మహా వ్యక్తిత్వం

3 Dec, 2017 00:58 IST|Sakshi

చెడుకు చెడు సమాధానం కాదు, కాకూడదు. మీరు చెడును మంచి ద్వారా నిర్మూలించండి. అన్న పవిత్ర ఖురాన్‌ బోధనకు దైవప్రవక్త ముహమ్మద్‌ ప్రవక్త(స)వారి జీవన విధానం అద్దం పట్టేది. ఒకసారి ముహమ్మద్‌ (స)ఇంటినుండి బయలుదేరి ఎటో  వెళుతున్నారు. కొద్దిదూరం వెళ్ళిన తరువాత ఒక ఇంటిదగ్గర గోడపైనుండి ఊడ్చిన చెత్తాచెదారం పైన పడింది. ప్రవక్త మహనీయులు తల, వస్త్రాలు శుభ్రంగా దులుపుకొని తన దారిన తను వెళ్ళిపోయారు. రెండవరోజు కూడా అదేవిధంగా ఊడ్చిన చెత్తపైన బడింది.

ప్రవక్త ఆ మలినమంతా మళ్ళీ శుభ్రం చేసుకొని ముందుకు సాగిపోయారు. ప్రతిరోజూ ఇలానే జరిగేది. ఎవరో కావాలనే ప్రతిరోజూ పైన చెత్తాచెదారం వేయడం, ప్రవక్త వారిని ఏమీ అనకుండానే ఓ చిరునవ్వు నవ్వి దులుపుకుని వెళ్ళిపోవడం. ప్రతిరోజూ ఇదేతంతు. ఏం జరిగిందో ఏమో గాని ఒకరోజు ప్రవక్త మహనీయులు యధాప్రకారం అదే దారిన వెళ్ళారు. కాని ఆరోజు కసువు పడలేదు. ఆ రోజే కాదు, తరువాత రెండురోజులు కూడా ఎలాంటి చెత్తాచెదారం పడక పోయేసరికి చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఫలానా ఇంట్లో ఎవరూలేరా? ఏదైనా ఊరెళ్ళారా? అని.

ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుందని, కొన్నిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని వారుచెప్పారు. వెంటనే ప్రవక్త తను వెళుతున్న పని వాయిదా వేసుకొని, ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు తీవ్రజ్వరంతో బాధపడుతూ కుక్కిమంచంలో మూలుగుతోంది. వైద్యం, తిండి తిప్పలు లేని కారణంగా ఆమె బాగా నీరసించి పోయింది. ‘‘అమ్మా! ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా పరామర్శించారు. మంచినీళ్ళు తాగించారు. అత్యవసర సేవలు అందించి సపర్యలు చేశారు. ప్రతిరోజూ వచ్చి అవసరమైన ఏర్పాట్లుచేస్తూ, కోలుకునే వరకూ కనిపెట్టుకుని ఉన్నారు. తనపట్ల ప్రవక్త ప్రవర్తిస్తున్న తీరుకు ఆ వృద్ధురాలు ఆశ్చర్య చకితురాలైంది. తను ఆయనని ఛీత్కరించినా, థూత్కరించినా, చెత్తాచెదారం పైన పోసి అవమానించినా, ఆ మహనీయుడు తనపై చూపిన దయకు, చేసిన మేలుకు ముగ్దురాలైపోయింది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతూ, ప్రవక్తకు ప్రియ శిష్యురాలిగా మారిపోయింది.

ఒకసారి మస్జిదె నబవి లోకి ఒక తుంటరి ప్రవేశించాడు. ఆ మనిషి చాలా వికారంగా, అనాగరికంగా ఉన్నాడు. వచ్చినోడు ఊరుకున్నాడా.. లేదు.. మస్జిదులో మూత్రం పోశాడు. మసీదుకు వచ్చినోళ్ళుఊరుకుంటారా? ఈ దుశ్చర్యను చూసి అగ్రహోదగ్రులయ్యారు. పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తావా..అంటూ, తలా ఒక తిట్టు తిట్టారు. కొట్టేటంత పనిచేశారు. అంతలో ప్రవక్త మహనీయులు మస్జిదుకు వచ్చారు. విషయం తెలుసుకొని అనుచరుల్ని వారించారు. ఆ అపరిచితుడి పట్ల ప్రవర్తించిన తీరుకు మందలించారు. వెంటనే ఒక బిందెడు నీళ్ళు తెప్పించి ఆయన స్వయంగా శుభ్రపరిచారు. ‘బాబూ.. ఇది దైవారాధన చేసుకునే స్థలం కదా..!’ అని మాత్రమే అన్నారు ప్రేమగా.

ఈ సంఘటన ఆ మూర్ఖుడిలో అనూహ్యమైన పరివర్తన తీసుకొచ్చింది. అతడు గబగబా బయటికి వెళ్ళిపోయాడు. తలారా స్నానం  చేసివచ్చి, ప్రవక్త మహనీయుని ముందు సిగ్గుతో తలదించుకొని నిలబడ్డాడు. పరివర్తిత హృదయంతో ప్రవక్తవారి అనుంగుశిష్యుడిగా మారిపోయాడు. ఇదీ ప్రవక్త మహనీయుల వారి ప్రవర్తనా తీరు. ఆచరణ విధానం. సాఫల్యానికి పూబాట.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు