆగి మూత తీసి వేగిన కార్న్‌ను నూనె లేకుండా లేకుండా తీసుకోవాలి.
♦ వేడిగా ఉండగానే కొత్తిమీరతో అలంకరించి వెంటనే సర్వ్‌ చేయాలి (లేదంటే కార్న్‌ మెత్తబడతాయి).


 గ్రిల్డ్‌ కార్న్‌
కావలసినవి: తాజా మొక్కజొన్న కండెలు – 4; వెన్న – 4 టేబుల్‌ స్పూన్స్‌; మిరియాల పొడి – 1 టీ స్పూన్, చిల్లీ సాస్‌ – 1 టీ స్పూన్, నిమ్మకాయలు – 2, చీజ్‌ – సరిపడ.

తయారీ:
♦ ముందుగా మొక్క జొన్న కండెలను తీసుకుని 3 లేదా 4 పొరలు ఉంచి మిగిలినవి తీసివేసి 15 నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టాలి ∙ఒక గిన్నెలో వెన్న, మిరియాల పొడి, చిల్లీ సాస్‌ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి
♦ మొక్కజొన్న పొరలను వెనక్కి మడిచి, గ్రిల్‌ను బాగా వేడయ్యాక అన్ని వైపులా బాగా కాలేలా చూసుకోవాలి (గ్రిల్‌ లేకపోతే స్టౌ వెలిగించి మీడియమ్‌ మంటపై అన్నివైపులా కాల్చుకోవచ్చు)
♦ కాలిన మొక్కజొన్న కండెలకు ముందుగా తయారు చేసుకున్న వెన్న మిశ్రమాన్ని బ్రష్‌తో అన్నివైపులా రాసి మళ్లీ 2 నిమిషాలు గ్రిల్‌పై కాల్చుకోవాలి
♦ గ్రిల్‌ చేసిన మొక్కజొన్న కండెలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని కొంచెం వెన్న రాసి, తరిగిన కొత్తిమీర, తురిమిన చీజ్‌ చల్లి, నిమ్మ చెక్కలతో సర్వ్‌ చేయాలి
♦ (మొక్కజొన్న కండెలను 2 అంగుళాల సైజులో కట్‌ చేసుకుని టూత్‌ పిక్‌తో గుచ్చి సర్వ్‌ చేయొచ్చు).


 మొక్కజొన్న అట్లు
కావలసినవి: మొక్కజొన్న గింజలు – 1 కప్పు, నానపెట్టిన పెసరపప్పు – పావు కప్పు; వరిపిండి – పావు కప్పు; బొంబాయిరవ్వ – అరకప్పు; ఇంగువ – చిటికెడు; అల్లం – అర అంగుళం ముక్క, కరివేపాకు – 1 రెమ్మ; ఉప్పు – రుచికి సరిపడ; తరిగిన ఉల్లిపాయముక్కలు – పావు కప్పు, కొత్తిమీర తరుగు – కొంచెం; నూనె – సరిపడ.

తయారీ:
♦ మొక్కజొన్న గింజలు, నానబెట్టిన పెసరపప్పు, అల్లం, కరివేపాకు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మిక్సీజార్‌లో వేసి మెత్తని పిండిలా పట్టుకోవాలి
♦ ఒక గిన్నెలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని, బొంబాయి రవ్వ, వరిపిండి, ఇంగువ వేసి బాగా కలిపి గంట సేపు నాననివ్వాలి ∙స్టౌ పైన పెనం పెట్టి ఈ పిండిని దోశెలాగ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి, చుట్టూ నూనె వేసి బాగా కాలనివ్వాలి
♦ రుచికరమైన మొక్కజొన్న దోశె రెడీ. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి దేనితో తిన్నా బాగుంటుంది.


 మొక్కజొన్న మష్రూమ్‌ కర్రీ
కావలసినవి: మొక్కజొన్న గింజలు – కప్పు; సన్నగా తరిగిన మష్రూమ్స్‌ –  కప్పు; తరిగిన ఉల్లిపాయలు – 2 కప్పులు, తరిగిన టమోట – 2 కప్పులు; తరిగిన కాప్సికమ్‌ – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు, నూనె– 5 టేబుల్‌ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడ; కారం – 2 టీ స్పూన్స్‌; పసుపు – అర స్పూన్‌; జీలకర్ర – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్, లవంగాలు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; యాలక్కాయ– 1; ధనియాల పొడి – టీ స్పూన్‌; గరం మసాలా – 2 టీ స్పూన్స్‌.

తయారీ:
♦ బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ వేయించుకోవాలి ∙అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి వేసి మరికాసేపు వేయించుకోవాలి
♦ టమోటా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత కాప్సికమ్‌ వేసి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి
♦ ఇప్పుడు మొక్కజొన్న గింజలు, మష్రూమ్స్‌ వేసి 2 నిమిషాలు వేయించాక కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి మీడియమ్‌ మంటపైన ఉడికనివ్వాలి ∙చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వేడివేడిగా వడ్డించాలి
♦ అన్నంలోకి, చపాతీకి కూడా బాగుంటుంది.


 మొక్కజొన్న పాకం గారెలు
కావలసినవి: మొక్కజొన్న గింజలు – 2 కప్పులు; వరిపిండి – 1 కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; తరిగిన బెల్లం – 1 కప్పు, యాలకులు – 3; వంట సోడా – చిటికెడు; నూనె – వేయించడానికి సరిపడ

తయారీ: 
♦  మొక్కజొన్న గింజలను జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసుకోవాలి
♦ ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని వరిపిండి, బొంబాయిరవ్వ, వంట సోడా వేసి బాగా కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి ∙స్టౌ పైన మందపాటి గిన్నెలో తరిగిన బెల్లం, కొంచె నీళ్లు పోసి పాకం వచ్చేవరకు తిప్పుతూ ఉండాలి. చివరగా యాలకుల పొడి వేసి మూతపెట్టుకోవాలి
♦ బాణలిలో నూనెపోసి కాగనివ్వాలి
♦ అరచేతిలో నూనె రాసుకుని నిమ్మకాయ సైజులో జొన్నపిండి ముద్దను తీసుకుని గారెలుగా వత్తుకుని, మధ్యలో చిల్లుపెట్టి కాగిన నూనెలో వేసి బంగారం రంగు వచ్చేలా రెండువైపులా వేయించుకోవాలి  వేయించుకున్న గారెలుగా వెంటనే బెల్లం పాకంలో వేసి 5 నిమిషాల సేపు నానిన తర్వాత సర్వ్‌ చేయాలి.

మరిన్ని వార్తలు